హీరోగారి పొలిటికల్ కామెడీ మళ్లీ!

తను స్థాపించిన పార్టీ నుంచి మూడు నాలుగు నెలల్లోనే రాజీనామా చేసి బయటకు వచ్చిన హీరో ఉపేంద్ర. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు ఈయన. మొదట్లో కొంత దూకుడుగా కనిపించాడు. ఆటో గుర్తును తెచ్చుకున్నాడు. ఖాకీ చొక్కాను పార్టీ యూనిఫారమ్‌గా ప్రకటించుకున్నాడు. సినీ గ్లామర్‌తో బాగానే హడావుడి చేశాడు. అయితే.. ఆ తర్వాత తను స్థాపించిన పార్టీపై ఈయనే పట్టు కోల్పోయాడు. అది కూడా మూడు నాలుగు నెలల్లోనే!

చివరకు ఆ పార్టీ నుంచి తను రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించుకున్నాడు. తను ఏర్పాటు చేసిన పార్టీకి తనే రాజీనామా చేసిన ఈ ఘనుడు.. ఇప్పుడు మరో పార్టీని స్థాపించాడు. ఈ మధ్య కాలంలో హీరోలకు పార్టీలు పెట్టడం, వాటిని విలీనాలు చేయడం, మళ్లీ పార్టీలు పెట్టడం.. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక హడావుడి చేయడం రొటీన్ అయిపోయింది. ఉపేంద్ర కూడా ఆ తానులో ముక్క అని తేలిపోయింది.

మరి ఈ పార్టీని ఉపేంద్ర ఎన్నిరోజులు నడుపుతాడో.. ఎలా నడుపుతాడో చూడాల్సి ఉంది. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా ఈయన కొత్త పార్టీ ఏర్పాటు విషయాన్ని ప్రకటించాడు. ఎలాగూ లోక్‌సభకు ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి కాబట్టి.. ఇప్పుడు ఈ పొలిటికల్ డ్రామాను షురూ చేసి ఉండవచ్చు.

ఇంతకీ కర్ణాటకకు స్టార్ హీరో ఉపేంద్ర ప్రభావం అక్కడేమైనా రాజకీయంగా ఉంటుందా? అని ఆరాతీస్తే అంత సీన్ లేదనే మాటే వినిపిస్తోంది. ఈ పార్టీ ద్వారా ఉపేంద్ర ఇతర పార్టీల వద్ద తన డిమాండ్ ను పెంచుకోవడం లేదా.. మహా అంటే ఏ ఎంపీ సీటో.. రాజ్యసభ సభ్యత్వం కోరడమో ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.