ప్లాన్ రివర్స్: కొంప ముంచుతున్న సిట్టింగ్ లు

దొరికినోళ్లని దొరికినట్టు తన పార్టీలో చేర్చుకొని ప్రతిపక్షం అనేదే లేకుండా చేశారు కేసీఆర్. ఆ ధీమాతోనే ముందస్తుకి సిద్ధమయ్యారు. అయితే 105 మంది సిట్టింగ్ లకు మళ్లీ చోటివ్వడమే ఆయన చేసిన అతిపెద్ద పొరపాటుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత లేదు కానీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మాత్రం స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. బ్యాలెట్ పోరుకి మహూర్తం దగ్గరపడే కొద్దీ కేసీఆర్ కి ఈ తలనొప్పులు ఎక్కువయ్యాయి.

తాజాగా నోరుజారిన ఆపద్ధర్మ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. ఎన్నికల ఖర్చు కోసం 10 కోట్లిస్తానంటూ కేసీఆర్ ఆఫర్ చేశారని చెప్పిన నాయిని, ఆ తర్వాత 10 లక్షలేనంటూ మాట మార్చారు. అడుసు తొక్కి కాలుకడుక్కోవాలని చూస్తున్నా.. కాంగ్రెస్ చేతిలో అడ్డంగా బుక్కయ్యారు.

ఇక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను లైంగికంగా వేధించాడంటూ ఆయన పరువుని, టీఆర్ఎస్ ప్రతిష్టను బజారుకీడ్చింది శ్రీరెడ్డి. ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేయలేం, సినిమా ఇండస్ట్రీతో జీవన్ రెడ్డికి ఉన్న పరిచయాలు, ఆయన లైఫ్ స్టైల్ గమనించిన ఎవరికైనా ఆయన అంతటి రసికుడే అని అర్థమవుతుంది.

కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏకంగా మీడియా మందే ప్రత్యర్థుల్ని ఖతం చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. నోటి దురుసుతో ఒకరు, నోరుజారి మరొకరు, వ్యక్తిగత బలహీనతతో ఇంకొంకరు.. ఇలా టీఆర్ఎస్ పరువుని బజారుకీడ్చడంలో ప్రతిపక్షాల కంటే ముందే ఉంటున్నారు అధికార పక్షనేతలు.

ఇంకొన్ని నియోజకవర్గాల్లో అయితే ప్రచారానికొచ్చిన వారిని స్థానికులు తరిమి కొడుతున్నారు. ప్రచార రథాల గాలితీస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సహా మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈ విషయంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అసంతృప్తుల సంగతి సరేసరి. టికెట్ కేటాయించలేదని నల్లాల ఓదేలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అతని అనుచరుడి ఆత్మాహుతి తెలంగాణలో మరో సంచలనంగా మారింది.

కీలక నేతలు మినహా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ అసంతృప్తులు రగిలిపోతున్నారు. టికెట్లు దక్కని ఎమ్మెల్యేలు కూడా వెంటనే రెబల్స్ గా మారి అధికార పక్షంపై దుమ్మెత్తిపోస్తున్నారు. బాబూ మోహన్, కొండా దంపతులు ఇలా చాలామంది పేరున్న నేతలే బైటకు వెళ్లిపోయారు. ప్రతిపక్షం చేసింది ఏమీలేకపోయినా, ఇలా అధికార పక్షం తనకు తానుగానే బలహీనపడుతోంది.

చాలాచోట్ల సిట్టింగులకే మళ్లీ సీట్లు ఇచ్చి, కేసీఆర్ మరీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతోంది. ఎన్నికల టైమ్ దగ్గరపడేకొద్దీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కి బలంకాదు, బలహీనత అనే విషయం స్పష్టమవుతోంది. 

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments