ఆమెకు మంచి రోజులొచ్చాయా?

గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మౌనంగా అజ్ఞాతంలో ఉండిపోయిన తెలంగాణ కాంగ్రెసు నాయకురాలు విజయశాంతి మళ్లీ ఉత్సాహంతో రంగంలోకి దిగారు. పార్టీలో తనకు కీలక బాధ్యతలు అప్పగిస్తేనే మళ్లీ చురుగ్గా పాల్గొనాలని అనుకున్న విజయశాంతి కోరిక నెరవేరింది. తనకు సరైన పదవి ఇవ్వలేదని, ప్రాధాన్యం దక్కలేదని సన్నిహితుల వద్ద వాపోయిన ఆమె ఆవేదనను పార్టీ తీర్చింది.

పార్టీ ఆమెకు స్టార్‌ క్యాంపెయినర్‌గా కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ప్రధాన ప్రచారకర్తగా ఆమె టీఆర్‌ఎస్‌ను చెడుగుడు ఆడుకోవల్సివుంటుంది. కోమటి వెంకటరెడ్డి అధ్యతన ప్రచార కమిటీని నియమించారు. గత ఎన్నికల్లో కాంగ్రెసు తరపున పోటీ చేసి ఓడిపోయినప్పటినుంచి ఈమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.  గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు కాంగ్రెసుకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఆమె కాంగ్రెసులో ఉన్నట్లు జనం ఎప్పుడో మర్చిపోయారు.   

వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గానికి  ఉప ఎన్నిక   కురుక్షేత్ర సంగ్రామంలా జరిగింది. కాంగ్రెసు నాయకులకు  విజయశాంతి  గుర్తుకు వచ్చి ప్రచార బృందంలో ఆమె తప్పనిసరిగా ఉండాలని అనుకున్నారు. అధిష్టానం కూడా ఆమెతో ప్రచారం చేయించాలని చెప్పింది.  అందుకని నువ్వు వచ్చి ప్రచారం చేస్తే అది కాంగ్రెసుకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది' అని చెప్పారు. కడవ మీద కడవ పెట్టుకురానక్కర్లేదని, అడుగు బయటపెట్టి నాలుగు మాటలు మాట్లాడితే చాలని వేడుకున్నారు. వారికి మౌనమే సమాధానమైంది.

రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆమె ప్రచారం చేయలేదు. టీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యాల మీద ఒక్కనాడూ మాట్లాడలేదు.  ఆమె బయటకు రాకపోవడానికి ఆరోగ్య సమస్యలు కారణమని అప్పట్లో అన్నారు.  విజయశాంతి అనే నాయకురాలు ఉందని ప్రజలు మర్చిపోతున్న దశలో ఆమెను మళ్లీ ట్రాక్‌ మీదికి తెచ్చి పూర్వవైభవం కల్పించాలని కాంగ్రెసు అధిష్టానం ప్రయత్నాలు చేసింది. ఒకసారి ఢిల్లీ వెళ్లి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలుసుకొని తాను మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని చెప్పినా మళ్లీ మౌనంగానే ఉండిపోయింది.

ఈ నేపథ్యంలో ఈ నెల (సెప్టెంబరు) 15వ తేదీ తరువాత తాను కాంగ్రెసు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని ఆమె ప్రకటించింది. ఆమె రీఎంట్రీ ఇవ్వడానికి కీలక బాధ్యతలే కారణమనుకోవచ్చు.   టీడీపీ-కాంగ్రెసు పొత్తును నిరసిస్తూ వ్యాఖ్యలు చేసిన విజయశాంతి అదే సందర్భంలో తాను మళ్లీ చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటానని చెప్పడం విశేషం.

తెలంగాణ కాంగ్రెసులో సీనియర్‌ నేతలు, వక్తలు చాలామంది ఉన్నప్పటికీ రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయడానికి ప్రధాన ప్రచారకర్తగా (స్టార్‌ క్యాంపెయినర్‌) ఎవ్వరినీ ఎంపిక చేసుకోలేకపోతున్నారని ఈమధ్య వార్తలొచ్చాయి. నేతల్లో సమన్వయం లేకపోవడం, ఆధిపత్య ధోరణలు ఇందుకు కారణమని నాయకులన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి, రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జైపాల్‌ రెడ్డి, విజయశాంతి తదితర సీనియర్లు ఉన్నా కాని వీరిలో ఏ ఒక్కరిని కూడా ప్రధాన ప్రచారకర్తగా ఫోకస్‌ చేసేందుకు పార్టీ సిద్ధంగా లేదన్నారు.

తమ పార్టీకి రాహుల్‌ గాంధీయే స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉంటారని చెప్పారు. కాని చివరకు విజయశాంతిని ఎంపిక చేశారు. గత ఎన్నికల నుంచి పార్టీతో సంబంధం లేకుండా అజ్ఞాతంలో ఉన్న నేతను ప్రధాన ప్రచారకర్తగా నియమించడం విశేషమే. మరి ఇన్నేళ్లు ప్రజల మధ్య లేకపోవడానికి విజయశాంతి ఏం కారణం చెబుతారు?

Show comments