రిటైర్ అవుతా, నన్ను వదిలేయండి - వెంకటేష్

ఓపెన్ గా మాట్లాడే వెంకటేశ్, మరోసారి మీడియాతో అదే విధంగా మాట్లాడాడు. వయసైపోతోందని ఇక రిటైర్ అయిపోతానని అంటున్నాడు. అయితే రిటైర్ అయిపోతానని తను అనుకుంటున్న ప్రతిసారి ఎవరో  ఒకరు నన్ను సినిమాల్లోకి లాగుతున్నారని అన్నాడు.

"ఇండస్ట్రీకొచ్చి 33 ఏళ్లయింది. ఇంకా ఎన్నాళ్లు సినిమా చేయాలి. ఇక ఫీల్డ్ నుంచి జంప్ అవ్వడమే. నేను ఎప్పట్నుంచో జంప్ అవ్వాలని అనుకుంటున్నాను. కానీ వదలట్లేదు. ఐదేళ్ల నుంచి రిటైర్ అయిపోతానని చెబుతున్నాను కానీ కుదరట్లేదు. నా కోసం ఇంకా డిజైన్ చేస్తూనే ఉన్నారు. ఆ ఎనర్జీ ఇంకా వస్తోంది, అదే నాక్కూడా ఆశ్చర్యంగా ఉంది. వద్దన్నా ఆఫర్లు కూడా వస్తున్నాయి. అది కూడా ఆశ్చర్యమే."

ఇకపై కూడా మల్టీస్టారర్స్ కొనసాగిస్తానంటున్నాడు వెంకీ. ఇప్పటికే వరుణ్ తేజ్, నాగచైతన్య లాంటి యంగ్ హీరోస్ తో నటించిన ఈ సీనియర్ హీరో.. మరోసారి ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. గతంలో ఎన్టీఆర్-వెంకీ కలిసి ఓ సాంగ్ చేశారు.

"సీనియర్ల సంగతి పక్కనపెడితే యంగ్ హీరోస్ మాత్రం చాలా సినిమాలు చేయాలి. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉంది. నానితో కూడా గతంలో ఓ సినిమా అనుకున్నాం, కుదర్లేదు. అతడితో కూడా వర్క్ చేయాలి. యంగ్ హీరోస్ అందరితో చేయాలని ఉంది."

కొడుకు అర్జున్ కు తానేం చెప్పనంటున్నాడు వెంకీ. సినిమాల్లోకి వస్తానని తను అనుకోలేదని, కానీ 33 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నానని, అర్జున్ కూడా తనకు అనిపించింది చేస్తాడని, తను మాత్రం అర్జున్ కు ఎలాంటి సలహాలు ఇవ్వనంటున్నాడు.

Show comments