బాబుకి పరోక్షంగా క్లాస్ పీకిన వెంకయ్య

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ పదవిలోకి రాకముందు ఆయన ప్రసంగాల వాగ్ధాటి వేరేగా ఉండేది. సెటైర్లతో రెచ్చిపోయేవారు, తనతో సహా అందరిపై పంచ్ లు వేస్తూ నవ్వుతూ నవ్వించేవారు. ఉపరాష్ట్రపతి పదవిలోకి వచ్చిన తర్వాత వెంకయ్య ప్రసంగాల సందడే తగ్గిపోయింది. కానీ లోపల ఒరిజినల్ అలానే ఉంది. టైమ్ వచ్చినప్పుడు మాత్రం, తన పరిమితులకు లోబడే దాన్ని బయటకు తీస్తుంటారు. 

నెల్లూరు రైల్వే స్టేషన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో కూడా నర్మగర్భంగా కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో విభేదాలు పక్కనపెట్టాలని సూచించారు. గెలిచినవారిని గౌరవించాలంటూ చురకలంటించారు. 

"కేంద్రం, రాష్ట్రం రాజకీయ అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి భుజం భుజం కలిపి పనిచేయాలి. కేవలం ఏపీకే కాదు, అన్ని రాష్ట్రాలకు ఈ సూచన చేస్తున్నా. గెలిచిన వారిని గౌరవించండి, కలసి పనిచేయండి, రాజకీయ శతృత్వాలు లేకుండా కలసి పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యం" అన్నారు. 

ప్రధాని మోడీతో చంద్రబాబు శతృత్వం ఆయనకే నష్టం అని పరోక్షంగా హెచ్చరించారు వెంకయ్య. గెలిచిన వారిని గౌరవించాలని, కలిసి పనిచేయాలని.. అంతేగాని కేంద్రంతో శతృత్వం పెట్టుకుంటే అభివృద్ధి కుంటుపడుతుందనేది వెంకయ్య భావన. 

అయితే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి కాదు కదా. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నప్పుడు కూడా సొంత ఆస్తులు పెంచుకోడానికే చూశారు కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఏనాడూ గొంతెత్తలేదు. ఇక ఇప్పుడు కూడా తన రాజకీయ లాభం కోసమే కేంద్రంతో శతృత్వం పెట్టుకున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం కాదు. 

రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక హోదా కాంక్ష తీవ్రం కావడం, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వల్ల హోదా ఆశ సజీవంగా ఉండటంతో బాబు ప్లేటు ఫిరాయించారు. హోదా ఇవ్వలేదంటూ కేంద్రంపై చిందులు తొక్కుతూ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి చంద్రబాబుకి వెంకయ్య నాయుడు మాటలు చెవికెక్కుతాయా. 

నెల్లూరు జిల్లాలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులన్నిటికీ కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు బీజం పడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఎంతమాత్రం లేదు. అందుకే స్వయంగా ఈ ప్రారంభోత్సవాలకు హాజరయ్యారు వెంకయ్య నాయుడు. అయితే టీడీపీ ఈ కార్యక్రమాలన్నిటినీ హైజాక్ చేసింది. ఇద్దరు కేంద్రమంత్రులు వచ్చినా కూడా రాష్ట్ర మంత్రులదే పెత్తనమంతా. స్థానిక బీజేపీ నేతలకు కూడా చోటు లేకుండా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. వీరి అత్యుత్సాహం చూసే వెంకయ్య నాయుడు కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై మాట్లాడారు. చంద్రబాబుకి పరోక్షంగా క్లాస్ పీకారు.