టీఆర్‌ఎస్‌కి షాక్‌: ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా

కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి జోస్యం ఫలించేలా వుంది. ఇద్దరు ఎంపీలు, టీఆర్‌ఎస్‌కి గుడ్‌ బై చెప్పబోతున్నారంటూ ఇటీవల రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. రేవంత్‌ వ్యాఖ్యల్ని ఖండిస్తూ, ఇద్దరు ఎంపీలు మీడియా ముందుకొచ్చారు. తాము టీఆర్‌ఎస్‌ని వీడటంలేదని సెలవిచ్చారు. అందులో ఒకరు సీతారాం నాయక్‌ కాగా, మరొకరు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.

ఏమయ్యిందోగానీ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసేశారు. పార్టీకీ, ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖని పార్టీ కార్యాలయానికి పంపించేశారు. ఈ రాజీనామా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమయ్యింది.

నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందనీ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాను సూచించినవారికి టిక్కెట్లు ఇవ్వలేదనీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌పై అసహనంతో వున్నారు. ఆ అసహనాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేసినా, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్‌ లైట్‌ తీసుకోవడంతోనే, ఈ రాజీనామా అన్నది సర్వత్రా వ్యక్తమవుతోన్న అభిప్రాయం.

ఇదిలా వుంటే, మరో ఇద్దరు ఎంపీలు రాజీనామా బాటలో నడవనున్నారంటూ కాంగ్రెస్‌తోపాటు, టీడీపీ తాజాగా 'జోస్యం' చెబుతుండడంతో, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. సరిగ్గా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ పర్వం ముగియగానే, ఎంపీల రాజీనామాలంటే చిన్న విషయం కాదు.

ఓ పక్క, ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ జోరు పెంచితే, ఇంకోపక్క పార్టీకి ఎంపీ రాజీనామా చేయడమంటే చిన్న విషయం కాదు కదా.! కాగా, ఖచ్చితమైన సమాచారంతోనే రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితోపాటు సీతారాం నాయక్‌ టీఆర్‌ఎస్‌ని వీడతారని ప్రకటించారనీ, రేవంత్‌ చెప్పినట్టుగానే ఓ ఎంపీ టీఆర్‌ఎస్‌కి రాజీనామా చేశారనీ, సీతారాం నాయక్‌ కూడా త్వరలో పార్టీ వీడబోతున్నారనీ, ఈ ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరతారనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

తాము పార్టీని వీడబోవడంలేదని ఇటీవలే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీతారాంనాయక్‌ ప్రకటించినప్పుడు, 'నేను మీ పేర్లు చెప్పలేదు కదా, మీరెందుకు ఉలిక్కిపడ్డారు.?' అంటూ వారిపై రేవంత్‌రెడ్డి చతుర్లు విసిరారు. ఇంతలోనే, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కి గుడ్‌ బై చెప్పడం విశేషమే మరి.  

ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments