మొత్తానికి సినిమావాళ్లు అనిపించుకున్నారు!

అధికారంలో ఉన్నవారితో అంటకాగటం, అధికారం లేకపోతే కనీసం వారివైపు కన్నెత్తి కూడా చూడకపోవడం సినిమావాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ ఎన్నికల సాక్షిగా మరోసారి ఇదే విషయం రుజువైంది. 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ నేతలతో రాసుకుపూసుకు తిరిగిన సినిమా వాళ్లంతా.. కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నారని తెలియగానే గప్ చుప్ అయిపోయారు. ఎక్కడా ఏ అభ్యర్థికీ ఎవరూ మద్దతు తెలపలేదు. 

పరాయి రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రాజ్ లాంటివాళ్లు మాత్రం కేసీఆర్ ని మెచ్చుకున్నారు. ఖుష్బూ, నగ్మా లాంటి నటీమణులు కాంగ్రెస్ కి ప్రచారం చేసి పెట్టారు. అయితే టాలీవుడ్ నటీనటులెవరూ పాలిటిక్స్ ని టచ్ చేయలేదు. పొలిటీషియన్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

పోలింగ్ రోజు మాత్రం సిరా మరకను చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఫలితాలొచ్చిన ఈరోజు మాత్రం ఒక్కొక్కరూ బైటకొచ్చారు. భజన ప్రారంభించారు. కేసీఆర్ శెహభాష్, ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఆయన విజయానికి సోపానాలంటూ సోపేయడం ప్రారంభించారు.

సూపర్ స్టార్ కృష్ణ కేసీఆర్ కు ఓ శుభాకాంక్షల లేఖ రాశారు. కేసీఆర్ గారూ సంభవం, ఇది మీకే సంభవం మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానంటూ ట్విట్టర్ లో ఎక్కడలేని అభిమానం కురిపించారు మంచు మోహన్ బాబు.

ఎన్నికలకు ముందు ఫిలింనగర్ దైవ సన్నిధానంలో కేసీఆర్ గెలవాలని కోరుకున్నానని, అప్పుడే తథాస్తు దేవతలు తథాస్తు అన్నారని కూడా సెలవిచ్చారు. మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మి కూడా కేసీఆర్ కి అభినందనలు తెలుపుతూ... మీ పాలనలో మరో ఐదేళ్లు తెలంగాణ ఎలా ఉండబోతుందో చూడాలని ఉందంటూ ట్వీటింది.

మీ ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు హ్యాట్సాఫ్ అని కేసీఆర్ ని అభినందించారు సీనియర్ నటుడు, బీజేపీ నాయకుడు కృష్ణంరాజు. హీరో రామ్, సందీప్ కిషన్, నాని, రాజ్ తరుణ్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా ఇప్పటివరకూ ఆపుకున్న తమ భావోద్వేగాలను ట్విట్టర్ లో పంచుకున్నారు.

దర్శకుడు హరీష్ శంకర్, రచయిత కోన వెంకట్ కూడా కేసీఆర్ కి తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ సూపర్ అంటూ విపరీతమైన  ప్రేమాభిమానాలు కురిపించారు. మొత్తానికి సినిమావాళ్లు తమ తెలివితేటలను మరోసారి చూపించారు.

ఎన్నికల వరకు టీఆర్ఎస్ నేతలతో రాసుకుపూసుకు తిరిగిన వీరంతా ఎన్నికల సీజన్లో పత్తా లేకుండాపోయారు. చివరకు ఫలితాలు వచ్చాక అన్ని చిలకలూ టీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నాయి. పొగడ్తల్లో తమని మించినవారు లేరని రుజువు చేసుకుంటున్నాయి.

దీనికి పరాకాష్ట ఏంటంటే.. ఏకంగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కేసీఆర్, కేటీఆర్ ను పొగడ్డం. వీళ్ల ప్రెస్ మీట్ తో సినిమావాళ్ల పొగడ్తల పరంపర ఓ కొలిక్కి వచ్చింది.

Show comments