కాంగ్రెస్ నేతకు అండగా ఆ కులం.. బీజేపీకి భయం!

కర్ణాటక సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమారను జైల్లో పెట్టారు. అక్రమాస్తుల కేసులో ఆయనపై చాన్నాళ్లుగా సీబీఐ, ఈడీలు విచారణ కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే ఇన్నాళ్లూ ఆయన అరెస్టు జరగలేదు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నుంచి అధికారాన్ని బీజేపీ సొంతం చేసుకున్నాకా.. డీకే శివకుమార అరెస్టు జరిగింది. ఇప్పుడప్పుడే డీకేశిని వదిలేలా కూడా లేరు.

అంతే కాకుండా.. డీకే శికుమార కూతురును కూడా విచారణకు పిలిపిస్తున్నారు అధికారులు. పన్నులు చెల్లించకుండా దాదాపు మూడువందల కోట్ల రూపాయలను ఆస్తులను డీకే శివకుమార కుటుంబం కలిగి ఉందంటూ కొత్త అభియోగాలను కూడా నమోదు చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా రాజకీయ కుట్ర అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ఇప్పటికే డీకే అరెస్టుపై కాంగ్రెస్ వాళ్లు నిరసన తెలిపారు.

సోనియాగాంధీ కూడా ఆ విషయంలో స్పందించారు. దక్షిణాదిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా ఉండిన డీకేకు పార్టీ అండగా ఉంటుందని సోనియా ఒక లేఖ రాసినట్టుగా ఉన్నారు. డీకే అరెస్టుపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాలు, నిరసనలు తెలిపారు. వారి సంగతలా ఉంటే.. వక్కలిగ సామాజికవర్గం ఇప్పుడు రోడ్డు ఎక్కింది.

దాదాపు ముప్పై ఐదువేల మంది వక్కలిగలు డీకే శివకుమార అరెస్టుపై రోడ్డు ఎక్కారు. బెంగళూరులో నిరసన ప్రదర్శన చేశారు. తమ కులస్తుల్లో ప్రముఖుడు అయిన డీకే శివకుమారను కేంద్రం వేధిస్తోందని వారు ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పుడు కర్ణాటక బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. కన్నడ నాట రాజకీయంగా, ఆర్థికంగా బలమైన సామాజికవర్గం వక్కలిగలు. దేవేగౌడ ఇదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తే అంటే.. వారి రాజకీయ శక్తి అర్థం చేసుకోవచ్చు. దేవేగౌడను ఢీ కొట్టేలా డీకేశి కాంగ్రెస్ ద్వారా ఎదిగారు. ట్రబుల్ షూటర్ గా పేరుపొందారు. ఇప్పుడు ఆయన అరెస్టు జరిగింది.

ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో వక్కలిగ ప్రాంతంలో బీజేపీ బాగానెగ్గింది. ఆ సామాజికవర్గం సపోర్ట్ చేయడంతోనే బీజేపీ నెగ్గిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు తమ వాడిని అరెస్టు చేశారంటూ వాళ్లే రోడ్డుఎక్కారు. దీంతో బీజేపీవాళ్లు జాగ్రత్తపడుతూ ఉన్నారు. సానుభూతి వచనాలు పలుకుతున్నారు.

డీకే శివకుమార మంచోడని బీజేపీ వాళ్లు అంటున్నారు. ఆయన విచారణను పూర్తి చేసుకుని త్వరగా జైలు నుంచి శుద్ధంగా బయటకు రావాలని ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు బీజేపీవాళ్లు. ఇదంతా వక్కలిగ ఓటర్లను దూరం చేసుకోకూడదని జరుగుతున్న ప్రయత్నమే అని వేరే చెప్పనక్కర్లేదు.

జగన్... గారాబం చేయడం నేర్చుకోవాలి!