వర్మ ట్రిపుల్‌ రైడింగ్‌: షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్

తన సినిమాలెలాగూ హిట్టవడంలేదు గనుక, తన అభిమానులో, అనుచరులో, శిష్యులో తెరకెక్కించిన సినిమాలు విజయం సాధిస్తే, వాటి పేరుతో పబ్లిసిటీ దండుకుంటున్నాడు రామ్‌ గోపాల్‌ వర్మ. 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమా వసూళ్ళ పరంగా దూకుడు ప్రదర్శిస్తోంటే, దర్శక నిర్మాత పూరి జగన్నాథ్‌ కంటే రామ్‌ గోపాల్‌ వర్మ ఎక్కువ ఆనందం పొందుతున్నాడు. ఈ ఆనందం కాస్త ఎక్కువైపోయిందో ఏమో, సినిమా చూసేందుకు బైక్‌ మీద.. అదీ ట్రిపుల్‌ రైడింగ్‌తో (అజయ్ భూపతి, అగస్త్య మంజు కూడా అదే బైక్ పై వున్నారు) వెళ్ళాడు. 

ఆ ఘనకార్యాన్ని మళ్ళీ వీడియో రూపంలో సోషల్‌ మీడియాలో వర్మ పోస్ట్‌ చేయగానే, ట్రాఫిక్‌ పోలీసుల నుంచి కౌంటర్‌ వచ్చి పడింది. చలాన్‌ కట్టాల్సి వచ్చింది. అంతే కాదు, రామ్‌గోపాల్‌ వర్మ లాంటోళ్ళు ఇలా ప్రవర్తించడం దురదృష్టకరమని ట్రాఫిక్‌ పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు మీడియా సాక్షఙగా వర్మకి క్లాస్‌ తీసుకోవడం గమనార్హం. 
మరోపక్క వర్మ, సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేస్తూ.. పోలీసులు, థియేటర్‌లో సినిమా చూస్తున్నారా? అని ప్రశ్నించాడు. దానికీ పోలీసులు గట్టిగానే స్పందించారు. మీలాంటోళ్ళు రోడ్లు మీద సర్కస్‌లు చేస్తోంటే, సినిమాల్లో ఎందుకు వుంటాం? అన్నట్లుగా ట్రాఫిక్‌ పోలీసుల నుంచి కౌంటర్‌ వచ్చి పడింది. వర్మ, పోలీసుల్ని కెలకడంలో పరమార్థమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆయనక్కావాల్సింది పబ్లిసిటీ. అది ఇప్పుడిలా వచ్చిందంతే. 

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా పేరు చెప్పి ఎన్నికల వేళ బీభత్సమైన పబ్లిసిటీ పొందిన వర్మ, ఆ తర్వాత కూడా కొన్నాళ్ళపాటు దాన్ని కొనసాగించాడు. ఆ హంగామా తగ్గాక, కేసీఆర్‌ బయోపిక్‌.. అంటూ ఓ సినిమా అనౌన్స్‌ చేశాడు. అదీ చాలక, 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే టైటిల్‌తో ఇంకో సినిమా ప్రకటించాడు. ఇలా, టైటిల్స్‌తో పబ్లిసిటీ స్టంట్లు చేయడం వర్మకి కొత్తేమీ కాదనుకోండి.. అది వేరే సంగతి. 

అన్నట్టు, వర్మ ఇంకో షాకింగ్‌ వీడియోతోనూ వార్తల్లోకెక్కాడండోయ్‌. 'ఇస్మార్ట్‌ శంకర్‌' సక్సెస్‌ పార్టీలో మందు బాటిల్‌తో వర్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ మద్యాన్ని నెత్తి మీద నుంచి పోసుకుంటూ.. వర్మ చేసిన హంగామా దెబ్బకి ఇస్మార్ట్‌ టీమ్‌ కూడా ఒకింత ఆశ్చర్యానికి గురవ్వాల్సి వచ్చిందట. ఫైనల్‌ టచ్‌ అని కాదుగానీ, 'ఇస్మార్ట్‌' మాస్‌ లాంగ్వేజ్‌లో, పూరిని 'అరే, ఒరే' అనేశాడు వర్మ.. అదీ తన ట్వీట్‌లో.

Show comments