వద్దు ఎన్టీఆర్‌.. ఆ తప్పు చేయొద్దు.!

జూనియర్‌ ఎన్టీఆర్‌కి పెద్ద సంకటమే వచ్చింది. సోదరి సుహాసిని కూకట్‌పల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న దరిమిలా, 'ఈ రాజకీయాన్ని' ఎలా అర్థం చేసుకోవాలో జూనియర్‌ ఎన్టీఆర్‌కి అర్థంకాని పరిస్థితి. కానీ, కళ్యాణ్‌రామ్‌ - ఎన్టీఆర్‌ పేర్లతో ఓ ప్రకటన బయటకొచ్చింది. తమ సోదరికి తాము పూర్తి మద్దతిస్తున్నట్లు అందులో కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ తమ ట్విట్టర్‌ అకౌంట్స్‌ ద్వారా 'ఒకే' ప్రకటనను విడుదల చేయడం గమనార్హం.

'ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతగారు ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ మాకెంతో పవిత్రమైనది. మా నాన్నగారు స్వర్గీయ హరికృష్ణగారు సేవలందించిన టీడీపీ తరఫున మా సోదరి సుహాసిని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. స్ట్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలని నమ్మే కుటుంబం మాది. ఇదే స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్ధపడుతున్న మా సోదరి సుహాసినికి విజయం వరించాలని ఆకాంక్షిస్తూ..' అంటూ కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు.

కళ్యాణ్‌రామ్‌ సంగతి పక్కనపెడితే, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు.. ఈ విషయాన్ని అంత తేలిగ్గా జీర్ణించుకోలేకపోతున్నారు. 'దయచేసి చంద్రబాబు కుటిల రాజకీయాలకు దూరంగా వుండండి. ఎన్నికల ప్రచారంలోకి మాత్రం రావొద్దు. తెలంగాణలో టీడీపీ పట్ల చంద్రబాబుకి అంత మమకారం వుండి వుంటే, 2014 ఎన్నికల్లో లోకేష్‌ని తెలంగాణ నుంచి పోటీ చేయించేవారే. మిమ్మల్ని తెలంగాణలో చంద్రబాబు బలిపశువుల్ని చేయాలనుకుంటున్నారు.. అందుకే హరికృష్ణ కుమార్తెను రంగంలోకి దించారు..' అంటూ అభిమానులు, తమ అభిమాన హీరో ఎన్టీఆర్‌కి సలహాలిస్తున్నారు.

సుహాసినికి మద్దతుగా ఎన్టీఆర్‌ పోస్ట్‌ చేసిన ప్రకటన కింద కామెంట్స్‌లో మెజార్టీ కామెంట్స్‌, 'వద్దు.. దయచేసి అర్థం చేసుకోండి..' అని పేర్కొంటున్నవే. పరిస్థితి తీవ్రత జూనియర్‌ ఎన్టీఆర్‌కి అర్థంకాదని ఎలా అనుకోగలం.? కానీ, తప్పదు. సుహాసిని, స్వయానా తన తండ్రి హరికృష్ణ కుమార్తె.. సోదరి. నైతికంగా ఆమెకు మద్దతివ్వాల్సిన పరిస్థితి. కానీ, జరుగుతున్న రాజకీయమేంటో ఎన్టీఆర్‌కి తెలుసు. మరి, ప్రచారం విషయంలో ఎన్టీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.

Show comments