కరోనా వచ్చిన దగ్గర్నుంచి అందరి దృష్టీ ట్రంప్ మీదే వుంది. అతని అహంభావం, నిష్క్రియాపరత్వం, రాష్ట్ర గవర్నర్లతో కలహించడం, వాచాలత్వం, చైనాను దోషిగా నిలబెట్టాలని చూడడం - అన్నీ బాగా కవర్ అవుతున్నాయి. కానీ అతనికి సన్నిహితుడైన బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనరో కరోనా విషయంలో అతన్ని అనుకరించడం గురించి మన తెలుగు మీడియాలో పెద్దగా రావటం లేదు. మన దేశపు రిపబ్లిక్ డే పెరేడ్‌కు అతను అతిథిగా వచ్చిన సందర్భంగా నేను రాసిన వ్యాసంలో అతను అతివాద రైటిస్టు అనీ, వ్యవసాయోత్పత్తులతో వ్యాపారం చేసే వర్గాలు (వీరిని ‘‘బీఫ్’’ అంటారు), మతానికి, రాజకీయాలకి ముడివేసిన చర్చి (‘‘బైబిల్’’), సైన్యం, దాని వెనక్కాల ఉన్న అమెరికా (‘బుల్లెట్’’) అనే మూడు ‘బి’ల సహాయంతో అధికారంలోకి వచ్చి, చాలా అహంభావంతో పాలిస్తూ, అనేక వర్గాలను దూరం చేసుకున్నాడని రాశాను.
చివరిలో - ‘మరి యిలాటి బోల్సొనరోను, ప్రపంచ వాణిజ్య సంస్థలో మనను వ్యతిరేకించేవాణ్ని మోదీ ఎందుకు ఆహ్వానిస్తున్నట్లు అనే సందేహం రావడం సహజం. తనతో కొన్ని లక్షణాలు కలుస్తున్నాయని తోచిందో ఏమో చెప్పలేం. 2015 రిపబ్లిక్ దినోత్సవానికి ఒబామాను యిలాగే అతిథిగా పిలిచారు. మోదీ ‘బరాక్, బరాక్’ అంటూ యింటి పేరు కాకుండా అతని అసలు పేరును పిలిచి స్నేహం చాటుకున్నారు. మరుసటి ఏడాది ఆయన పార్టీ ఎన్నికలలో ఓడిపోయింది. ఈ బొల్సోనరోకు మరో మూడేళ్ల వరకు పదవీకాలం ఉంది లెండి’ అని రాసి ముగించాను. కానీ బ్రెజిల్‌లో కరోనా కారణంగా అతని పట్ల వ్యతిరేకత ఉవ్వెత్తున ఎగసిపడడంతో పదవి ఉండాలంటే మిలటరీ సాయం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది.
నాలుగేళ్లక్రితం వరకు హెల్త్‌కేర్ సెక్టార్ ఉత్తమంగా వున్న అభివృద్ధి చెందుతున్న దేశాలలో బ్రెజిల్ ఒకటి. 2003 నుంచి 2016 వరకు దేశాన్ని పాలించిన వర్కర్స్ పార్టీ హయాంలో జిడిపిలో 8% ఆరోగ్యంపై ఖర్చు పెట్టారు. (మనదేశంలో అయితే యిది 1.5% లోపే) దేశమంతా ఎమర్జన్సీ యూనిట్లు నెలకొల్పి, క్యూబన్ డాక్టర్లను ఆహ్వానించి మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలకు వైద్యసౌకర్యాలు అందించారు. 2017లో మైకేల్ టెమెర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెల్త్ బజెట్‌లో 210 మిలియన్ డాలర్ల కోత విధించి, 20 ఏళ్ల దాకా ప్రజారోగ్యంపై అంతకు మించి ఖర్చు పెట్టకూడదని ఆదేశించింది. 2019లో బోల్సొనరో అధికారంలోకి వచ్చాక క్యూబా డాక్టర్లందరినీ వెనక్కి పంపించేసి, హెల్త్ బజెట్‌లో 250 మిలియన్ డాలర్ల అదనపు కోత విధించాడు. ఆ విధంగా దేశంలో ఆరోగ్య వ్యవస్థను చెడగొట్టాడు. ఇప్పుడు దానికి గాను దేశం అనుభవిస్తోంది.
ఉన్న సౌకర్యాలను వినియోగించుకున్నా బావుండేది. ఇతను కోవిడ్ పొడసూపినపుడు, అచ్చు ట్రంప్ లాగానే అది పెద్ద వ్యాధి కాదు పొమ్మన్నాడు. రాకపోకలపై ఆంక్షలు విధిస్తే, అది దేశ ఆర్థికవ్యవస్థను దెబ్బ తీస్తుందని వాదించాడు. కరోనాను తాను పట్టించుకోనని బాహాటంగా చాటడానికి ట్రంప్‌తో కలిసి ఊరేగాడు. ఫిబ్రవరి 12 కల్లా ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ అనే ఊపిరితిత్తుల రోగం ఉంది జాగ్రత్త అని హెచ్చరించింది. అయినా నెల్లాళ్ల తర్వాత మార్చి 13 న కూడా మన దేశపు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతినిథి కరోనా వైరస్ హెల్త్ ఎమర్జన్సీ కాదని చెప్పారు. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం ఆగకుండా చూడాలని మనం అలా చేసి వుంటాం.
బోల్సొనరో విషయంలో కూడా ట్రంప్ లింకుంది. మార్చి 6న ఫ్లారిడాలో తన అభిమాన నాయకుడు ట్రంప్‌తో డిన్నర్ కార్యక్రమం పెట్టుకున్నాడు మనవాడు. మన దగ్గర ఫిబ్రవరి 25 కల్లా ట్రంప్ కార్యక్రమం పూర్తయినా మధ్యప్రదేశ్‌లో కమలనాథ్‌ను గద్దె దింపే పని ఒకటి వుండిపోవడంతో మన దగ్గర కావసిన చర్యలు చేపట్టడంలో తాత్సారం జరిగింది. అక్కడా అదే సమస్య. వెనిజువెలా అధ్యక్షుడు మదురోను ఎలా గద్దె దింపాలా అని వీళ్లిద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ ఆలోచించాల్సి వచ్చింది.
తన అధికారులతో సహా ఫ్లారిడాకు వెళ్లబోతూ బోల్సొనరో వెనిజువెలా నుంచి తన దేశ రాయబారులను వెనక్కి రప్పించాడు. తన దేశం నుంచి ఆ దేశపు రాయబారులను వెళ్లగొట్టాడు. ఆ డిన్నర్ సమావేశంలో పాల్గొన్నవారిలో ట్రంప్ కూతురు ఇవాంకా, బోల్సొనరో కొడుకు ఎడ్యురాడో కూడా ఉన్నారు. ఈ ఎడ్యురాడో బ్రెజిల్‌లో కాంగ్రెస్‌మన్, అనధికార విదేశాంగ మంత్రి కూడా. పార్టీ పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి వచ్చిన మర్నాడే ఆ టీములో ఉన్న కమ్యూనికేషన్ సెక్రటరీకి కోవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. మరో ముగ్గురికి ఫ్లూ లక్షణాలు ఉన్నాయని తేలింది.
దీని గురించి అడిగితే బోల్సొనరో ‘కోవిడ్ అనేది మీడియా సృష్టించిన మాయ (ఫాంటసీ)’ అని కొట్టి పారేశాడు. కానీ వైద్యులు వదలేదు. తీసుకెళ్లి టెస్టు చేసి పాజిటివ్ అన్నారు. ట్రంప్‌కు, కన్సర్వేటివ్ పార్టీకి, తద్వారా బోల్సొనరోకు అనుకూమైన ఫాక్స్ న్యూస్ ‘పాజిటివ్’ అని రిపోర్టు చేసింది. కానీ ఇతను మాత్రం టీవీలో కనబడి ‘‘నాకు నెగటివ్ వస్తే, మీడియా వాళ్లు కావాలని అబద్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నారు.’’ అన్నాడు. దాంతో ఫాక్స్ న్యూస్‌కు కోపం వచ్చింది. ‘‘తన తండ్రికి పాజిటివ్ వచ్చిందని ఎడ్యురాడోయే చెప్పాడు.’’ అని ప్రకటించింది.
ఆనాటి డిన్నర్‌లో పాల్గొన్నవారిని టెస్టు చేసి చూస్తే ఒక అమెరికన్ సెనేటర్‌కు, వాషింగ్టన్‌లో బ్రెజిల్ వ్యవహారాలు చూసే అధికారి ఒకరికి కూడా పాజిటివ్ వచ్చింది. బ్రెజిల్‌లో తనతో ఫ్లారిడా వచ్చిన టీములోని ప్రభుత్వాధికారుల్లో 23 మందికి పాజిటివ్ వచ్చిందని తేలినా, చివరకు తనకే వచ్చినా బోల్సొనరో తొణకలేదు. ‘కాస్త జలుబు చేస్తే కొంప మునిగిపోదు’ అన్నాడు. ‘‘ఈ లోపున రాష్ట్ర గవర్నర్లు కొంతమంది తమ రాష్ట్రాలలో క్వారంటైన్‌లు విధించి, నానా హంగామా చేసి ప్రజల్లో హిస్టీరియా తెప్పిస్తున్నారు’’ అని కోప్పడ్డాడు. మార్చి 21న తన పుట్టినరోజునాడు తన పార్టీ కార్యకర్తలంతా వీధుల్లోకి వచ్చి తనకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వర్తించాలని అతని కోరిక.
కానీ అతని పుట్టినరోజు మరోలా జరిగింది. బ్రెజిల్ ప్రజలందరూ ఆ రోజు రాత్రి 8.30కి బాల్కనీల్లో నిలబడి కంచాలపై గరిటెలతో మోదుతూ (నిరసన తెలిపేందుకు దక్షిణ అమెరికాలో అదే పద్ధతి) ‘ఫోరా (పోరా) బోల్సొనరో’ అంటూ అరిచారు. రోడ్ల మీద వున్నవారు తమ కారు హారన్లతో మోతెత్తించారు. ఎందుకంటే బ్రెజిల్‌లో మొదటి కోవిడ్ మరణం మార్చి 13న సంభవించింది. మార్చి 21 నాటికి 18కి చేరింది. అయినా బోల్సొనరోకు చీమ కుట్టినట్లు లేదు. కోవిడ్ పాజిటివ్ వచ్చి క్వారంటైన్‌లో వున్నా మాస్క్ వేసుకోకుండా తన పుట్టినరోజున బయటకు వచ్చి అందరికీ షేక్‌హ్యాండ్‌లు యిచ్చి, ఫోటోలు దిగి, ఆ సాయంత్రం తన కుటుంబంతో, స్నేహితులతో పార్టీ చేసుకున్నాడు. ఇవన్నీ ప్రభుత్వాదేశాలకు విరుద్ధం.
బ్రెజిల్‌లోని ప్రయివేటు ఆసుపత్రుల్లో బెడ్‌లు ఖాళీ లేవు. చాలినన్ని టెస్టు కిట్స్ లేవు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినన్ని మాస్కులు, గ్లవ్ లు, శానిటైజర్లు లేవు. దేశం మొత్తం మీద 61 వేల వెంటిలేటర్లు వున్నాయి కానీ అవన్నీ దక్షిణ రాష్ట్రాల్లోనే వున్నాయి. కొరత వుందని తెలియగానే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ దేశాధ్యక్షుడికి ఏ బాధా లేదు. అతనికి మద్దతుగా నిలిచిన చర్చి కూడా ప్రార్థనలు ఆపనక్కరలేదని చాలాకాలం వాదిస్తూ వచ్చింది.
బ్రెజిల్‌లో వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవాంటే మనతో పోల్చుకుంటే అర్థమవుతుంది. దాని జనాభా 21 కోట్లు. మన జనాభాలో ఆరో వంతు కంటె తక్కువ. మరి కోవిడ్ మరణాలు 2575 అంటే మన కంటె 4 రెట్ల కంటె ఎక్కువ. అందుకే కొన్ని రాష్ట్రాలు ఐసోలేషన్ పాలసీ పాటిస్తున్నాయి. అన్నిటి కంటె పెద్ద రాష్ట్రమైన సావో పౌలో మార్చి 24 నుంచి క్వారంటైన్ ఆర్డర్ పేర అత్యవసర వ్యాపారాలు తప్ప తక్కినవాటిని మూసేసింది. అది బోల్సొనరోకు మంట తెప్పిస్తోంది. ఇలా అయితే దేశ ఆర్థిక పరిస్థితి ఏమై పోతుందంటూ గోల పెడుతున్నాడు.
అమెరికాలో ట్రంప్‌కు పక్కలో బల్లెంలా ఆంథోనీ ఫాసీ అనే హెల్త్ ఎడ్వయిజర్ ఉన్నాడు. కోవిడ్ ప్రమాదకరమైనది, తేలికగా తీసుకోకూడదు అని చెప్పిచెప్పి ట్రంప్‌ను విసిగిస్తున్నాడు. అతన్ని తీసేయాలని ఉన్నా ట్రంప్ యిప్పటిదాకా తటపటాయిస్తున్నాడు. ట్రంప్‌కు ఫాసీ తగిలినట్లే, బోల్సొనరోకు అతని హెల్త్ మినిస్టర్ మాన్‌డెట్టా తగిలాడు. అతను వృత్తి రీత్యా డాక్టరు. ‘‘ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి మాకు ఒక బిలియన్ డాలర్ల బజెట్ వెంటనే శాంక్షన్ చేయించండి’ అని మార్చి రెండోవారంలోనే కాంగ్రెస్‌ను బతిమాలాడు. దేశాధ్యక్షుడు మాస్క్ లేకుండా తిరగడాన్ని విమర్శించాడు. లాక్‌డౌన్ పెట్టాలని వాదించాడు.
‘అలా చేస్తే ఆర్థికంగా అతలాకుతలమై అందరికీ ఉద్యోగాలు పోతాయన్న స్పృహ అతనికి లేదు.’’ అని బోల్సొనరో మండిపడుతూ వచ్చాడు. చివరకు ఏప్రిల్ 16న అతని పదవి ఊడపీకేశాడు. కాంగ్రెసు నీకు కోవిడ్ వచ్చిందా లేదా చెప్పు అని నిలదీసినా, బోల్సొనరో జవాబు చెప్పటం లేదు. తమ రాష్ట్రంలో మరణాల సంఖ్య ఎక్కువవుతున్న కొద్దీ సావో పౌలో మే 10 వరకు క్వారంటైన్ పొడిగించింది. బోల్సొనరో అనుచరులు దానిని ప్రతిఘటిస్తూ, క్వారంటైన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మొన్న 19న ఆదివారం నాడు మిలటరీ హెడ్‌క్వార్టర్స్ ముందు పెద్ద ప్రదర్శన నిర్వహించారు.
దానికి బోల్సొనరో హాజరై దగ్గుతూ ప్రసంగించాడు. ఆ ప్రదర్శనలో ‘‘బోల్సొనరో ఆధ్వర్యంలో మిలటరీ పాలన రావాలి’’ అనే ప్లకార్డులు కనబడ్డాయి. ప్రజామోదం యిగిరిపోతోంది కాబట్టి మిలటరీ సహాయంతో అధికారాన్ని చేజిక్కించుకుని, కాంగ్రెసును, రాష్ట్ర గవర్నర్లను రద్దు చేద్దామని చూస్తున్నాడన్న సందేహాలు వస్తున్నాయి. అతన్ని అడిగితే అబ్బే అదేమీ లేదు, నా ప్రత్యర్థులెవరో ఆ ప్లకార్డు పట్టుకుని ఊరేగింపులో చొరబడి వుంటారు అంటున్నాడు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఏం జరిగినా బ్రెజిల్ రాజకీయాల్లో పెద్ద మలుపుకు కరోనా కారణభూతమైందని చెప్పుకోవాల్సిందే! (ఫోటో - ఆదివారం నాడు జరిగిన క్వారంటైన్ వ్యతిరేక ప్రదర్శనలో దగ్గుతూ ప్రసంగించిన దేశాధ్యక్షుడు)
- ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2020)
mbsprasad@gmail.com