రానా బాబు... భలే ట్రోలింగ్

పైన చెప్పుకున్న హెడ్డింగ్ లో రానా అంటే దగ్గుబాటి రానా. ఇక బాబు అంటే చంద్రబాబు అని అర్థం. ఇప్పుడీ "రానా బాబు" ప్రస్తావన ఎందుకంటే, కొద్ది సేపటి కిందట చంద్రబాబు గెటప్ లో రానా ఉన్న స్టిల్ ను విడుదల చేశారు. వినాయక చవితి కానుకగా ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన ఫొటో ఇది

ఫొటో బాగుంది. అందులో రానా కూడా బాగున్నాడు. 80ల కాలం నాటి చంద్రబాబు గెటప్ ను బాగానే ఫాలో అయ్యారు. హెయిర్ స్టయిల్, మీసకట్టును అనుకరించడంలో మంచి పనితనం చూపించారు. అలా పక్కా ప్లానింగ్ తో విడుదల చేసిన ఫస్ట్ లుక్ హిట్ అవుతుందనుకుంటే ట్రోలింగ్ లు ఎక్కువైపోయాయి. రానా లుక్ వరకు ఓకే కానీ, అతడు పోషిస్తున్న చంద్రబాబు పాత్రపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జోకులు పేలుతున్నాయి. 

బాహుబలిలో భళ్లాలదేవుడి లాంటి భయంకరమైన విలన్ పాత్ర పోషించిన రానా, తన కెరీర్ లో మరో భయంకరమైన విలన్ పాత్రతో రెడీ అయ్యాడంటూ ఈ స్టిల్ పై తెగ కామెంట్స్ పడుతున్నాయి. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని బయోపిక్ లో కచ్చితంగా చూపించరు. కానీ ఈ లుక్ రిలీజ్ చేసిన సందర్భంగా.. ఈ తరహా కామెంట్లు ఎక్కువయ్యాయి. 

చంద్రబాబులా రానా బాగా సూట్ అయ్యాడు కానీ, బాబులా నవ్వడంతో, బాబులా కన్నింగ్ గా చూడడంలో రానా ఎందుకూ పనికిరాడంటూ మరో పోస్ట్ పడింది. అసలు "వెన్నుపోటు వాస్తవాలు" తెలిసి మరీ ఈ క్యారెక్టర్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావంటూ మరికొందరు పోస్టులు పెట్టారు. చంద్రబాబు ఎలాగూ వెన్నుపోటు గురించి బయటకు చెప్పరు, కనీసం రానా అయినా ట్వీట్ చేయాలంటూ మరో కామెంట్. ఇది నెగెటివ్ క్యారెక్టరా.. లేక పాజిటివ్ పాత్రా అంటూ మరో ప్రశ్న. ఇలా ఒకటి కాదు, ఈ ఫొటోపై లెక్కలేనన్ని పోస్టులు పడుతున్నాయి.

ఇవన్నీ ఒకెత్తయితే అసెంబ్లీ సెట్ ముందు చంద్రబాబు గెటప్ లో రానా నడుస్తున్న స్టిల్స్, నిరసన తెలియజేస్తున్న స్టిల్స్ కొన్ని లీక్ అయ్యాయి. ఆ స్టిల్స్ పై కూడా బోలెడంత రచ్చ నడుస్తోంది. వైశ్రాయ్ హోటల్, బాలయ్యకు లింక్ పెడుతూ ట్రోలింగ్ కొనసాగుతోంది. మొత్తమ్మీద చంద్రబాబు లుక్ విడుదల చేసి బజ్ క్రియేట్ చేద్దామనుకున్న మేకర్స్ కు అది కాస్తా రివర్స్ లో కొట్టింది.

RELATED తాత, తండ్రి, మనవడు.. సేమ్ టు సేమ్