ఆ హీరో ఫ్యాన్స్ ను అభినందించాల్సిందే!

ఇటీవలే తమిళనాట ఒక ఫ్లెక్సీ హోర్డింగ్ కూలి ఒక యువతి మరణించడం బాగా చర్చనీయాంశంగా నిలిచింది. అన్నాడీఎంకే నేత ఒకరు తన ఇంట్లో పెళ్లికి గానూ ఏర్పాటు చేసిన హోర్డింగ్ కూలి ఒక యువతి మరణించింది. దీంతో ఆ రాష్ట్రంలో ఫ్లెక్సీలపై, హోర్డింగులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ రోజుల్లో వీధిలో ఏం జరిగినా స్థానికంగా ఫ్లెక్సీలు వెలస్తూ ఉన్నాయి. పెళ్లిళ్లకు, పేరంటాలకు కూడా ఫ్లెక్సీలు వేసి శుభాకాంక్షలు చెప్పుకోవడం ఒక సంబరం అయిపోయింది.

ఇక సినిమా వాళ్ల, రాజకీయ పార్టీల ఫ్లెక్సీల ముచ్చట్లు అయితే చెప్పనలవి కావు. ఇలాంటి నేపథ్యంలో తమిళనాట జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఫ్లెక్సీలపై తీవ్ర అసహనం వ్యక్తం అయ్యింది. దీనిపై సినిమా వాళ్లు కూడా స్పందించారు. ఇక నుంచి తమ ఫ్యాన్స్ ఎవరూ తమ సినిమాలకు, బర్త్ డే లకూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని అక్కడి స్టార్ హీరోలు ప్రకటించారు.

అందులో భాగంగా విజయ్, అజిత్ లాంటి హీరోలు బహిరంగ ప్రకటనలు చేశారు. ఇలాంటి క్రమంలో త్వరలోనే విజయ్ సినిమా విడుదల కాబోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఆ హీరో అభిమానులు తమ హీరో పిలుపుకు కట్టుబడి ఉండబోతున్నట్టుగా ట్వీట్ లు చేస్తున్నారు. 'బిజిల్' సినిమా విడుదల సందర్భంగా ఫ్లెక్సీల హడావుడి ఉండదని వారు చెబుతున్నారు. 

అలాగే మరి కొన్ని చోట్ల అదే డబ్బులు వేసుకుని పనికి వచ్చే పనులు చేస్తున్నారు. అందులో భాగంగా పబ్లిక్ ప్లేస్ లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు  విజయ్ ఫ్యాన్స్. తమ అభిమాన హీరో సినిమా విడుదల సందర్భంగా అలంటి ఏర్పాట్లు చేసి, స్థానికంగా ప్రముఖులతో వాటిని ఆవిష్కరింపజేస్తున్నారు. ఇది అభినందించదగిన అంశమే.

Show comments