త్రివిక్రమ్ కళ్లలో స్పార్క్ చూసా-ఎన్టీఆర్

ఎన్టీఆర్-త్రివిక్రమ్-అరవింద సమేత వీరరాఘవ.. ఇప్పుడు ఈ మూడూ ఫుల్ ట్రెండింగ్ లో వున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అరుదైన కాంబినేషన్.. ఆ కాంబినేషన్ లో వస్తున్న సినిమా. ఒక పక్క తండ్రి దూరమైన బాధ, మరోపక్క ఎన్నాళ్లుగానో కలలుకన్న కాంబినేషన్ లో వస్తున్న సినిమా, ఇంకోపక్క పెరిగిపోతున్న అభిమానుల అంచనాలు. ఈ నేపథ్యంలో ప్రింట్ మీడియాతో ముచ్చటించిన ఎన్టీఆర్ వెబ్ మీడియాలో గ్రేట్ ఆంధ్రకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూ ఇచ్చారు.

పార్క్ హయాత్ హోటల్ లో జరిపిన ఈ ఇంటర్వూ విశేషాలు.

బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు.
అవునండీ.. మన పరిస్థితులు ఎలా వున్నా, మన డ్యూటీ తప్పదు కదా?

ఇప్పుడు ప్రశ్నలు అడగడం అంటే మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టడమే అవుతుందేమో?
అబ్బే.. అదేం లేదు. నిజానికి ఇలాంటపుడే కాస్త మనసులో మాటలు పంచుకోవాలని అనిపిస్తుంది. దాదాపు నెల రోజులుగా భారం అంతా గుండెల్లో మోస్తున్నా. ఇలా కలిసినపుడే కాస్త మాట్లాడితే భారం దిగినట్లు అవుతుంది అనిపిస్తుంది. అస్సలు ఊహాతీతం అంటామే.. అలాంటిది జరిగితే, తట్టుకోవడం కష్టం అండీ. పెద్ద దిక్కు అంటామే.. అంటే మనకు ఏమైనా కష్టం వస్తే పైకి చూడడం, అది నాన్న అయినా కావచ్చు, పవర్ అయినా కావచ్చు, మరే శక్తి అయినా కావచ్చు. అది లేదు అనిపిస్తే..

బెటర్.. మరోసారి కలుద్దామంటారా? మీ మనసును మళ్లీ కెలికినట్లు అవుతుందేమో?
అయ్యో.. నిజానికి డెస్టినీ అంటామే.. అది చూసానండీ.. ఇప్పటికి ఇన్ని సినిమాలు చేసాను. చిత్రంగా ఏ ఒక్క సినిమాలో కూడా ఓ పాత్రధారుడిగా తండ్రి పాత్రకు కొరివి పెట్టే సీన్ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ చేసాను. చిత్రంగా అది కూడా ఆ సీన్ అలా పెండింగ్ లో వుంచాం. ఇప్పుడు నాన్న పోయిన తరువాత ఆ సీన్ చేయడం.. అస్సలు కలలో కూడా అనుకోనిది. ఆ రోజు షూట్ లో, నా బాధ ఏ రేంజ్ లో వుందో, నాకే తెలుసు. అదేకాదు, పెనిమిటి పాట కూడా, ఈ సీన్ తరువాతే షూట్ చేసాం. అది కూడా నా మీద షూట్.. విధి అంటే ఇదే.

నిజమే.. హ్యాపీ మూడ్ లో వుండి, శాడ్ సీన్ చేయడం వేరు. శాడ్ మూడ్ లో వుండి పాటలు, డ్యాన్స్ లు చేయడం.. ఊహించగలను మీ పరిస్థితి.
నిజమే. అయితే, సన్నిహితులు, త్రివిక్రమ్ అంతా సపోర్ట్ గా నిల్చున్నారు. నన్ను ఇబ్బంది పెట్టకుండా, షూటింగ్ జరిగేలా చూసారు.

సరే, సినిమా విషయానికి వద్దాం.. మీతో సహా అందరు హీరోలు చేసి, అరిగిపోయిన ఫ్యాక్షనిజాన్ని, నిజానికి జనాలు కాస్త మరిచిపోయిన దాన్ని ఎందుకు తీసుకున్నారు మళ్లీ.
వాస్తవానికి ఇక్కడ ఫ్యాక్షనిజం అనికాదు. వయిలెన్స్. హింసను రూపుమాపాలి. అది ఎలా సాధ్యం? ఒక్కోచోట వయిలెన్స్ అనేది ఒక్కో ఐడెంటిఫికేషన్ తో వుంటుంది. మన దగ్గర మరే విధమైన వయిలెన్స్ లేదు. మనకు వయిలెన్స్ అంటే ఫ్యాక్షనిజమే. మరి ప్రేక్షకులు వయిలెన్స్ ను ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? అందుకే ఫ్యాక్షనిజం అన్నదాన్ని వాడక తప్పలేదు.

ఫ్యాక్షనిస్టు సినిమాలో విలన్ అంతం మాత్రమే వుంటుంది. కానీ ఫ్యాక్షనిజం అంతానికి చాలామంది రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు తమదైన శైలిలో ట్రయ్ చేసారు. మీరు సినిమాలో కొత్తగా ఏం పరిష్కారం చెబుతారు.
ఇది ఓ రచయిత, ఓ దర్శకుడు చెబుతున్న పరిష్కారం. అదే ఏమిటన్నది మీరు అరవింద సమేత వీర రాఘవలో చూస్తారు.

పవన్ కోబలినే అరవిందగా మారిందా? లేక ఇది వేరునా?
అది నాకు తెలియదు. నాకు ఆయన మూడు సబ్జెక్ట్ లు చెప్పారు. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను.

మిగిలిన జోనర్ లు ఏమిటి? ఇదే ఎందుకు నచ్చింది?
ఒక్కో దర్శకుడు, కథకుడికి ఒక్కో సబ్జెక్ట్ మీద ప్రేమ వుంటుంది. అన్నీ తనవే అయినా, ఒక దానిపై ఎక్కువ ప్రేమ వుంటుంది. అలాంటి కథ, అలాంటి సబ్జెక్ట్ చెబుతుంటే, వాళ్ల కళ్లలో ఓ స్పార్క్ వుంటుంది. అలాంటిది నేను ఈ సబ్జెక్ట్ చెబుతున్నపుడు త్రివిక్రమ్ కళ్లలో చూసా.

ఇదంతా అజ్ఞాతవాసికి ముందా? తరువాతా?
ముందే అండీ.. చాలా ముందు.

ఆ తరువాత మార్పులేమైనా చేసారా?
లేదు. అస్సలు లేదు. ఏమండీ.. ఫ్లాపులు ఎవరికి రావు? నేను ఫ్లాపుల్లో వున్నపుడు నాతో సినిమా చేసిన డైరక్టర్లు, ఈడు ఫ్లాపుల్లో వున్నాడ్రా.. వీడితో సినిమా చేయాల్సి వచ్చింది అని అనుకుని వుంటే? లేదా మీలాంటి జర్నలిస్టులు ఫ్లాపుల్లో వున్నపుడు, వీడిని ఇంటర్వూ చేయాల్సి వచ్చిందే అని అనుకంటే.. ఫ్లాపులు అన్నవి వదిలేయండి. త్రివిక్రమ్ క్వాలిటీలు, ఆయన సమర్థత, ఎమోషన్లు ఏ రేంజ్ లో వుంటాయి? ఖలేజాలో కొన్ని సీన్లు, అత్తారింటికి దారేది క్లయిమాక్స్. అబ్బో.. ఆయన స్టామినా వేరు.

స్క్రిప్ట్ లో మీరు కూడా సాయం పట్టారా?
అస్సలు లేదు. నేను డైరక్టర్లను స్టిమ్యులేట్ చేసి వదిలేస్తాను. నేను బాగా ఆన్సర్లు చెపితే కదా, మీరు మరిన్ని క్వశ్చన్లు వేస్తారు. అదే స్టిమ్యులేట్ చేయడం అంటే. దర్శకుడు ఒక్కో సీన్ అల్లుతుంటే, బాగుంది అని చెప్పడం, దానిముందు వెనుకల గురించి అడగడం. అంతే ఆ మాత్రం చాలు త్రివిక్రమ్ లాంటి వాళ్లు అద్భుతమైన స్క్రిప్ట్ తయారుచేసి మన చేతిలో వుంచుతారు. అయినా నాకే అంత టాలెంట్ వుంటే నేనే డైరెక్ట్ చేసేస్తాగా. పోతే పోయింది ఓ సినిమా అని.

అరవింద సమేత వీర రాఘవ.. ఈ టైటిల్ చెప్పగానే ఎలా అనిపించింది
నచ్చింది. మనకు దేనికైనా మహిళలే ముందు కదండీ.. సీతారాములు, లక్ష్మీ నారాయణలు, పార్వతీ పరమేశ్వరులు.. సినిమాలో కీలమైన పాయింట్ కూడా అదే. అందుకే సరైన టైటిల్ అనిపించింది.

మహిళలు ముందు అంటే అడగాలని అనిపిస్తోంది. చాలామంది టాప్ హీరోల భార్యలు సోషల్ నెట్ వర్క్ లో, భర్తల సినిమాల వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తన్నారు. మరి మీ భార్య? ఏమిటో?
తనకి ఇవన్నీ పెద్దగా ఇంట్రస్ట్ లేదు. నా సినిమాలు చూస్తుంది. కానీ ఇంట్లో చూడదు. థియేటర్లో కూర్చుని చూస్తానంటుంది. ఓకె అంటాను. నేనేమీ ఇంట్లోనే చూడు అని ఫోర్స్ చేయను.

అంటే భర్త చాటు భార్య అనుకోవాలా?
అయ్యో.. అంత లేదండీ బాబూ.. తనకు ఇష్టమైన వాటిల్లో తను హుషారే. తను పెరిగిన వాతావరణం అంతా వేరు.

మరి మీరు మీ స్క్రిప్ట్ లు ఆమెకు చెబుతారా? అరవింద గురించి చెప్పారా? రియాక్షన్?
స్క్రిప్ట్ చెప్పాను. బాగుంది అంది. టైటిల్ చెప్పాను. భలేగా వుందే అంది.

ఇప్పుడు మీరే ఇద్దరు పిల్లల తండ్రి. మీకూ పెంపకం బాధ్యతలు వచ్చేసాయా?
ఇంట్లో నానమ్మ, అమ్మమ్మ వుంటే ఆ పిల్లల పెంపకం వేరుగా వుంటుంది. అమ్మ నాకు రామాయణం, భారతం అన్నీ చెప్పి పెంచింది. పాత సినిమాల మంచి చెడ్డలు, పాత పాటలు చెప్పేది. నాకు అన్నీ గుర్తే. నా తెలుగు ఇలా వుందంటే అమ్మే కారణం. ఇప్పుడు నా పిల్లలకు కూడా అన్నీ నేర్పుతుంది. నా భార్య కూడా పిల్లల విషయంలో చాలా కేర్ గా వుంటుంది. తను ఒకటే అంటుంది. మనం ఎలా పెరిగామో? వాళ్లు కూడా అలా పద్దతిగా పెరిగాలి అని.

కమింగ్ బ్యాక్ టు అరవింద.. సాంగ్స్ మీద ఫ్యాన్స్ పీలింగ్ మీదాకా వచ్చిందా?
వాళ్లు హ్యాపీనే అండీ. స్క్రిప్ట్ చెప్పినపుడు ఎప్పుడూ ఇక్కడ పాట వస్తుంది అన్న పాయింట్ వుండదు. చూసిన సినిమా కథ మిమ్మల్ని చెప్పమన్నా అనుకోండి.. ఇక్కడ పాట వస్తుంది అని చెబుతారా? చెప్పరు. స్క్రిప్ట్ ను పూర్తిగా ఎలాబరేట్ చేసినపుడు, ఇక్కడ పాట వుంటే బాగుంటుంది. ఇక్కడ పాట వుండాలి. అన్న పాయింట్ వస్తుంది. మన ముందుకాలంలో పాటలు స్క్రిప్ట్ లో, కథ చెప్పడంలో భాగం. కానీ తరువాత రాను రాను పాట అంటే అదో అయిటమ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచన, దృక్ఫథం మారుతున్నాయి. అరవిందలో పాటలు అన్నీ సిట్యువేషన్ తో సింక్ అవుతూ, ముందుకు వెళ్తాయి.

మరో రెండేళ్లపాటు అభిమానులకు కనిపించరేమో?
అయ్యో అలా భయపెట్టేకండి.. రెండేళ్లు.. దూరం అంటూ. అంత వుండదు లెండి. త్వరగానే ఫినిష్ అయిపోవచ్చు. ఈసారి జక్కన్న త్వరగానే చేసేస్తారేమో?

ఆ సినిమా గురించి మాత్రం ఏమీ చెప్పరు కదా?
మీకు తెలిసిందే కదా.. అన్నీ రాజమౌళే చెబుతారు. జక్కన్నతో అన్నా.. త్వరగా స్టార్ట్ చేయి.. జనాలు నన్ను అడుగుతున్నారు అని.

రాజమౌళి తరువాత కొరటాల శివదే నా? ఇంకేమన్నా ఫిక్స్ అయ్యాయా?
ప్రస్తుతానికి ఈ రెండే ఫిక్స్ అయ్యాయి. చూడాలి. ఆ తరువాత.

థాంక్సండీ.. విష్ యు ఎ గ్రాండ్ సక్సెస్
థాంక్స్ అండీ.