టికెట్‌ తేలింది సరే.. గెలుపు?!

జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌ రామసుబ్బారెడ్డికే అని, సిట్టింగ్‌ ఫిరాయింపుదారులు ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా పోటీచేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఇటీవలే చంద్రబాబు నాయుడు దీనిపై సుదీర్ఘ పంచాయతీ చేశాడు. టికెట్‌ విషయంలో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిల మధ్యన మొదటి నుంచి తీవ్రమైన పోటీనే ఉంది. అసలు ఆది తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా సుబ్బారెడ్డికి ఏమాత్రం ఇష్టంలేదు. చివరకు రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి చంద్రబాబు నాయుడు సర్ధిచెప్పాడు.

ఆ తర్వాత వీళ్లు ఇద్దరూ రాజీపడ్డారు. ఈ విషయాన్ని ఆదినారాయణ రెడ్డి స్వయంగా చెప్పాడు. వాటాల పంపకం విషయంలో ఒక ఒప్పందానికి వచ్చామని.. రామసుబ్బారెడ్డి తనకు వాటా ఇస్తాడని, తను రామసుబ్బారెడ్డికి వాటా ఇస్తానని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్‌ సమక్షంలో తమ మధ్య ఒప్పందాన్ని కుదిర్చాడని నిర్భీతిగా ఓపెన్‌గానే చెప్పాడు ఆదినారాయణ రెడ్డి.

ఈ విధమైన ఒప్పందం నేపథ్యంలో ఇక తను రామసుబ్బారెడ్డితో గొడవపడేది ఉండదని, వాటాలు సమంగా పంచుకుంటున్నప్పుడు ఇక గొడవపడాల్సిన అవసరం ఏముందని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించేశాడు. స్వతంత్ర భారతదేశంలో అవినీతి సొమ్ము విషయంలో వాటాల గురించి ఇంత ఓపెన్‌గా చెప్పుకున్న రాజకీయనేత మరొకరు ఉండకపోవచ్చు. స్టింగ్‌ ఆపరేషన్లు ఏమీ అసవరం లేకుండా.. మొత్తం కథను ఓపెన్‌గా చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రిగా ఉన్న ఆది నారాయణ రెడ్డికే దక్కుతుంది.

ఇక ఎమ్మెల్యే టికెట్‌ విషయంలో కూడా ఆదినారాయణ రెడ్డి వెనక్కు తగ్గినట్టే అనిచెప్పాలి. రామసుబ్బారెడ్డికే టికెట్‌ అని చంద్రబాబు నాయుడు స్పష్టంచేసిన నేపథ్యంలో.. ఆది కామ్‌గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కడప ఎంపీ టికెట్‌ అయితే ఇస్తానని చంద్రబాబు నాయుడు ఆదికి హామీ ఇచ్చాడట. అయితే కడప నుంచి ఎంపీగా పోటీచేసి సాధించేది ఏమీ ఉండదు.

అయితే కథ అప్పుడే అయిపోలేదని ఆది అంటున్నాడట. ఇంకా ఎన్నికలకు సమయం ఉందని.. ఆఖర్లో అయినా తను పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటానని ఆది విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడని సమాచారం. చివర్లో అయినా అభ్యర్థులు మారే అవకాశం ఉందని.. తనే జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని ఆదినారాయణ రెడ్డి అనుచరవర్గంతో వ్యాఖ్యానిస్తున్నాడని తెలుస్తోంది.

ఇక తనయుడికి రాజకీయ భవితవ్యం విషయంలో కూడా ఆది బాబు దగ్గర ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్‌ను తన తనయుడికి ఇవ్వాలని ఆది కోరుతున్నట్టుగా సమాచారం. ఇక ఆది, రామసుబ్బారెడ్డిల్లో ఎవరు జమ్మలమడుగు నుంచి పోటీచేసినా రెండోవాళ్లు సహకరించే అవకాశాలు ఉండవని... ఈ నియోజకవర్గంలో వీరిద్దరి రాజకీయంతో జనాలు విసిగెత్తి పోయారనేది లోకల్‌ టాక్‌.

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు

Show comments