వంశీ ఎపిసోడ్.. ఆయనకే ఆసక్తి ఎక్కువ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీ కండువా కప్పుకోలేదు కానీ, జగన్ కే తన మద్దతు అన్నారు. దాంతో ఇటు టీడీపీ నానా రాద్ధాంతం చేస్తోంది. 23 మంది ఎమ్మెల్యేలను కొనేసి, నిస్సిగ్గుగా రాజకీయం చేసిన చంద్రబాబు కూడా వంశీని అవకాశవాదిగా విమర్శిస్తున్నారు.

వైసీపీలో చేరాలనుకునే ఎమ్మెల్యేలెవరైనా పార్టీతో పాటు, పదవికి కూడా రాజీనామా చేసి రావాల్సిందేనంటూ జగన్ గతంలో కండిషన్ పెట్టడం, టీడీపీ కూడా వంశీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

వంశీ రాజీనామా చేస్తారా, గన్నవరంలో ఉప ఎన్నిక వస్తుందా, వస్తే వైసీపీ టికెట్ ఎవరికి, వంశీకి టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఇస్తారా, టీడీపీ తరపున లోకేష్, జనసేన తరపున పవన్ కల్యాణ్ పోటీ చేస్తారా.. ఇలా రకరకాల కథల్ని మీడియా వండి వారుస్తోంది.

అయితే సడన్ గా సభాపతి ప్రకటన సర్ ప్రైజ్ గా మిగిలింది. పార్టీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలను స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గుర్తించవచ్చు అని అన్నారాయన. వంశీ కూడా ఇంకా వైసీపీ కండువా కప్పుకోలేదు కాబట్టి ఆయన ఎమ్మెల్యే పదవికి వచ్చిన గండమేమీ లేదు.

అయితే ఈ వ్యవహారాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎందుకంటే రాపాక ఇదివరకే జగన్ కి జై కొట్టారు, కొన్ని సాంకేతిక కారణాల వల్ల జనసేనలోనే కొనసాగుతున్నారు. అవమానాలు భరిస్తూ ఆ పార్టీలోనే ఉన్నారు. కానీ సరైన రీజన్ ఒక్కటి దొరికితే చాలు, రాపాక గోడ దూకడం ఖాయం. పార్టీ మారడం వల్ల పదవికి గండం రాదనే గ్యారెంటీ లభిస్తే రాపాక వైసీపీలో చేరేందుకు రెడీ అన్నమాట.

ఈ విషయంలో రాపాక మరో అడుగు ముందుకేసి వంశీతో కూడా టచ్ లో ఉన్నారట. వంశీ విషయంలో సభాపతి తీసుకునే నిర్ణయం తదనంతర పరిణామాలు చూసుకుని రాపాక తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇటు రాపాకతో పాటు, మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు మధ్యే మార్గం దొరుకుతుందేమోనని వేచి చూస్తున్నారు. మొత్తమ్మీద వల్లభవేని వంశీ.. వీరందరికీ మార్గదర్శకుడుగా మారుతున్నారనమాట. 

Show comments