ఇదే సరైన సమయం.. ఎన్టీఆర్ రావాల్సిందే

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై పెను ప్రభావమే చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికల సాక్షిగా నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మరోసారి బలిపశువును చేశారంటూ విశ్లేషణలు వస్తున్నాయి. హరికృష్ణ మరణాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని చూసిన చంద్రబాబు నిజరూపాన్ని ప్రజల ముందుంచాయి తెలంగాణ ఎన్నికలు. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున నందమూరి సుహాసినిని నిలబెట్టారు బాబు.

హరికృష్ణ సెంటిమెంట్ కార్డును ఉపయోగించారు. కానీ అదే సమయంలో సుహాసినే ఎందుకు అనే ప్రశ్న చాలామందికి వచ్చింది. ఆమె స్థానంలో కల్యాణ్ రామ్ ను కూడా నిలబెట్టి ఉండొచ్చు కదా. సుహాసిని అయితే గెలిచిన తర్వాత రబ్బర్ స్టాంపులా పనికొస్తుంది. కల్యాణ్ రామ్ అయితే ఎదురుతిరిగే ప్రమాదం ఉందనేది బాబు మనసులో మాట.

ఇలా సుహాసినిని ఎన్నికల్లో నిలబెట్టి, తానేదో నందమూరి కుటుంబాన్ని ఆదుకున్నానన్నట్టు కలరింగ్ ఇచ్చారు బాబు... ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రచారానికి రాలేదంటూ వాళ్లను బద్నామ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి రాజకీయాలు బాబుకు కొత్తకాదు. గతంలో హరికృష్ణ విషయంలో కూడా ఇలానే చేశారు. పొమ్మనలేక పొగబెట్టారు. హరికృష్ణను పూర్తిగా యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరం చేశారు.

ఇక బాలయ్య సంగతి సరేసరి. బాబు ఏది చెబితే దానికి "బుల్ బుల్" అనడం మినహా బాలయ్య ఏమీ చేయలేడు. ఇలా నందమూరి కుటుంబంలో అందర్నీ డమ్మీల్ని చేశారు చంద్రబాబు. ఇలా అందర్నీ సైడ్ ట్రాక్ లో పెట్టి తనయుడు లోకేష్ ను టీడీపీలో మెయిన్ పిల్లర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి ఉన్న ఒకే ఒక్క ఆశాదీపం ఎన్టీఆర్. తారక్ మరోసారి తెరపైకి రావడానికి ఇదే మంచి సమయం. తెలుగుదేశం పార్టీలో అధికార మార్పిడి ప్రారంభం కాకముందే ఎన్టీఆర్ మేల్కోవాలి. బాబు చేతుల్లోంచి అధికారం లోకేష్ కు బదిలీ కాకముందే రంగంలోకి దిగాలి.

ప్రస్తుతం నందమూరి కుటుంబంలో చంద్రబాబును ఎదిరించేంత స్టామినా కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే ఉంది. పార్టీలో నందమూరి హవాను మళ్లీ తీసుకురావాలన్నా, కుటుంబం మళ్లీ పార్టీకి పెద్దదిక్కుగా మారాలనే హరికృష్ణ చిరకాల కోరిక నెరవేరాలన్నా అది ఇప్పుడు ఎన్టీఆర్ చేతుల్లో మాత్రమే ఉంది.

పూర్తిగా బాబు ఆధీనంలోకి వెళ్లిపోయిన బాలయ్య వల్ల ఆ కుటుంబానికి ఇప్పుడేం ఒరగదు. నందమూరి కుటుంబానికి ఓ విలువ రావాలన్నా, గౌరవం పెరగాలన్నా అది ఒక్క ఎన్టీఆర్ తో మాత్రమే సాధ్యం. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న ఎన్టీఆర్ ఈ దిశగా ఆలోచిస్తున్నాడా లేదా?

Show comments