ఆ గట్టునుంటారా.. కాపులు ఈ గట్టుకొస్తారా?

బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని నిట్టనిలువునా నమ్మించి మోసం చేసిన చంద్రబాబు ఓ వైపు, బీసీల్లో చేర్చడం ఎంతమాత్రం సాధ్యంకాదని కుండబద్దలు కొట్టి నిప్పులాంటి నిజాన్ని బయటపెట్టిన జగన్ మరోవైపు, కులం కార్డు అడ్డంపెట్టుకుని ఓట్ల కోసం ఎదురుచూస్తోన్న పవన్ ఇంకోవైపు.. 2019లో ఏపీలో కాపు ఓటు ఎవరికి పడుతుందనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.

రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మకంగా చెప్పడం, అందులోనూ తమ వర్గానికే చెందిన పవన్ కల్యాణ్ చంద్రబాబుకి మద్దతివ్వడంతో 2014లో కాపులంతా చంద్రబాబుకి జై అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. బాబు నమ్మకద్రోహం బైటపడింది, పవన్ వేరు కాపురం పెట్టేశాడు. దీంతో ఈసారి కాపుల ఓటు ఎవరికి అనేది ఆసక్తికరంగా మారింది.

వాస్తవంగా చెప్పాలంటే పవన్ కే రాష్ట్రంలోని కాపుల మద్దతు ఎక్కువగా ఉంది. అయితే జనసేనానికి తాను కేవలం ఓ వర్గానికి చెందిన నాయకుడిగా ముద్ర వేయించుకోవడం ఇష్టంలేదు. లోపల ఎలాంటి రాజకీయాలు చేసినా, పైకి మాత్రం తాను అందరివాడిని అన్నట్టు బిల్డప్ ఇస్తుంటారు పవన్. అందుకే రిజర్వేషన్ల అంశాన్ని తాను భుజాన వేసుకోలేదు.

ఇలాంటి టైమ్ లో నిజాయితీగా కాపుల అభివృద్ధి కోసం కృషిచేస్తానన్న వైఎస్ జగన్ హామీ ఒక్కటే ఆ వర్గంలో కాస్తో కూస్తో ఆశల్ని చిగురింప చేస్తోంది. రిజర్వేషన్ ఇవ్వలేకపోయినా, అంతకు మించి నిధులు కేటాయించి ఆయా వర్గాల్లోని పేదలను ఆదుకుంటానని చెప్పారు జగన్. చంద్రబాబు కాపు కార్పొరేషన్ పేరుతో చేస్తున్న మోసాన్ని జగన్ తీవ్రస్థాయిలో ఎండగట్టారు.

నామమాత్రపు నిధుల్ని విదిల్చి ఆ వర్గం ఓట్లను కొల్లగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. అయితే జగన్ మాత్రం ప్రతి ఏడాదీ 10వేల కోట్లు కార్పొరేషన్ కి కేటాయిస్తానని హామీ ఇచ్చారు. 2014లో ఎన్నికల హామీ నెరవేర్చకుండా చంద్రబాబు మోసం చేశారు, బాబుకి ఓటువేయండి తేడా వస్తే నేను ప్రశ్నిస్తానన్న పవన్ కూడా ఏమీ చేయలేకపోయారు.

ఇలాంటి పరిస్థితుల్లో పవన్ తో పాటు వెళ్లాలన్నా, అధికారంలోకి రాడని తెలిసీ ఓట్లు వృథా చేసుకోవడం కాపు వర్గంలోని కొంతమందికి ఇష్టంలేదు. అందుకే ఈసారి వారంతా జగన్ కి మద్దతివ్వబోతున్నారని తెలుస్తోంది. ముద్రగడ ఎవరికి మద్దతిచ్చినా కొంతమంది మాత్రం జగన్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. కాపుల్లో సగం మంది ఈసారి వైసీపీ వైపు నిలబడ్డారు.

జగన్ కి అవగాహన లేకే అలా మాట్లాడాడు.. ముద్రగడ సంచలన వ్యాఖ్యలు 

వివాదాలు.. వైఫల్యాలు.. వివాహాలు..!

Show comments