స్నేహపూర్వక పోటీ.. స్నేహపూర్వక శత్రుత్వం

స్నేహపూర్వక పోటీ, ఆరోగ్యకరమైన పోటీ అనే పదాలు అందరికీ తెలిసినవే. చాలాచోట్ల ఇది నడుస్తోంది కూడా. కానీ తొలిసారి తెలంగాణ ఎన్నికల సాక్షిగా స్నేహపూర్వక శత్రుత్వం అనే కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టారు కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ రద్దు సమయంలో కేంద్ర ప్రభుత్వంపై కానీ, బీజేపీపై కానీ పల్లెత్తుమాట తూలలేదు కేసీఆర్. తొలి ప్రచార సభలో కూడా కాంగ్రెస్ ని చెడుగుడు ఆడుకున్నాడే తప్ప, కాషాయ దళాన్ని టచ్ చేయలేదు. మోదీతో కేసీఆర్ కు ఉన్న లాలూచీకి ఇంతకంటే పెద్ద నిదర్శనాలు అక్కర్లేదు.

కానీ ఇది ఎన్నికల టైమ్. ఆరోపణలు, విమర్శలు చేయాల్సిందే. లేదంటే జనాలకు, మిగతా పార్టీలకు అనుమానం వస్తుంది. బీజేపీకి ఇక్కడే సమస్య ఎదురైంది. తమను పల్లెత్తుమాట అనని టీఆర్ఎస్ ను ఎలాతిట్టాలి. వాళ్లను తిట్టాలి అంటే ముందు తిట్టించుకోవాలి కదా.. అందుకే తెలంగాణ బీజేపీ నేతలు నోరు చేసుకుంటున్నారు. కేసీఆర్ పై క్రమక్రమంగా దాడికి దిగుతున్నారు. కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ తొలిసారిగా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామంటూ భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు.

కేంద్రప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో టీఆర్ఎస్ విఫలమైందని ఆరోపిస్తున్న దత్తాత్రేయ.. గొర్రెలు, గేదెల పంపిణీ, చేపల పెంపకం వంటి కార్యక్రమాల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే వీటన్నిటిపై విచారణ చేపడతామని హెచ్చరించారు.

బీజేపీ ఆరోపణలను టీఆర్ఎస్ తిప్పికొట్టడం ఖాయం. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకపోతే తమ మధ్య ఉన్న ఒప్పందంపై జనాలకు అనుమానం కలుగుతుందేమోనని బీజేపీ, టీఆర్ఎస్ ఇలా ఓ అండర్ స్టాండింగ్ కి వచ్చినట్టున్నాయి. అందుకే ఈ విచారణ పర్వం, విపరీత ఆరోపణలు.

సో.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఆరోపణలు, విమర్శలు పైపై మెరుగులు మాత్రమే. వాటిని సీరియస్ గా తీసుకోవాల్సి అవసరం లేదన్నమాట. ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు కలిసిపోతాయని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ అని చెప్పిన కేసీఆర్.. బీజేపీతో స్నేహపూర్వక శత్రుత్వాన్ని నడుపుతున్నాడన్నమాట.

RELATED ఐక్యరాజ్యసమితిలో ఆవు కథ చెప్పిన చంద్రబాబు