వేణుమాధవ్‌ అలా.. బండ్ల గణేష్‌ ఇలా.!

పాపం బండ్ల గణేష్‌.. అయ్యోపాపం వేణు మాధవ్‌.. ఇలా అనుకోవాల్సి వస్తోంది ఈ ఇద్దరి గురించీ. ఒకరేమో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు.. ఇంకొకరేమో కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుడు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా వేణుమాధవ్‌ చేసిన 'యాగీ' అంతా ఇంతా కాదు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు, మీసం మెలేశాడు.. తొడకొట్టేశాడు. తెలుగుదేశం పార్టీ ఆ ఉప ఎన్నికలో గెలిచిందనుకోండి.. అది వేరే విషయం.

మరో కమెడియన్‌ బండ్ల గణేష్‌ని తీసుకుంటే, ఇటీవలే ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ టిక్కెట్‌ ఆశించారు. వస్తుందనీ ధీమాగా చెప్పారు. 'అధ్యక్షా..' అంటూ అసెంబ్లీలో పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని మీడియాకెక్కి బండ్ల గణేష్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏమయ్యింది.? కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు మొండి చెయ్యి చూపించింది.

వేణుమాధవ్‌ది ఇంకా దారుణమైన పరిస్థితి. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. టీడీపీ తరఫున నంద్యాలలో ప్రచారం చేసిన వేణుమాధవ్‌, తెలంగాణలో టీడీపీ నుంచి టిక్కెట్‌ సాధించుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతుండడం ఆశ్చర్యకరమే.

స్టార్‌ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగి నిర్మాతగా కూడా మారారు వేణుమాధవ్‌. 'బాగానే సంపాదించాడు' అని సినీ పరిశ్రమ అతని గురించి గట్టిగానే చెప్పుకుంది. ఎలాగైతే సంపాదించాడో, అలాగే తగలెట్టేసుకున్నాడనే వాదనలూ లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం.

బండ్ల గణేష్‌ పరిస్థితి ఈ విషయంలో వేణుమాధవ్‌ కంటే పూర్తిగా భిన్నం. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకడిగా ఎదిగాడు. పెద్ద పెద్ద సినిమాలు తీసి, పెద్ద పెద్ద విజయాలూ అందుకున్నాడు. కొన్ని పరాజయాల్ని చవిచూశాడనుకోండి.. అది వేరే విషయం.

కాంగ్రెస్‌తోనే కాదు, టీడీపీతోనూ బండ్ల గణేష్‌కి సన్నిహిత సంబంధాలున్నాయి. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్‌కి, బండ్ల గణేష్‌ అత్యంత సన్నిహితుడు. వైఎస్సార్సీపీ ముఖ్యనేత బొత్స సత్యనారాయణ అయితే బండ్ల గణేష్‌కి గురువుతో సమానం.

పవన్‌కళ్యాణ్‌ మీద బండ్లకి వున్న భక్తి గురించీ, బండ్ల మీద, పవన్‌కి వున్న ప్రేమ గురించి అందరికీ తెల్సిన విషయమే. ఎన్ని పరిచయాలుంటే ఏం లాభం.? బండ్ల గణేష్‌కి టిక్కెట్‌ రాలేదు. అన్నట్టు, వేణుమాధవ్‌తో పోల్చితే, రాజకీయాల్లోనూ కాస్తో కూస్తో మెరుగైన స్థానం బండ్ల గణేష్‌కే దక్కింది.

ఆయనిప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిథుల్లో ఒకడు. టిక్కెట్‌ ఇవ్వలేదు కదా, అందుకే ఆయనకి 'అధికార ప్రతినిథి' పదవి ఇచ్చి సంతోషపెట్టింది కాంగ్రెస్‌ అధిష్టానం.  

బిడ్డా రాస్కో.. తెలంగాణ‌లో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments