వాలంటీర్ల నియామకంలో 'దేశం' బాటలో వైకాపా..?

జోరుగా ప్రచారం.. అయోమంలో అభ్యర్ధులు..
తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కమిటీలను జనంపై బలవంతంగా రుద్దింది. చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ఆగడాలకు ఆయావర్గాలు విసుగెత్తిపోయాయి. ఫలితంగా 2019 ఎన్నికల్లో టీడీపీకి చావుదెబ్బ తప్పలేదు. ఎన్నికల అనంతరం వైకాపా అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే చర్యల్లో భాగంగా గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం గ్రామ వాలంటీర్ల నియామకాలకు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుత గ్రామ వాలంటీర్ల వ్యవస్థకూ, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల నియామకాలకూ మధ్య పొంతన లేనప్పటికీ టీడీపీ మాదిరిగానే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు సైతం అధికార పార్టీ కనుసన్నల్లోనే జరుగుతోందన్న ప్రచారం జోరందుకుంది.

చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను నియమించారు. ప్రభుత్వం నేరుగా జన్మభూమి కమిటీలకు ఆయా పథకాలకు లబ్ధిదారుల పంపిక బాధ్యత అప్పగించింది. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు చేసేదిలేక ప్రేక్షకపాత్ర వహించారు. అప్పటి అధికార టీడీపీ ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో జన్మభూమి కమిటీలు నడిచేవి! ఏ ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా లబ్ధిదారులు నేరుగా జన్మభూమి కమిటీలను ఆశ్రయించేవారు!

ప్రభుత్వ గృహాల కేటాయింపు, ఇళ్ళపట్టాలు, సామాజిక భద్రతా పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఆరోగ్య శ్రీ వంటివి మంజూరు కావాలంటే జనం జన్మభూమి కమిటీలనే ఆశ్రయించేవారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే జన్మభూమి కమిటీ ఎంపికకు సంబంధించి గత ప్రభుత్వంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు ఎమ్మెల్యేలు జన్మభూమి కమిటీల మాటున పెద్దఎత్తున లబ్దిదారుల నుండి వసూళ్ళకు పాల్పడ్డారు.

ఉదాహరణకు ప్రభుత్వం నుండి ఇల్లు మంజూరు కావాలంటే అందుకు నిర్దేశించిన ముడుపులను చెల్లించిన పక్షంలో రాజకీయ పార్టీలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపికను చేసినట్టు చెప్పుకున్నారు. సొమ్ములు చెల్లించిన పక్షంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికీ ప్రభుత్వ పథకాలను వర్తింపజేశారన్న ప్రచారం జరిగింది. ఏ ప్రభుత్వ పథకం మంజూరు కోసమైనా సంబంధిత శాఖాధికారి వద్దకు వెళ్ళి విన్నవించుకున్న వారికి చేదు అనుభవం ఎదురయ్యేది!

తమ చేతుల్లో ఏదీలేదని, వెళ్ళి జన్మభూమి కమిటీలను కలవాలంటూ సదరు అధికారులు ఉచితసలహా ఇచ్చేవారు! ఈ నేపథ్యంలో అప్పటి ప్రతిపక్ష వైకాపా నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాలన్నీ జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో పచ్చ చొక్కాలకే పరిమితమవుతున్నాయని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జన్మభూమి కమిటీలు రద్దవుతాయని, వాటిస్థానే ఓ పారదర్శకమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తామని అప్పట్లో జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.

ఇదే సమయంలో జన్మభూమి కమిటీల తీరుపైనా జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం ప్రభుత్వంపైనా, చంద్రబాబుపైనా ప్రజలు తీవ్ర అసహనం చెందారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయం వెనుక జన్మభూమి కమిటీల అరాచకాలూ ఓ ప్రధాన కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. తాజాగా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్లను నియమిస్తోంది. ఈ నియామకాలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని జగన్‌ ప్రకటించినప్పటికీ ఆచరణలో అందుకు విరుద్ధంగా ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

విద్యా వాలంటీర్ల నియామకాలన్నీ వైకాపా నేతల కనుసన్నల్లోనే జరిగేలా స్కెచ్‌ వేసినట్టు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలకు చెందిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేక నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల ఆదేశాలను అనుసరించి వాలంటీర్లను నియమించేందుకు వ్యూహం రూపొందించినట్టు చెప్పుకుంటున్నారు. వైకాపాను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సైతం ఈ వాలంటీర్ల వ్యవస్థను భవిష్యత్‌లో వినియోగించుకునే దిశగా వ్యూహరచన చేసినట్టు సమాచారం!

జగన్‌ మొహంలో చిరునవ్వు, మార్పు కనబడుతోంది

Show comments