ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మరిన్ని దసరా శెలవులు

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రభావం పాఠశాలలపై పడింది. చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో.. వీలైతే దసరా శెలవుల్ని పొడిగించాలని అనుకుంటోంది ప్రభుత్వం. ఈ మేరకు ఈరోజు అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరా శెలవుల్ని మరో 2 రోజుల పాటు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నిర్ణయం వెనక కారణం కూడా అందరికీ తెలిసిందే.

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా చాలా ప్రాంతాల్లో స్కూల్ బస్సుల్ని లోకల్ సర్వీసులుగా తిప్పుతున్నారు. పాఠశాలలు తిరిగి తెరుచుకుంటే, ఈ స్కూల్ బస్సులకు మరో ప్రత్యామ్నాయం చూడాల్సి వస్తుంది. అది మళ్లీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంది. అందుకే శెలవుల్ని మరో 2-3 రోజుల పాటు పొడిగించాలని అనుకుంటోంది.

లెక్కప్రకారం.. ఈనెల 14 (సోమవారం) నుంచి స్కూల్స్ తెరుచుకోవాలి. అదే కనుక జరిగితే ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులు తప్పవు. మరీ ముఖ్యంగా తెలంగాణలోని రూరల్ ఏరియాల్లో ఇబ్బందులు మాటల్లో చెప్పలేం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ ఈరోజు కీలక సమావేశం ఏర్పాటుచేస్తోంది. శెలవుల్ని పొడిగించేలా జీవో విడుదల చేయబోతోంది. కుదిరితే వచ్చే సోమ, మంగళవారాలు కూడా శెలవులు కలిసిరావొచ్చు.

మరోవైపు ఆర్టీసీ యాజమాన్యాలు, ప్రభుత్వం మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో ఇవాళ్టి నుంచి సమ్మెను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల్ని కూడా కలుపుకొని సకల జనుల సమ్మె తరహాలో ధర్నాలు చేస్తామని స్పష్టంచేశాయి. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తగ్గడం లేదు. ఆర్టీసీలో డిపార్ట్ మెంట్ల వారీగా ఉన్న ఖాళీల్ని లెక్కగట్టి, వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయిస్తున్నారు. ఈరోజు ఇటు గవర్నర్, అటు హైకోర్టు ఈ వివాదంపై స్పందించబోతున్నారు.

అఖిలప్రియ.. కేరాఫ్ గందరగోళ రాజకీయం!