విజయ్‌ దేవరకొండపై 'లాట్స్‌ ఆఫ్‌ లవ్‌'

హిట్టు మీద హిట్టు కొడ్తోన్న యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో వసూళ్ళ పంట పండించేశాడు. అంతేనా, తన మీద 'వరదలా' అభిమానం ఉప్పొంగేలా చేసుకోగలగుతున్నాడు. కేరళ వరదల నేపథ్యంలో టాలీవుడ్‌ నుంచి అందరికన్నా ముందే స్పందించి, విరాళం ప్రకటించిన విజయ్‌ దేవరకొండ.. అప్పుడే కేరళలోని సినీ అభిమానుల మనసుల్ని గెలిచేసుకున్నాడు. దాంతో ఇప్పుడు విజయ్‌ దేవరకొండకి కావాల్సినంత 'లవ్‌' కేరళ సినీ అభిమానుల నుంచి దక్కుతోంది. 

'గీత గోవిందం' సినిమా 100 కోట్ల గ్రాస్‌ దాటేసిన విషయం విదితమే. కెరీర్‌లో తొలి వందకోట్ల రూపాయల సినిమా అంటూ 'గీత గోవిందం' గురించి ఉప్పొంగిపోతూ ఓ ట్వీటేశాడు విజయ్‌ దేవరకొండ. అందులో ఈ విజయానికి తమిళ, కన్నడ, మలయాళ సినీ అభిమానుల ప్రేమాభిమానులూ కారణమని విజయ్‌ పేర్కొనడంతో.. ఆయా రాష్ట్రాల నుంచి విజయ్‌ మీద అభిమానం 'ఓ రేంజ్‌లో' ఉప్పొంగిపోతోంది. 

'కేరళ అభిమానుల నుంచి లాట్స్‌ ఆఫ్‌ లవ్‌..' అంటూ విజయ్‌ దేవరకొండకి సోషల్‌ మీడియా ద్వారా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా కేరళ నుంచే విజయ్‌ దేవరకొండకి అభిమానం పోటెత్తుతుండడం గమనార్హం. 'గీత గోవిందం' సినిమా తమిళనాడులోనూ భారీ వసూళ్ళను సాధించిన సంగతి తెల్సిందే. కర్నాటకలోనూ 'గీత గోవిందం' సినిమా పుణ్యమా అని విజయ్‌ దేవరకొండకి అభిమాన సంఘాలు మరింత బలంగా ఏర్పాటైపోయాయి.