విజయసారథులు - షావుకారు

విజయా వారు తమ తొలి చిత్రాన్ని అంతకుముందు రానివిధంగా తెలుగుదనంతో తీయాలని భావించారు. చక్రపాణి స్క్రిప్ట్‌ రాశారు. ఆయనదే కథ, స్క్రీన్‌ప్లే, మాటలు. నిర్మాణ బాధ్యత కూడా ఆయనదే. విజయ సంస్థకు తల్లిలాంటి సంస్థ వాహిని. వాహిని చిత్రాలు ప్రతిష్టాత్మకం. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తమిళ, కన్నడ, కేరళ రాష్ట్రాలలో కూడా ప్రదర్శింపబడి కీర్తి, కాసూ సంపాదించుకున్నాయి. డబ్బింగ్‌ తెలియని రోజులు. అన్ని చిత్రాలు తెలుగు భాషలోనే విడుదల అయ్యాయి. ఉత్తమ ధోరణుల్లో వున్న సినిమాలు కాబట్టి భాష పట్టించుకోలేదు ప్రేక్షుకులు. వందేమాతరం, సుమంగళి, దేవత, భక్తపోతన, స్వర్గసీమ, యోగివేమన, అంతకు ముందు వచ్చిన వాహిని చిత్రాలు. నాణ్యత, నైపుణ్యాలతో నిర్మించబడ్డ చిత్రాలు. అంతటి నైపుణ్య, నాణ్యతల్నీ 'షావుకారు'లో చూపించాలని మంచి టెక్నిషియన్లని ఎన్నుకున్నారు.

మార్కస్‌ బార్‌ట్లీ ఛాయా, గోఖరే కళాదర్‌లు, కళా, గంటసాల సంగీతం, ఎ.క్రిష్ణణ్‌ శబ్ధగ్రహణం. ఇటీవల కాలంలో సినిమా పేరు కింద 'టాగ్‌ లైన్‌' అనిపిస్తే కొత్తదనం అనుకున్నాం గాని, 'షావుకారు'కే అని అలాంటి రెండవ పేరు వేశారు. 'ఇరుగు పొరుగుల కథ' అది. సొంత స్టూడియో అందరూ అందుబాటులో ఉన్న నటులు గనుక, 'షావుకారు' తక్కువ వ్యవధిలోనే పూర్తయింది. మొత్తం గ్రామీణ కథ వాతావరణం, సినిమా ఆరంభం మన హరికథతో. అంతం బుర్రకథతో. ఈ రెండు కళాప్రక్రియలు తెలుగువారివి. హీరో ఎన్టీఆర్‌ అండ్‌ పట్నంలో కాలేజీలో చదువుకుంటున్నా ప్యాంటు వేయడు.. చక్కగా పంచె కట్టుకుని వుంటాడు. పైన కోటు, ఆ ఊర్లో చెంగయ్య షావుకారు, పలుకు బిడిగలవాడు.

అందరికి అప్పులు ఇచ్చి వడ్డీలు కట్టించుకుంటాడు. తన పొరుగునే, ఎంతో సాహిత్యం ఉన్న రంగయ్యకు కూడా అప్పు ఇస్తాడు. రంగయ్య కూతురు సుబ్బులు, చెంగయ్య కొడుకు సత్యం. అసలు, పాత్రలకు పేర్లు పెట్టడంలో కూడా తెలుగుదనం చూపించారు. అంతకు ముందు వచ్చిన హీరోయిన్ల పేర్లకు భిన్నంగా ఇందులో సుబ్బులు అని పేరు పెట్టడం ఎంత ఔచిత్యమో! ఊళ్లో అందరికీ ఉపయోగపడాలని షావుకారు చెంగయ్య తాతలు ఒక సత్రం కట్టించారు. బీదబిక్కలతో పాటూ, తర్వాత పాడుకుంటూ జీవించే అంధుడు కూడా ఆ సత్రంలోనే ఉంటాడు. షావుకారుకి కుడిభుజం సన్నం రంగడు అనే రౌడీ. ఎస్వీ.రంగారావు అంతకుముందు, 1946లో వచ్చిన 'వరూథిని'లో ప్రవరుడి పాత్ర ధరించిన, చిత్రం పరాజయం పొందడంతో ఉద్యోగాలు చేసుకుంటూ బతికారు. మళ్లీ 'మనదేశం'లో చిన్న పాత్ర వేయడంతో పునఃప్రవేశం జరిగింది.

సాధారణంగా రౌడీలు కళ్లు పెద్దవి చేసుకోవడం గట్టిగా అరవడం వంటి పాత్రలు ఉండేవి. కానీ షావుకారులో రౌడీ చాలా నెమ్మదిగా మాట్లాడుతాడు. ఇదోక కొత్తదనం.. రౌడీ పాత్రను రంగారావు ఒక రిక్షావాడిని చూపి అనుకరించినట్లు చెప్పేవారు. కూర్చోవడం, బీడీ కాల్చడం మొదలైన చేష్టలు రిక్షావాడి దగ్గర సంపాదించినట్లు చెప్పారాయన. చిత్రంలోని పాత్రలన్నీ భిన్నత్వంతోనే ఉన్నా, చాకలి రామ పాత్ర కూడా ఎంతో ఆకర్షణీయంగా చిత్రించారు. మద్యమద్యలో ప్రవేశిస్తూ ఆ పాత్ర గిలిగింతలు పెడుతుంది. అంతిమ దృశ్యంతో రామ పాత్రకే అందరి ఓట్లు పడతాయి. హాస్య పాత్రలు వేసే కనకం ఆ పాత్రలో ఎంతో సహజంగా నటించింది. ఏ పాత్ర కూడా అనవసరం అనిపించదు.

కిరాణా వ్యాపారం చేసుకునే రేలంగి తక్కువ దృశ్యాల్లోనే కనిపించిన అద్భుతమై నటన చూపించాడు. ఎన్నో చిత్రాల్లో నటించిన శాంతకుమారి ఇందులో నటించినంత సహజంగా ఇంకే సినిమాలోనూ నటించలేదనిపిస్తుంది. జోగారావునీ, సీతనీ హాస్యానికి వాడుకున్న ఆ దృశ్యాలు సినిమాలో అతికినట్లు కనిపిస్తాయి. కథకి అవసరం కనుక వాటిని హాస్యంతో ముడిపెట్టారు. శ్రీవత్స, వల్లభజోశ్సుల శివరాం, వంగర, కేవీ సుబ్బారావు, పద్మనాభం తక్కిన పాత్రల్లో కనిపిస్తారు. సంగీతం, దర్శకత్వం చేసిన గంటసాల అన్ని హాయిగా ఉన్న పాటలే చేశారు. ఆర్కేస్ట్రాకి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఈ సినిమాకి విజయావారు హామండ్‌ ఆర్గన్‌ అనే జర్మన్‌ వాధ్యం తెప్పించారు. అది ఎలక్ట్రానిక్‌ వాధ్యం.

పియానో వాధ్య నిపుణుడైన వేణు హామండ్‌ ఆర్గాన్ని నేర్చుకుని షావుకారులోనూ, అంతకుముందు విడుదలైన 'గుణసుంధరి కథ'లోనూ వాయించారు. 'షావుకారు'లో గంటసాల ఆ వాధ్యాన్ని ''ఏమనెనే.. చిన్నారి ఏమనెనే'' పాటలో నేపథ్యంలో నెమ్మదిగా వినిపించారు. ''పలుకరాదటే చిలుక'' నేటికీ వినిపిస్తూనే ఉంటుంది కచేరీల్లో. చిత్రం ఆరంభంలో మోపర్రు దాసు చేత హరికథ చెప్పించిన (అతను హరిదాసే) హరికథా గానం అంతా గంటసాలే చేశారు. మాధవపెద్ది సత్యం పాడిన తత్వాలు ఆయనే పాడారు. కథలో కొంతకాలం గడిచిందన్న మాట చెప్పడానికి నేపథ్య గీతంతో సన్నివేశాలు చిత్రీకరించారు. ''మారిపోవురా, కాలము మారుట దానికి సహజమురా'' అన్న పాట సన్నివేశాల మీద వినిపిస్తూ ఉంటుంది. అన్ని పాటలు హృద్యంగా వుంటాయి. తక్కువ వాధ్యాలతో.

మార్కస్‌ బార్‌ట్లీ ఫోటొగ్రఫీలో 'రామారావు' ఎంత అందగాడు అనిపిస్తుంది. ఇరుగుపోరుగుల్లో ఉన్న కుటుంబాల మధ్య తలుపు ఉంటుంది. ఈ ఇంటి నుండి ఆ ఇంటికి వెళ్లడం చూపించిన సందర్భాల్లో బార్‌ట్లీ క్రైన్‌ షాట్స్‌తో మొత్తం సెట్టు చూపించారు. అంత సహజమైన గ్రామీణ పరిసరాలని అంత సహజంగానూ చిత్రించారు బార్‌ట్లీ. మాధవ్‌పెద్ది గోఖలే చిత్రకారుడు, చక్రపాణి సంపాదకత్వంలో వచ్చిన 'ఆంధ్రజ్యోతి'లోనూ, 'చందమామ'లోనూ చిత్రాలు వేసేవారు. 'షావుకారు'తో ఆయన కళాదర్శకుడిగా మారారు. వీధులు, పొలం కూడా సెట్లు వేసారు. రైలు వెళ్లడం, పాటలో చెట్లు కనిపించడం తప్ప సినిమాలో అవుట్‌డోర్‌ దృశ్యాలు లేవు. సెట్‌ చూపించినప్పుడు అవుడ్‌డోర్‌ అన్న బ్రాంతి కనిపిస్తుందిగాని ఫ్లోర్‌లో వేసిన సెట్టే! తక్కిన శాఖలన్నీ కూడా సహజత్వానికి పాడుపడ్డాయి.

ఆరోజుల్లో 'ఆంధ్రపత్రిక' సినిమా వార్తలకి ఏమాత్రం ప్రాధాన్యం ఇచ్చేదికాదు. కానీ 'షావుకారు' విడుదల సమయంలో ''ఉత్తమ సామాజిక చిత్రం-షావుకారు'' అని పెద్ద హెడ్డింగ్‌ పెట్టి సమీక్ష రాసింది. తెలుగుదనంతో, తెలుగు కథా పాత్రలతో వచ్చిన తెలుగు సినిమా షావుకారు. విడుదలై 70సంవత్సరాలైనా నేటికీ కొత్తగా సరికొత్తగా కనిపిస్తుంది. అది విజయ సంస్థ సాధించిన ఘనత. చక్రపాణి, ఎన్వీ ప్రసాద్‌ల నైపుణ్యం, కృషి.

-శ్రీ రావికొండల రావు

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు

Show comments