ఈ వారం ట్రేడ్‌ టాక్‌

అడల్ట్‌ కంటెంట్‌ వున్న సినిమాలకి సేల్స్‌ బాగుంటాయని 'ఏడు చేపల కథ' మరోసారి నిరూపించింది. కేవలం బూతు కంటెంట్‌తో ఈ చిత్రం ఓపెనింగ్స్‌ రాబట్టుకుంది. ఆ తర్వాత ఆ స్థాయిలో నిలబడలేకపోయినా కానీ నిలకడగా వసూళ్లు సాధిస్తోంది.

గత వారం విడుదలైన శ్రీవిష్ణు చిత్రం 'తిప్పరా మీసం' హీరోగా అతని పరిమితులని తెలియజేసింది. 'బ్రోచేవారెవరురా'తో హిట్‌ సాధించిన శ్రీవిష్ణు మలి చిత్రంతో తన 'పక్కింటి అబ్బాయి' ఇమేజ్‌కి అతీతంగా ప్రయత్నించి ఫెయిలయ్యాడు.

'తిప్పరా మీసం' చిత్రానికి కనీసం ఓపెనింగ్స్‌ కూడా సరిగా రాలేదు. ఇక బాలీవుడ్‌ రైజింగ్‌ స్టార్‌ ఆయుష్మాన్‌ ఖురానా దూకుడు 'బాలా'తోను కొనసాగింది. ఈ చిత్రంతో అతను తన ఖాతాలో మరో వంద కోట్ల సినిమా ఖాయం చేసుకున్నాడు.

కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, తనని తాను హీరోలా చూసుకోకపోవడం అతనికి ప్లస్‌ పాయింట్‌ అయింది. కార్తీ ఖైదీ చిత్రం లాభాలని తెచ్చుకుంది. విజిల్‌ బ్రేక్‌ ఈవెన్‌ స్టేటస్‌ దక్కించుకుంది.

పెద్ద సినిమాల సందడి డిసెంబర్‌ చివర్లోనే వుంటుంది కనుక ఈలోగా చిన్న చిత్రాలు అదృష్టం పరీక్షించుకుంటున్నాయి.

ఈ వారం సందీప్‌ కిషన్‌ చిత్రం 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్‌' రిలీజ్‌ అయింది. దానితో పాటుగా తమిళ అనువాద చిత్రాలు యాక్షన్‌, విజయ్‌ సేతుపతి కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.

Show comments