ఓటింగ్ మిగిల్చిన ప్రశ్నలు

దాదాపు పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఓటింగ్ ముగిసిన తరువాత జవాబు ఇప్పుడే దొరకని ప్రశ్నలు కొన్ని వినిపిస్తున్నాయి. 

-హైదరాబాద్, బంగళూరుల నుంచి ఈసారి అతి భయంకరమైన సంఖ్యలో ఓటర్లు తరలి వెళ్లారు ఆంధ్రకి. వీరంతా ఎవరికి ఓటు వేయడానికి వెళ్లినట్లు? అన్ని ఇబ్బందులు పడుతూ కేవలం ఓటు హక్కు కోసమే వెళ్లారా? గతంలో ఇంతలా ఎప్పుడూ వెళ్లలేదు. మరి తెలుగుదేశం టఫ్ ఫైట్ ఎదుర్కొంటోందని, చంద్రబాబుకు అండగా వుండాలని వెళ్లారా? లేదా ఈసారి ఎలాగైనా జగన్ ను గెలిపించాలని వెళ్లారా?

-సాధారణంగా ఇళ్లకు వెళ్లి, రమ్మని బతిమాలి పోలింగ్ కేంద్రాలకు జనాలను తీసుకురావడం గతంలో జరిగేది. ఇది కామన్. కానీ ఈసారి జనాలు పొద్దుటి నుంచే పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. అది కూడా అందరూ నవ్వుతూ, తుళ్లుతూ, హుషారుగా వచ్చారనే అన్నివైపుల నుంచి వార్తలు అందుతున్నాయి. మరి దీని భావం ఏమిటి? ఇది ఎవరికి అనుకూలం? ఎవరి విజయానికి సంకేతం?

-ఈసారి మహిళలు, ముఖ్యంగా వృద్దులు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు స్వచ్ఛందంగా వచ్చారు. గతంలో కూడా వృద్దులు వచ్చేవారు కానీ, ఈసారి మరీ ఎక్కువగా వచ్చారు. వృద్దాఫ్య పింఛను పెంచిన ప్రభావం ఇది అని, తెలుగుదేశం పట్ల కృతజ్ఞత ప్రదర్శించడానికి వచ్చారని జనాల్లో టాక్ వినిపిస్తోంది. ఇది నిజమేనా?

-మహిళలపై పసుపు కుంకుమ స్కీము పనిచేసిందని, అందుకే మహిళలు పెద్దసంఖ్యలో ఓటింగ్ కు వచ్చారని టాక్ వినిపిస్తోంది. కాదు, మహిళల్లో కూడా చీలిక వచ్చిందని, జగన్ కు అవకాశం ఇద్దామని వచ్చారని మరో టాక్. ఏది నిజం?

-పోలింగ్ ఇలా స్టార్ట్ కాగనే దేశం అనుకూల మీడియాలో, వెబ్ సైట్లలో వైకాపా దౌర్జన్యాలకు పాల్పడతోందని, దేశానికి ఓట్లు వేస్తే, వైకాపాకు పడుతున్నాయని గోల మొదలైంది. కానీ మద్యాహ్నం వేళకు ఆ మీడియా అంతా సైలంట్ అయింది. ఎందువల్ల? ట్రెండ్ దేశానికి అనుకూలంగా వుందని ఏమైనా అంచనా అందిందా?

మొత్తంమీద సాయంత్రం పోలింగ్ ముగిసేసరికి ఇలా చాలా ప్రశ్నలు. రేపు ఉదయానికి పార్టీల లెక్కలు అన్నీ ఓ కొలిక్కి వస్తే ఓ అంచనాకు రావచ్చు. అప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చు.

Show comments