విజయమ్మ ఆవేదన భరిత ప్రకటన

నిరంతరం ప్రజల కోసమే పాటుపడుతున్న తన కుమారుడు వైఎస్‌ జగన్‌ను జనం నుంచి వేరు చేయలేరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ తెలిపారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం, జగన్‌ క్షేమం కోసం ప్రార్థనలు చేయగలను, కానీ తన కుమారుడికి రాష్ట్ర ప్రజానీకమే భరోసా ఇ‍వ్వాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆమె ఏం మాట్లాడారంటే..

‘వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు తిరిగి వెళ్తుండగా.. కృతజ్ఞతను, విన్నపాన్ని తెలపాడానికి మీ ముందుకు వచ్చాను. రాష్ట్ర ప్రజానికానికి ఎంతో రుణపడి ఉన్నాం. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరెడ్డిని, కార్యకర్తలకు, తమ కుటుంబాన్ని ప్రేమించే ప్రతి సన్నిహితుడికి హృదయ పూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. జగన్‌ కోలుకోవాలని, ప్రతి ఒక్కరు ప్రార్ధించారు.. ప్రేమించారు. వారందరికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది.

మహానేత వైఎస్సార్‌ను నాయకుడిగా గుర్తించి 30 ఏళ్లు ఆరాధించారు. ఆయన సీఎం అయిన తరువాత ప్రజలందరిని ఆదుకున్నారు. నాన్న ఎప్పుడు నన్ను ఒంటరి చేయలేదని జగన్ అంటూ ఉంటారు‌. ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు అని చెబుతుంటారు. వైఎస్‌ జగన్‌కు ఇది పునర్జన్మ. గొంతులో దిగాల్సిన కత్తి అదృష్టవశాత్తు భుజానికి తగిలింది. ప్రజల ప్రేమ, దీవెనెలతోనే ఈ ప్రమాదం నుంచి జగన్‌ తప్పించుకున్నారు.

వైఎస్సార్‌సీపీ తొలి ప్లీనరిలోనే నా కొడుకును మీకు అప్పజెప్పుతున్నానని ప్రకటించా. అప్పటి నుంచి ఆయన ప్రజల మధ్యనే ఉన్నాడు. ఓదార్పు యాత్రలో మీరే ఆయనను ఓదార్చారు. ప్రజా సమస్యలతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేకహోదా విషయంలో అనేక ఉద్యమాలు చేశారు. ఇడుపులపాయ నుంచి మొదలైన పాదయాత్ర 11 జిల్లాల మీదుగా సుమారు 3200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఇది ప్రజాఆశీర్వాదం వల్లే సాధ్యమైంది.

ప్రతిపక్షనేతపై దాడి జరుగుతుందని ఒక పెద్దమనిషి అన్నారు. అప్పుడు నేనేం చేయలేదు. దేవుడిని మాత్రమే ప్రార్ధించాను. గోదావరి జిల్లాలో అంతం చేయాలని రెక్కీ జరిగిందని అక్కడ కుదరకపోవడంతో ఎయిర్‌పోర్ట్‌లో ఆ పని చేశారు. అక్కడైతే ఎవరు అడ్డుకోరని ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నట్లు నేను అనుకుంటున్నా.

తల్లి, భార్య, చెల్లెలిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మౌనంగా సహిస్తున్నాం. భరిస్తున్నాం. రాజశేఖర్‌ రెడ్డి ఏ పార్టీకి అయితే 30 ఏళ్లు సేవ చేశాడో ఆపార్టీ ఆ మహానేతను దోషిని చేసింది. ఇప్పటికి వేధిస్తుంది. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని వైఎస్‌ జగన్‌పై అన్నిదాడులు చేయించి 16 నెలలు జైలులో పెట్టారు. దేశంలో ఏ నాయకుడికి నాకు తెలిసి ఇన్ని వేధింపులు ఎదొర్కోలేదు. అయినా జగన్‌ దేనికి చలించలేదు, అదరలేదు.

అన్ని సమస్యలను పక్కనపెట్టి ప్రజల మధ్య ఉండి పోరాడుతున్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగి 17 రోజులవుతుంది. అయినా ఈ కేసులో పురోగతి లేకపోగా ఎక్కడేసిన గొంగళిలా అక్కడే ఉంది. గాయం ఎంత లోతు ఉందని, డీజీపీ, సీఎం, మంత్రులు మాట్లాడుతున్నారు. విచారణ జరపకుండా రోజుకో మాటతో పబ్బం గడుపుతున్నారు.

వీఐపీ లాంజ్‌లోనే భద్రతా లేకుంటే ఎలా అని అడుగుతున్నా. చిన్న గుండుసూది కూడా తీసుకుపోనివ్వని ఎయిర్‌పోర్ట్‌లోకి ఏ విధంగా కత్తులు వెళ్లాయి? ఎవరు సహకరించారనే దిశలో విచారణ జరగడం లేదు. ఘటన జరిగిన గంటలోనే విచారణ జరగకుండా డీజీపీ దాడిచేసింది జగన్‌ అభిమానని ఎలా చెబుతారు? సీఎం అలానే మాట్లాడుతారు. అలిపిరి ఘటనలో ఆనాడు వైఎస్‌ఆర్‌ చంద్రబాబును పరామర్శించలేదా? గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలుపలేదా? ఇప్పుడు చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నారు.

కన్నకొడుకుపై ఆరోపణలు వస్తే సీబీఐ విచారణ జరిపించిన చరిత్ర వైఎస్సార్‌ది. అభిమాని అంటూ రోజుకో ప్లెక్సీలు సృష్టిస్తున్నారు. అభిమానైతే ఇన్నిరోజులు జగన్‌ అక్కడి నుంచే వెళ్లి వస్తున్నాడు ఏరోజు ఎందుకు కలవలేదు. ఒకవేళ అభిమాని అయితే విచారణ చేయవద్దా? అని అడుగుతున్నా. ఘటన జరిగిన తరువాత లేఖలు ఎలా వచ్చాయి. ముడతలు లేని లేఖలో మూడు నాలుగు రాతలు ఉన్నాయంటే మరో సమాధానం చెబుతారు.

నిష్పాక్షికమైన విచారణ జరగాలని కోరుతున్నా. ఎవరైతే ఈ హత్యాయత్నం చేశారో వారికి ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని చెబుతున్నాను. ఇప్పటికే వైఎస్ఆర్‌ను పోగొట్టుకొని బాధలోఉన్నాం. నా కడుపుకొట్టొద్దని చేతులెత్తి నమస్కారం చేస్తున్నా.’ అని విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు.

మీటూ... సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments