ఉల్లిపై సెటైర్లు.. మోడీ టీమ్ బాధ్యతా రాహిత్యం

ఏమాటకామాట చెప్పుకోవాలి, బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటే చాలు జనం నిత్యావసరాల రేట్లు పెరిగి అల్లాడిపోతుంటారు. గతంలోనూ ఇలాంటి ఉదాహరణలున్నాయి, ఇప్పుడు కూడా రిపీట్ అవుతున్నాయి. అయితే ఈసారి పూర్తిగా మోడీ టీమ్ బాధ్యతారాహిత్యం స్పష్టమవుతోంది. ఉల్లి ధర భారీగా పెరిగి, ఇంకా పెరుగుతూనే ఉన్న వేళ.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుని ప్రతిపక్షాలే కాదు సామాన్యులు కూడా తీవ్రంగా ఎండగడుతున్నారు.

ధరలు తగ్గించడం చేతకాకపోతే పోనీ, ఉల్లి కోసం కష్టాలు పడుతున్న పేదలపై సెటైర్లు వేస్తున్న కేంద్ర మంత్రుల్ని చూస్తుంటే జనానికి కడుపు మండిపోతోంది. మా ఇంట్లో ఉల్లిపాయలు పెద్దగా వాడం, మాకు వాటి రేటు ఎలా తెలుస్తుంది అంటూ పార్లమెంట్ దగ్గర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. మేం శాకాహారులం.. ఉల్లిపాయల్ని మేము అస్సలు తినం అందుకే ఉల్లి రేటు గురించి నాకు తెలియదు అని మరో మంత్రి అశ్విని చౌబే సెలవిచ్చారు.

బాధ్యత గల మంత్రులుగా ఉంటూ వీరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాయి. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు మంత్రి నిర్మలా సీతారామన్. గోధుమల రేటు పెరిగింది, మేం గోధుమలు తినం కదా, మాకేం నష్టం అని ఒకరు అంటే.. బీఎస్ఎన్ఎల్ నష్టాల్లో ఉంది, అయినా మేం వాడేది జియో కదా, మాకు సంబంధం ఏంటి అని మరొకరు సెటైర్లు వేస్తున్నారు.

ఇప్పటికే ఉల్లి రేట్లపై లెక్కలేనన్ని సృజనాత్మక కార్టూన్లు, వీడియోలు వస్తున్నాయి. మంత్రి గారి వ్యాఖ్యల్ని కామెంట్ చేసేందుకు అంతకంటే ఎక్కువ సృజనాత్మక పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ధరల విషయంలోనే కాదు, గతంలో పలు సందర్భాల్లోనూ కేంద్ర మంత్రులు ఇలా నోరుజారి విమర్శలపాలయ్యారు. మోదీ టీమ్ పై జనం ఇప్పుడు మరింత మండిపడుతున్నారు.

ధరలు తగ్గించడం చేతకాకపోతే పోనీ, కనీసం జనాల కష్టాల్ని గుర్తించలేనంత బిజీగా మంత్రులు ఉన్నారా, అదేంటని అడిగితే ఓట్లేసిన జనంపైనే సెటైర్లు వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహావేశాలన్నీ ఉల్లి ధర దిగొచ్చేంత వరకే ఉంటాయి, ఆ తర్వాత చల్లారిపోతాయనుకోండి. అయితే మంత్రుల బాధ్యతా రాహిత్యం మాత్రం ఈసారి తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

Show comments