సీఎం భార్యకు టికెట్.. పార్టీలో ముసలం

కర్ణాటక జేడీఎస్ లో మరో ముసలం పుట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. తన భార్య అనితకు టికెట్ ఇచ్చుకోవాలని కర్ణాటక సీఎం కుమారస్వామి చేస్తున్న ప్రయత్నాలు సొంత పార్టీలోనే విమర్శలకు దారి తీస్తున్నాయి. కుమారస్వామి ఇంట్లో ఈ లొల్లి కొత్తది ఏమీకాదు. ఇది వరకే ఉంది.

దేవేగౌడ తనయుల్లో ఇద్దరు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారు. వీరి మధ్యన ఆధిపత్య పోరు మొదటి నుంచి ఉంది. అయితే మొన్న అధికారం దక్కడంతో అంతా సర్దుకుపోయారు. కుమార సీఎం సీట్లో, రేవణ్ణ మంత్రిగా కూర్చుకున్నాడు. అయితే వీరి భార్యలు, పుత్రుల మధ్యన ఆధిపత్య పోరు అలాగే ఉంది. పోటీ విషయంలో వీళ్లంతా పోటీ పడుతున్నారు.

ఇక తాజాగా రామనగర సీటుకు బైపోల్ వచ్చింది. గత ఎన్నికల్లో ఈ సీట్లో కుమారస్వామి నెగ్గాడు. మరో సీట్లో కూడా నెగ్గడంతో తమకు అనుకూలమైన రామనగర సీటుకు రాజీనామా చేశాడు కుమార. అక్కడ ఇప్పుడు తన భార్య అనితను నిలబెట్టాలని అనుకుంటున్నాడు. అయితే ఈ విషయంలో దేవేగౌడ ఇంటి నుంచినే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు కుమార తనయుడు నిఖిల్ కూడా మండ్యా నుంచి పోటీ చేస్తాడనే ప్రచారం సాగుతోంది. ఈ నేఫథ్యంలో ఇంట్లో వాళ్లే అన్ని సీట్లనూ ఆక్రమించేయడం పట్ల జేడీఎస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని సమాచారం.

అయితే ఇవన్నీ మామూలే అని.. కుమార వీటిని లెక్క చేయడని.. అనితా కుమారస్వామి రామనగర నుంచి పోటీచేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

Show comments