చంద్రబాబు తరహాలోనే కేసీఆర్ పతనం కూడా!

అధికార టీఆర్ఎస్ పార్టీలో మొదలైన అసమ్మతిని తనదైన శైలిలో విశ్లేషించారు కాంగ్రెస్ నేత విజయశాంతి. గతంలో చంద్రబాబుకు ఎదురైన పరాభవమే ఇప్పుడు కేసీఆర్ కు కూడా ఎదురయ్యేలా ఉందని అభిప్రాయపడ్డారు. "నా మాటే శాసనం" అనుకునే కేసీఆర్ కు త్వరలోనే పరాభవం తప్పదంటున్నారు.

"సరిగ్గా 19 ఏళ్ల క్రితం చంద్రబాబు క్యాబినెట్‌ను విస్తరించిన తర్వాత తలెత్తిన అసమ్మతి గుర్తుకువస్తోంది. అప్పటివరకు తనకు తిరుగులేదు అనుకున్న చంద్రబాబుకి, అప్పట్లో జరిగిన క్యాబినెట్ విస్తరణ తర్వాత గడ్డురోజులు మొదలయ్యాయి. తనకు మంత్రిపదవి దక్కకపోవడంతో కేసీఆర్ తిరుగుబాటు చేయడం... చివరకు అది టిడిపి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే గతంలో చంద్రబాబుకి ఎదురైన అనుభవమే ఇప్పుడు కేసీఆర్ కి కూడా ఎదురవుతుందన్న అభిప్రాయం కలుగుతోంది."

అసమ్మతి గళం వినిపిస్తున్న నేతలను బెదిరించి... వారితో తనకు మద్దతుగా ప్రకటనలు చేయించుకుంటూ, సంక్షోభ నివారణకు కేసీఆర్ ప్రయత్నాలు చేయవచ్చు కానీ.. రోజురోజుకు పెరిగే అసంతృప్తిని అడ్డుకోవడం ఆయన తరంకాదని అభిప్రాయపడ్డారు విజయశాంతి.

"టీఆర్ఎస్‌లో వినిపిస్తున్న నిరసన గళాన్ని చూస్తూ ఉంటే.. గతంలో మాదిరిగా కేసీఆర్ పేరు చెబితే భయపడే రోజులు పోయాయనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. తను కనుసైగ చేస్తే వణికిపోయే పరిస్థితి నుంచి.. తనకు వ్యతిరేకంగా మాట్లాడే స్థాయికి టిఆర్ఎస్‌లో అసమ్మతి వర్గం పెరుగుతోందంటే.. దానివెనక ఉన్న అదృశ్య శక్తి ఏమిటో కేసీఆర్ కి ఈపాటికే అర్ధమై ఉంటుంది"

అవకాశం చిక్కినప్పుడల్లా టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను విమర్శించడానికి వెనుకాడని విజయశాంతి, ఇప్పుడీ అసమ్మతిని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తెరవెనక బీజేపీ చేస్తున్న కుయుక్తుల వల్లనే టీఆర్ఎస్ కు ఈ ఖర్మ పట్టిందనే అర్థం వచ్చేలా మాట్లాడారు విజయశాంతి.

ఎంత పని చేసావయ్యా సుజీత్‌!