ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఎలా చనిపోయారో తెలుసుగాని ఎందుకు చనిపోయారో (మానసిక వ్యథ ఏమిటో) స్పష్టంగా తెలియదు. ఆయన మరణించిన మరుక్షణమే అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపణలు ప్రత్యారోపణలతో, విమర్శలు ప్రతి విమర్శలతో 'శవ రాజ కీయం' చేసిన తీరు చూశాం. ఏపీలో రాజకీయ దిగజా రుడుతనానికి ఇది పరాకాష్టగా నిలిచింది. సంతాప తీర్మానంలో పాల్గొనకుండా వైసీపీ రాజకీయం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శిస్తే, భూమా నాగిరెడ్డి మరణాన్ని రాజకీయం చేయకూడదనే మంచి అభిప్రాయంతో సంతాప తీర్మానానికి దూరంగా ఉన్నామని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు కారణంగానే భూమా చనిపోయారని వైకాపా ఆరోపిస్తోంది. అదెలా? అని చంద్రబాబు ప్రశ్నిస్తే పార్టీ మారితే మూడురోజుల్లో మంత్రిపదవి ఇస్తానని మభ్య పెట్టారని, ఏడాదైనా ఇవ్వలేదని, పైగా ఏవేవో షరతులు పెట్టారని, ఆ మానసిక వ్యథతోనే ఆయనకు గుండెపోటు వచ్చిందని వైకాపా చెబుతోంది. దీంతో ఆయనకు మంత్రిపదవి ఇస్తానని తానెప్పుడూ చెప్పలేదని చంద్రబాబు అన్నారు. మంత్రిపదవి ఇస్తానని బాబు హామీ ఇచ్చారని భూమా వైకాపాలోని తన సన్నిహితులకు చెప్పారట. ఆ విషయం కూతురు అఖిలప్రియకూ తెలుసునని అంటున్నారు.
మంత్రిపదవి ఇస్తానని తాను హామీ ఇవ్వలేదని చెప్పిన బాబు భూమాకు మంత్రి పదవి ఇవ్వవద్దని వైకాపా నాయకులు గవర్నర్‌ను కోరారని, కాబట్టి భూమా మరణానికి ఆ పార్టీయే కారణమంటూ రివర్స్‌గేర్‌లో వెళ్లారు. దీంతో వైకాపా నాయకులు భూమా ఫిరాయింపుదారు కాబట్టి మంత్రిపదవి ఇవ్వొద్దని చెప్పామని, ఆయనచేత రాజీనామా చేయించి, టీడీపీ నుంచి గెలిపించుకొని మంత్రిపదవి ఇస్తే అభ్యంతరం ఉండదని అన్నారు. కాని ఈ పని చంద్రబాబు చేయలేదు. కారణం? ఒక్కరి చేత రాజీనామా చేయించడం సాధ్యంకాదు. ఫిరాయింపుదారులందరితో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లాల్సివుంటుంది. కాని బాబుకు ఆ పనిచేసే ధైర్యంలేదు. రాజీనామా చేసినవారంతా గెలుస్తారనే నమ్మకంలేదు. ఫిరాయింపుదారుల్లో కొందరు 'దిగ్గజాలు' ఉన్నప్పటికీ ఎవ్వరికీ మంత్రి పదవులు ఇవ్వలేకపోయారు. భూమా వైకాపా నుంచి టీడీపీలో చేరగానే తాను, కూతురు రాజీనామా చేస్తామని చెప్పినా బాబు వారించారట..! ఫిరాయింపుదారుల్లో కీలక నాయకులకు మంత్రిపదవుల ఆశచూపింది వాస్తవం. ఇందుకు భూమా మినహాయింపు కాదు.
మంత్రిపదవులో, ఇంకోలాంటి పదవులో ఆశ పడకుండా ఏ నాయకుడైనా ప్రతిపక్షంలోంచి అధికార పక్షంలోకి వస్తాడా? కొన్నిరోజుల హైడ్రామా తరువాతనే భూమా తన కుమార్తెతో కలిసి టీడీపీలో చేరారు. ఏమీ ఆశించకుండా చేరితే ఇంతడ్రామా అవసరం ఉండదు. పదవి ఆశించని వాడైతే ప్రతిపక్షంలో ఉంటే మాత్రమేమిటి? ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెసు నుంచి ఎందుకు వచ్చారు? ఏదో ఆశించే కదా. వైకాపా, కాంగ్రెసు నుంచి ఫిరాయించిన వారిలో కీలక నాయకులకు మంత్రిపదవులు ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. వారంతా అందుకోసం కాచుకు కూర్చున్నారు. భూమా చనిపోగానే మీడియాలో వచ్చిన కథనాల్లో మంత్రిపదవిపై ప్రస్తావన ప్రముఖంగా ఉంది. వాస్తవానికి మంత్రి కావాలనేది ఆయనకు ఎప్పటినుంచో ఉన్న కోరిక. రాయలసీమలో బలమైన నాయకుడికి ఈ కోరిక ఉండటం అసహజం కాదు. కాని ఆయన మూడుసార్లు ఎంపీగా ఉండటం, ఇతర కారణాలరీత్యా రాష్ట్రంలో మంత్రి కాలేకపోయారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అప్పుడు జరుగుతుందని, ఇప్పుడు జరుగుతుందని మీడియాలో వార్తలురావడం తప్ప ఇప్పటివరకు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇందుకు కారణం ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వలేని పరిస్థితి (తెలంగాణలోనూ ఇంతే) ఏర్పడటమే ఇందుకు కారణం.
ఈ పరిస్థితి రావడానికి కారణం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విధించిన షరతు. ఏమిటా షరతు? ఫిరాయింపుదారులతో రాజీనామాలు చేయించి వారికి 'టీడీపీ ఎమ్మెల్యే' అనే ముద్రవేసి తీసుకొస్తే మంత్రులుగా ప్రమాణం చేయిస్తానన్నారు. గవర్నర్ ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణం టీడీపీయే. తెలంగాణ టీడీపీలో ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా మిగిలినవారు టీఆర్‌ఎస్‌లోకి జంప్ చేశారు. దీనిపై టీడీపీ తీవ్రంగా ఆగ్రహించింది. టీడీపీకి రాజీనామా చేయని తలసాని శ్రీనివాస యాదవ్‌తో గవర్నర్ మంత్రిగా ప్రమాణం చేయించారు. ఇది రాజ్యాంగపరంగా, నైతికంగా, సాంకేతికంగా తప్పు. గవర్నర్‌కు ఈ విషయం తెలియదో, తెలిసినా కేసీఆర్‌తో తలనొప్పి ఎందుకులే అని సర్దుకుపోయారో తెలియదు. మొత్తంమీద టీడీపీ ఎమ్మెల్యేగానే తలసాని మంత్రిపదవిలో కొనసాగుతున్నారు. తన రాజీనామా లేఖ స్పీకర్ దగ్గర ఉందని ఆయన చెబుతున్నా నిజానిజాలు తెలియవు. తలసానికి మంత్రిపదవి ఇవ్వడాన్ని చంద్రబాబుతో సహా టీడీపీ నాయకులంతా తప్పుపట్టారు. గవర్నర్‌పై విమర్శలు కురిపించారు. దీంతో నరసింహన్‌కు తాను చేసిన తప్పు తెలిసింది. అందుకే ఏపీలో ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే తెలంగాణలోనూ కేసీఆర్ ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు ఇవ్వలేకపోతున్నారు.
ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా ఫిరాయింపుదారులంతా సాంకేతికంగా వారివారి సొంత పార్టీల ఎమ్మెల్యేలే అవుతారు గాని అధికార పార్టీల ఎమ్మెల్యేలు కారు. ఈ నేపథ్యంలో తనకు మంత్రిపదవి రాదని భూమాకు అర్థమైపోయుంటుంది. ఆయన మరణానికి ఆ మానసిక వ్యథ కొంత కారణమై ఉండొచ్చు. ఫిరాయింపుదారులు ఉపఎన్నికల్లో గెలిచి అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ముద్ర వేయించుకోనిదే వారికి మంత్రిపదవులు రావని భూమా మరణంతో మరింత స్పష్టమైంది. అసెంబ్లీలో సంతాప సమావేశం నిర్వహించినప్పుడు భూమా నాగిరెడ్డి ఏ పార్టీ ఎమ్మెల్యేనో చెప్పుకోలేని పరిస్థితి టీడీపీకి ఏర్పడింది. 'పచ్చ' కండువా కప్పుకున్నంత మాత్రాన టీడీపీ ఎమ్మెల్యే అయిపోడు. ఆయన సాంకేతికంగా వైకాపా ఎమ్మెల్యేనే. సంతాప సమావేశంలో తమ ఎమ్మెల్యే చేసిన తప్పులను కూడా చెప్పి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించడం ఇష్టంలేకనే దూరంగా ఉన్నామని వైకాపా నాయకులు చెప్పారు.
రాజకీయ నాయకులు తామున్న పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించినప్పుడు వారికి ప్రధాన ఆశ, ధ్యాస మంత్రిపదవి. అదీ కుదరకపోతే ఏదో ఒక ప్రాధాన్యమున్న పదవి, అధికారం చెలాయించగలిగే కీలకపోస్టు కోరుకుంటారు. రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను చూసి, సంతోషించి తాము పార్టీ మారుతున్నామని, పదవుల కోసం కాదని పైకి చెబుతారు. కాని అసలు నిజం అదికాదని వారితో పాటు జనాలకూ తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిరాయింపుదారుల్లో కీలక నాయకులు, ముఖ్యమంత్రుల నుంచి మంత్రిపదవుల కోసం హామీలు పొందిన నేతలు వాటికోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కాని అనేక కారణాలతో రెండు రాష్ట్రాల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముందుకు సాగడంలేదు. దీంతో ఫిరాయింపుదారులు ఆశ-నిరాశల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. అనుకున్నది జరగకపోవడంతో పార్టీ మారి తప్పు చేశామా? అని బాధపడుతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. టీఆర్‌ఎస్, టీడీపీలోని ఒరిజినల్ నాయకులు, ఫిరాయింపుదారుల్లో సీనియర్లయినవారు జూనియర్ ఫిరాయింపుదారులకు విలువ ఇవ్వడంలేదు. వారిని పురుగుల్లా చూస్తున్నారు. తెలంగాణలో, ఆంధ్రాలో అసలు నాయకులకు, ఫిరాయింపుదారులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. విభేదాలు ముదురుతున్నా యి. కాని టీఆర్‌ఎస్‌లోని గొడవలు మీడియాలో పెద్దగా ఫోకస్ కావడంలేదు. కాని ఆంధ్రాలో విభేదాలు బహిర్గతమై టీడీపీ అధినేత కమ్ సీఎం చంద్రబాబుకు తలనొప్పి తెప్పిస్తున్నాయి.
-నాగ్ మేడేపల్లి