ఈ వారం ట్రేడ్‌ టాక్‌

గత ఏడాదిలో అనూహ్యమైన విజయాన్ని అందుకున్న 'ఆర్‌ఎక్స్‌ 100' హీరో కార్తికేయ ఈ యేడాది హీరోగా ఫ్లాప్‌ హ్యాట్రిక్‌ పూర్తి చేసుకున్నాడు. కార్తికేయ నటించిన తాజా చిత్రం 90ఎంఎల్‌ డిజాస్టర్‌ అయింది. దీంతో హిప్పీ, గుణ 369తో కలిపి కార్తికేయకి ముచ్చటగా మూడు ఫ్లాపులు ఒకే ఏడాదిలో సాధించిన అపఖ్యాతి తప్పలేదు. వీటికి తోడు నాని 'గ్యాంగ్‌లీడర్‌'లో విలన్‌గా నటిస్తే అక్కడా విజయం దక్కలేదు.

కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి హీరోగా సాగిస్తోన్న దండయాత్ర ఇంకా ఆపలేదు. ఈసారి స్వీయ దర్శకత్వంలో చేసిన భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు చిత్రానికి కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా తిరిగి రాలేదు. తనకి పరిచయం వున్న కమెడియన్లందరితో రిబేటుకి సినిమా చేయించుకున్న శ్రీనివాసరెడ్డి ఇంతకాలం దాచుకున్నదాంట్లో చాలా వంతు ఈ సినిమాపైనే పోగొట్టుకున్నాడంటున్నారు.

ఇకపోతే నవంబర్‌ నెలలో సక్సెస్‌లు లేని లోటుని నెలాఖరులో విడుదలైన అర్జున్‌ సురవరం తీర్చింది. ఈ చిత్రాన్ని నిఖిల్‌ ప్రస్తుత మార్కెట్‌కి అనుగుణంగా అడ్జస్ట్‌ చేసి తక్కువ ధరలకి విడుదల చేయడం వల్ల సక్సెస్‌ కాగలిగింది. ఇటీవల నాన్‌ థియేట్రికల్‌ రెవెన్యూ అయితే పెరిగింది కానీ పలువురు హీరోల థియేట్రికల్‌ మార్కెట్‌ మాత్రం గణనీయంగా పడిపోయింది.

Show comments