విశ్వేశ్వరరెడ్డిని మరిచిన జగన్‌.. శ్రేణుల్లో చర్చ!

మొదటి నుంచి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వెంట నిలిచిన వారిలో ఒకరు విశ్వేశ్వర రెడ్డి. అనంతపురం జిల్లాకు చెందిన విశ్వేశ్వర రెడ్డి ఆది నుంచి జగన్‌కు గట్టి సపోర్టర్‌గా నిలిచారు. ఆయనేమీ భారీగా ఆర్థికబలం ఉన్ననేత కాకపోవచ్చు, అంగబలం కూడా మరీ గొప్పగా లేకపోవచ్చు. అయితే గత ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యే పదవిలో కొనసాగి జగన్‌ మోహన్‌రెడ్డి వెన్నంటి నిలవడమే విశ్వేశ్వరరెడ్డి గొప్పదనం.

ఒకవైపు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి తెగ ఉత్సాహం చూపించారు. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. వారిలో జగన్‌ తన కుటుంబ సభ్యులుగా భావించినవారు కూడా ఉన్నారు. తన కుటుంబీకులు అనుకున్నవారు కూడా ఫిరాయించడం పట్ల జగన్‌ మోహన్‌రెడ్డి అప్పుడు ఆవేదన భరితంగా స్పందించారు. వెళ్లిపోయిన వారిని బతిమాలాల్సిన అవసరం జగన్‌కు రాలేదు. ఫిరాయింపు రాజకీయాలను జనాలు అసహ్యించుకున్నారు అది వేరే కథ.

అలాంటి పరిస్థితుల నడుమ అనేకమంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు తనవైపుకు తిప్పుకోవాలని చూశారనేది బహిరంగ సత్యం. చంద్రబాబు లెక్క ఇరవై మూడు మందితో ఆగలేదు. మరింత మందిని చేర్చుకోవాలనే అనుకున్నారు. అయితే మిగతావారు మాత్రం చంద్రబాబు బుట్టలో పడలేదు. అలా చంద్రబాబు బుట్టలో పడనివారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నెగ్గారు. కానీ త్రుటిలో విజయాన్ని మిస్‌ చేసుకున్న నేత విశ్వేశ్వరరెడ్డి. ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఆయన ఓడిపోయారు.

అందుకు పలు కారణాలున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అక్కడ గ్రూపులు ఏర్పడ్డాయి. విశ్వేశ్వరరెడ్డి తమ్ముడు ఒకరు తనకు టికెట్‌ కావాలంటూ పేచీ పెట్టారు. అలాగే మరోనేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.శివరామిరెడ్డి కూడా ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. టికెట్ల ఖరారు సమయంలో శివరామిరెడ్డి జగన్‌ ఇంటి వద్ద హల్చల్‌ చేశారు. తనకు టికెట్‌ కేటాయించాలంటూ పట్టుబట్టారు. అయితే జగన్‌ వాళ్లకు ప్రాధాన్యతను ఇవ్వలేదు. విశ్వేశ్వరరెడ్డికే అవకాశం ఇచ్చారు.

అక్కడి వరకూ ఓకే. అయితే విశ్వేశ్వరరెడ్డికి కాలం కలిసిరాలేదు. జగన్‌ గాలిలో కూడా ఆయన ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు. దాదాపు రెండువేల ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయిన నేఫథ్యంలో ఆయనను జగన్‌ ఆదరిస్తారని చాలామంది అనుకున్నారు. త్రుటిలో ఓటమిపాలైన ఆయనకు నామినేటెడ్‌ పదవి కచ్చితంగా దక్కుతుందని, ఎమ్మెల్సీగా అవకాశం లభిస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఆ అవకాశం వచ్చినా విశ్వేశ్వరరెడ్డికి ఛాన్స్‌ దక్కలేదు. ఆ అవకాశాన్ని వేరేవాళ్లు తన్నుకుపోయారు. ఎమ్మెల్సీగా నామినేట్‌ అయిన మోపిదేవి వెంకటరమణ, ఇక్బాల్‌ల సంగతలా ఉంటే, కర్నూలుజిల్లా నేత చల్లాకు అవకాశం లభించడం అనేకమందిని ఆశ్చర్యపరించింది. ఎన్నికలకు వారం ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు ఆయన. బనగానపల్లెలో వైఎస్సార్సీపీ విజయం కోసం ఆయన పని చేశారనే లెక్కలతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.

బనగానపల్లె రాజకీయం ఎలా ఉన్నా, విశ్వేశ్వరరెడ్డికి అవకాశం దక్కాల్సిందనే భావన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో వ్యక్తంఅవుతూ ఉంది. ఇది విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన అంశమే కాదు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో మొదటి నుంచి జగన్‌ వెంట నిలిచిన వారికి అవకాశం లభించాలనే కోణంలో ఈ అంశం ఆ పార్టీ శ్రేణుల్లోనే చర్చనీయాంశంగా మారింది.

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

Show comments