విజయ నిర్మల ఇక లేరు

ప్రముఖ నటి, దర్శకురాలు, హీరో కృష్ణ భార్య విజయ నిర్మల కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, నిన్న రాత్రి కాంటినెంటల్ హాస్పిటల్ లో గుండెపోటుతో కన్నుమూశారు.ఆమె వయసు 73 సంవత్సరాలు.

నటిగా, దర్శకురాలిగా వెండితెరపై తనదైన ముద్రవేశారు విజయనిర్మల. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు. పాండురంగ మహత్యం సినిమా ద్వారా తెలుగు చిత్రరంగంలో అడుగుపెట్టారు. అందులో ఆమె కృష్ణుడి వేషం వేశారు. అప్పటికి ఆమె వయసు 11 ఏళ్లు. ఏడేళ్లకే ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. మత్స్యరేఖ అనే తమిళ సినిమాలో నటించారు.

తెలుగులో సాక్షి, పూలరంగడు, అల్లూరి సీతారామరాజు, అసాధ్యుడు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, బంగారు గాజులు లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు విజయ నిర్మల. నిజానికి ఈమె అసలు పేరు నిర్మల మాత్రమే. విజయా సంస్థ ద్వారా పరిచయం కావడం, అప్పటికే నిర్మల ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉండడంతో.. తన పేరును విజయ నిర్మలగా మార్చుకున్నారు.

కేవలం నటిగానే కాకుండా, దర్శకురాలిగా కూడా మెప్పించారు విజయనిర్మల. అంతేకాదు, ఈమె పేరిట గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఉంది. అవును.. ప్రపంచంలోనే అత్యథిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా ఈమె గిన్నిస్ బుక్ ఎక్కారు. మొత్తం 44 చిత్రాలు తీశారీమె.

అప్పటికే ఇండస్ట్రీలో ఇమేజ్ తెచ్చుకున్న కృష్ణను పెళ్లాడారు విజయనిర్మల. పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కానీ మెల్లగా నటించడం తగ్గించేసి, దర్శకత్వం వైపు మళ్లారు. పెళ్లి తర్వాతే దర్శకురాలిగా ఎక్కువ సినిమాలు తీయగలిగారు. ఈ విషయంలో తనకు భర్త నుంచి పూర్తి సహకారం దక్కిందంటూ ప్రతి సందర్భంలో కృష్ణ గురించి చెప్పేవారు. కృష్ణతో కలిసి ఆమె ఏకంగా 47 సినిమాల్లో నటించారు.

1946, ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించారు విజయనిర్మల. తండ్రి మూవీ ప్రొడక్షన్ లో పనిచేసేవారు. సీనియర్ యాక్టర్ నరేష్, విజయ నిర్మల కొడుకు. 

జగన్‌ విషయంలో కూడా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?

Show comments