జగన్ ది పెద్ద సినిమా.. తేడాకొడితే ఫ్లాప్ అవుద్ది

జాగ్రత్తగా ఉండమని జగన్ ను మరోసారి హెచ్చరించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. జగన్ ది అందరి ప్రభుత్వాల్లాంటిది కాదని, చాలా ఎక్కువ పాజిటివ్ ఓట్ తో వచ్చిన జగన్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఏమాత్రం తేడాకొట్టినా జగన్ ది ఫ్లాప్ సినిమా అవుతుందని హెచ్చరిస్తున్నారు.

"ఈసారి జగన్ కు వచ్చింది పాజిటివ్ ఓటు. ఇలాంటి పాజిటివ్ ఓటుతో నెగ్గిన ముఖ్యమంత్రిపై బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇస్తాను అని చెప్పిన తర్వాత ఇవ్వకపోతే జనం అడుగుతారా? చంద్రబాబును ఎవడైనా అడిగాడా? కానీ జగన్ మాట మీద నిలబడ్డాడు. జగన్ ది చాలా పెద్ద సినిమా. చిన్న తేడా వచ్చినా ఫెయిల్ అవుతుంది. యావరేజ్ సినిమా అయితే కొంచెం బాగున్నా చూస్తారు జనం. కానీ జగన్ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. లేకపోతే 51శాతం ఓట్లు రావడం ఏంటి? పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ తర్వాత జగన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. చివరికి రాజీవ్ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూకు కూడా ఇంత పోలింగ్ పర్సంటేజీ లేదు. జనాల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయనడానికి ఇదే ఉదాహరణ."

జగన్ వందరోజుల పాలనకు మార్కులు వేయడానికి నిరాకరించారు ఉండవల్లి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు కాబట్టి జగన్ పై తనకు ఇష్టం ఉంటుందని.. కాబట్టి నిష్పక్షపాతంగా మార్కులు వేయలేనని అన్నారు. అయినా వంద రోజులకే మార్కులు వేయాల్సిన అవసరం లేదని, ఇంకా చాలా టైమ్ ఉందని, మార్కులు వేసే రోజు కచ్చితంగా వస్తుందంటున్నారు.

"జగన్, రాజశేఖర్ రెడ్డి కొడుకు. అది నా మనసులో ఉన్నంతకాలం నేను జగన్ పక్షపాతినే. ఆయన వంద రోజుల పాలనకు ఎక్కువ మార్కలే వేస్తాను. కచ్చితంగా జగన్ బలపడాలనే కోరుకుంటాను. ఎందుకంటే అతడు నా వైఎస్ఆర్ కొడుకు. అయినా వందరోజుల పాలనకే మార్కులు వేసేయాలా. ఇంకా చాలా టైమ్ ఉంది కదా. చూద్దాం.. ముందుముందు జగన్ పాలన ఎలా ఉంటుందో?"

జగన్ ప్రకటించిన వైఎస్ఆర్ రైతుభరోసాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో లాజిక్ లేదంటున్నారు ఉండవల్లి. ఇస్తానని చెప్పిన మొత్తంకంటే వెయ్యి రూపాయలు ఎక్కువగానే ఇచ్చిన జగన్ ను అంతా అభినందించాలన్నారు. కేంద్రం ఇచ్చినా, రాష్ట్రం ఇచ్చినా అది ప్రజల డబ్బేనని.. లబ్దిదారుడికి అందిందా లేదా అనే విషయాన్ని మాత్రమే చూడాలన్నారు. గతంలో ఇలా ఎవ్వరికీ అందలేదన్నారు.

"కేంద్రం నుంచి తెచ్చి ఇస్తాడా, రిక్షా లాగి తెచ్చి ఇస్తాడా, తన సొంత డబ్బు తీసి ఇస్తాడా అనే విషయాన్ని జగన్ చెప్పలేదు. 12వేల 500 ఇస్తానన్నాడు, ఇచ్చాడు. అనుకోకుండా కేంద్రం ఇచ్చిన నిధులు కలిసొచ్చాయి. కాబట్టి మరో వెయ్యి అదనంగా ఇచ్చాడు. జగన్ పెట్టిన మిగతా పథకాలకు కూడా కేంద్ర నిధులు కలిసొస్తాయా? ఆ విషయం ఆలోచించాలి కదా. నిజానికి కేంద్రం నుంచి నిధులు రాకపోయినా హామీ ఇచ్చినట్టు 12వేల 500 రూపాయలు ఇచ్చేవాడే కదా. ఈ విషయాన్ని ఎందుకు అందరూ మరిచిపోతున్నారు."

ప్రస్తుతానికైతే ప్రజల్లో జగన్ సర్కార్ పై నిజాయితీగా నడుస్తున్న ప్రభుత్వంగా మంచి గుర్తింపు ఉందన్నారు ఉండవల్లి. డబ్బులు తీసుకున్న నలుగురు ఐదుగురు మంత్రుల్ని జగన్ పిలిచి క్లాస్ పీకాడంటూ వార్తలు వచ్చాయని, ఇది శుభపరిణామమని అన్నారు.

జగన్ పై జేసీ కోపం.. రీజన్ అదే!

Show comments