ఓటేద్దాం.. బాధ్యతను పూర్తిచేద్దాం!

సామాజిక బాధ్యత అంటే సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేయడమేకాదు.. అసలు సిసలైన బాధ్యత ఓటు వేయడమే! ఓటు హక్కు మన రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కు. అయితే దీన్ని బాధ్యతగా తీసుకుంటే దేశానికి మంచి చేసినవారు అవుతాం. ప్రత్యేకించి నగరాల్లో పోల్‌ పర్సెంటేజ్‌ నానాటికీ తగ్గిపోతూ ఉండటం గమనించాల్సిన అంశం.

పోలింగ్‌ రోజు అంటే దాన్నొక సెలవు దినంగా తీసుకునేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికలప్పుడు అదే జరిగింది. పోలింగ్‌ రోజున అన్ని కార్యాలయలకూ సెలవులు రావడం, అదే సమయంలో లాంగ్‌ వీకెండ్‌ ఏర్పడటంతో.. చాలామంది ఊర్లకు, టూర్లకు పయనం అయ్యారు. ఫలితంగా.. ఓటు హక్కు వినియోగించుకోనే లేదు. హైదరాబాద్‌ నగర పరిధిలో పోలింగ్‌ పర్సెంటేజ్‌ చాలావరకూ తక్కువే నమోదైంది.

గ్రామస్థాయిల్లో ఉండే, చదువుకోని వాళ్లతో పోలిస్తే.. చదువుకున్న వాళ్లు ఓటు హక్కును వినియోగించుకోవడంలో మొదటినుంచి వెనుకబడి ఉన్నారు. మళ్లీ ఇలాంటి వాళ్లే ఓటు విషయంలో ఆందోళన వ్యక్తంచేస్తూ ఉంటారు. ఓట్లను పార్టీలు కొనేస్తూ ఉన్నాయని, రాజకీయం వ్యాపారమయం అయిపోయిందని.. వాపోతూ ఉంటారు.

ముందు మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఇలాంటి మాటలు ఎన్నిచెప్పినా ప్రయోజనం ఉండదు. ప్రతి ఎన్నికలప్పుడూ కనీసం పాతికశాతం మంది ఓటు హక్కును వినియోగించుకోవడం లేదంటే.. ఎన్నికల ఫలితాలకే అర్థంలేకుండా పోతోంది.

గెలిచిన అభ్యర్థులు కేవలం సాధిస్తున్నది ఒకటీ రెండుశాతం లీడ్స్‌. అనేకమంది పోటికిదిగుతూ ఉన్న నేపథ్యంలో.. గెలిచిన అభ్యర్థికి పడిన ఓట్లతో పోలిస్తే.. ఓడిన వారికి పడిన ఓట్లశాతం ఎక్కువగా ఉంటున్న దాఖలాలూ కనిపిస్తున్నాయి. అంటే ఓటేసిన వారిలో కూడా మెజారిటీ ఓటర్లు తమ నేతకు అనుకూలంగా లేరు. వ్యతిరేకంగా ఓటేసినవారే ఎక్కువ ఉంది.

ప్రజాస్వామ్యంలో ఈ విచిత్రం సబబే అనుకున్నా.. అరవై నుంచి డెబ్బైశాతం మంది ఓటేస్తే వచ్చే ఫలితాలకూ.. ప్రతిఒక్కరూ నిర్బందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటే వచ్చే ఫలితాలకూ చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని చూపడం మీ చేతుల్లోనే ఉంది.

ఓటు హక్కును వినియోగించుకోవడం అనే బాధ్యతను పూర్తిచేయండి. పోలింగ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి.. ఇప్పుడే ఆఫీసుల్లో మీ ప్రాంతంలో పోలింగ్‌ రోజుకు సెలవు తీసేసుకోవడం ఉత్తమం!
-ఎల్‌.విజయలక్ష్మి

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?

Show comments