వీళ్ల‌ది త్యాగ‌మా..?

భార‌త దేశం ప్ర‌తి రోజూ నిర్మించ‌బ‌డుతోంది. ఈ నిర్మాణంలో ఎంతో మంది పాలుపంచుకుంటున్నారు. ఎక్క‌డికో నీరందించేందుకు ఏర్పాటు చేసే ఒక సాగునీటి ప్రాజెక్టు కోసం త‌మ‌ ప్రాణం క‌న్నా ఎక్కువ‌గా భావించిన భూముల‌ను త్యాగం చేస్తారు మ‌రెక్క‌డో ఉండే రైతులు. మ‌రేదో అభివృద్ధి ప్రాజెక్టు అని, ఇండ‌స్ట్రీ అంటూ మొద‌లుపెట్టి, ఫార్ములా వ‌న్ రేసుల కోస‌మ‌ని కూడా ఈ దేశంలో రైతులు అనునిత్యం భూముల‌ను త్యాగం చేస్తూనే ఉన్నారు. అలాంటి రైతుల సంఖ్య దేశంలో ల‌క్ష‌ల్లో, కోట్ల‌లో ఉంటుంది.

మ‌రి వారికి ప్ర‌భుత్వాలు ఏమిస్తున్నాయి? ప‌్రైవేట్ కంపెనీల కోసం చేప‌ట్టే ఆ భూసేక‌ర‌ణ‌లో రైతుల‌కు అక్క‌డ స్థానికంగా ఎక‌రా భూమికి ఉన్న విలువ ను బ‌ట్టి చెల్లింపులు చేస్తున్నారు. ఇంటికో రేటు, చెట్టుకో రేటు, పుట్ట‌కో రేటు క‌ట్టి ఇస్తున్నారు. ఇచ్చిన దాన్ని తీసుకుని.. రైతులు దేశ నిర్మాణం కోసం అంటూ త‌మ భూముల‌ను త్యాగం చేస్తూ ఉన్నారు. అదీ త్యాగం. ఉన్నదంతా ఇచ్చి మ‌రో చోటుకు వెళ్లి ఇళ‌లు కట్టుకునే రైతులు ప‌రిహారం పొందే వారిది త్యాగం అంటే అదో ముచ్చ‌ట‌. ఎందుకంటే మ‌రెక్క‌డి ప్ర‌యోజ‌నాల కోస‌మో వారు త‌మ ఊరిని, ఇంటిని త్యాగం చేశారు.

మ‌రి ఇలాంటి త్యాగాలు జ‌రుగుతున్న దేశంలో.. త‌మ ప్రాంతం మాత్ర‌మే బాగుండాలి, త‌మ భూములు మాత్ర‌మే విలువ పెర‌గాలి, రాజ‌ధాని త‌మ ప్రాంతంలో మాత్ర‌మే ఉండాలి, రియ‌లెస్టేట్ వ్యాపార‌మంతా తమ ఊర్ల‌లోనే సాగాలి... అనే వాళ్ల‌ను ఏమ‌నాలి? రైతులు ముసుగేసుకున్న రియ‌లెస్టేట్ వ్యాపారులు అంటే.. స‌రిపోతుందా? ఇంకేమైనా అనాలా?

ఇంత‌కీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏం చెబుతోంది?

అమ‌రావ‌తిని రాజ‌ధాని హోదా నుంచి త‌ప్పించ‌డం లేదు, అమ‌రావ‌తి రాజ‌ధానిగా కొన‌సాగుతుంది. పాల‌నాప‌ర‌మైన రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉంటుంది. రాజ‌ధాని కోసం జ‌రిగిన భూసేక‌ర‌ణ‌లో రైతుల‌కు ఏయే హామీల‌ను గ‌త‌ప్ర‌భుత్వం ఇస్తుందో ఆ హామీల‌ను ఈ ప్ర‌భుత్వం కూడా నెర‌వేరుస్తుంది. వాళ్ల‌కు గ‌తంలో కేటాయించిన ప్లాట్ల కేటాయింపు జ‌రుగుతుంది, వాళ్ల‌కు య‌థావిధిగా కౌలు చెల్లింపులూ సాగుతున్నాయి.

చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం ఏ హామీల‌ను అయితే ఇచ్చి అమరావ‌తిలో భూ సేక‌ర‌ణ చేప‌ట్టిందో, ఆ హామీల‌న్నింటికీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. అయితే ఒకే ఒక్క మార్పు.. హై కోర్టు త‌ర‌లింపు, స‌చివాల‌యం త‌ర‌లింపు. క‌ర్నూలు, విశాఖ‌ల‌కు రాజ‌ధానుల హోదా.  దీని వ‌ల్ల అమ‌రావ‌తికి పైకి క‌నిపించే న‌ష్టం ఏమీ లేదు!

రైతులా.. రియ‌లెస్టేట్ వ్యాపారులా?

సామాన్యంగా రైతు అనేవాడు త‌న భూమిలో వ్య‌వ‌సాయం చేసుకోవాల‌నుకుంటాడు. అలా చేసే వాడినే రైతు అనాలి. చుట్టూ అభివృద్ధి అయిపోవాలి.. ఫ్యాక్ట‌రీలు రావాలి, ప‌రిశ్ర‌మ‌లు రావాలి, భూమి ధ‌ర పెర‌గాలి.. అనుకునేవాడు రైతు కాదు. కేవ‌లం రియ‌లెస్టేట్ వ్యాపారి. అమ‌రావ‌తి ప్రాంతంలో రైతులుగా చ‌లామ‌ణి అవుతున్న వారి గొంతెమ్మ‌కోరిక‌ల‌ను చూస్తే.. వాళ్లు రైతులు కాదు, రియ‌లెస్టేట్ వ్యాపారులు అని స్ప‌ష్టం అవుతోంది, కాస్త రైతులు ఎవ‌రైనా ఉన్నా.. వారిని రెచ్చ‌గొట్టి, వారికి ఆశ‌ల‌ను క‌ల్పించి ఈ ర‌చ్చ‌లోకి దించుతున్నారు రాజ‌ధాని ఆవ‌ల భూములున్న రియ‌లెస్టేట్ వ్యాపారులు! ఈ విష‌యాన్ని అక్క‌డి వారే చెబుతున్నారు.

అమ‌రావ‌తిలో ఇప్పుడు నిర‌స‌న‌లు తెలుపుతోంది ఎవ‌రు? అంటే.. త‌మ భూమి విలువ కోట్ల రూపాయ‌ల్లోకి చేరుతుంద‌ని అనుకుని, ఇప్పుడు రియ‌లెస్టేట్ భూమ్ ప‌డిపోతుందని త‌మ భూముల విలువ మ‌ళ్లీ ల‌క్ష‌ల్లోకి వ‌చ్చేస్తోంద‌ని భావిస్తున్న వాళ్లు మాత్ర‌మే ఇప్పుడు తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ని అక్క‌డి వారే మీడియాతో ఓపెన్ గా వ్యాఖ్యానిస్తున్నారు! రైతులు అనే ప‌దాన్ని వాడుకుంటూ...ఆ ప‌దం ద్వారా ద‌క్కే సానుభూతిని క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్న‌మే త‌ప్ప‌.. అక్క‌డ జ‌రుగుతున్న దానికీ వ్య‌వ‌సాయానికీ సంబంధం లేద‌ని అక్క‌డి వారే కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు!

రాజ‌ధాని గీత అవ‌త‌ల వారిదే స్పాన్స‌ర్ షిప్!

అమ‌రావ‌తికి అంటూ ఇచ్చిన భూముల‌ను కాసేపు ప‌క్క‌న పెడితే, అమ‌రావ‌తి చుట్టూ వంద‌ల‌, వేల ఎక‌రాల భూమి అప్ప‌టికే తెలుగుదేశం పార్టీకి అనుకూల‌మైన కులం చేతికి వెళ్లిపోయింది! ముంద‌స్తు లీకుల‌తో వేల ఎక‌రాల భూమిని ఆ కులం సొంతం చేసుకుంది. ప‌ప్పు బెల్లాలు పెట్టి.. ఆ కుల‌స్తులు అమ‌రావ‌తి నుంచి క‌నుచూపు మేరంతా భూస్వాములుగా ఎదిగారు. ఇదంతా చంద్ర‌బాబు నాయుడి మార్కు స్కెచ్.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్రంలో ఒకటే కులం ఒక ప్రాంతం అంతా భూములు కొన‌డం ఎలా సాధ్యం అయ్యింది? అమ‌రావ‌తి పేరుతో పెంచిన రియ‌లెస్టేట్ బూమ్ లో పావ‌లా పెట్టుబ‌డి పెట్టి.. ప‌దిరూపాయ‌ల స్థాయి లాభం ద‌శ‌కు వ‌చ్చింది ఈ కుల‌ద‌ళం. శ్రీలంక‌లో ఎల్టీటీఈ వాళ్లు పాతుకుపోయినట్టుగా.. అమ‌రావ‌తి చుట్టూ ఒక కులం త‌న పంజా విసిరింది. ఆ వ‌ర్గ‌మే ప్ర‌స్తుతం ప‌రిణామాల‌ను అస్స‌లు స‌హించ‌లేక‌పోతోంది.

తాము క‌ట్టుకున్న రియ‌లెస్టేట్ క‌ళ‌ల సౌధం క‌ళ్ల ముందే కూలిపోతుంటే.. ఊహ‌ల్లో పెరిగిపోయిన త‌మ భూముల విలువ ఊహించ‌ని ప‌రిణామాల‌ను ఎదుర్కొంటుంటే స‌హించ‌లేక‌పోతున్నారు. రాజ‌ధాని బ‌య‌ట వీళ్లకు జ‌రుగుతున్న న‌ష్టానికి నిర‌స‌న తెల‌ప‌లేక‌, రాజ‌ధాని ప‌రిధి గీత‌లో తాముంచిన వారి చేత వీళ్లు ధ‌ర్నాలు చేయిస్తున్నారు, అందుకు స్పాన్స‌ర్ షిప్ అంతా వీళ్ల‌దే అనేది అమ‌రావ‌తి ప్రాంతం నుంచి అందుతున్న గ్రౌండ్ రిపోర్ట్. ఈ స్పాన్స‌ర్ షిప్ ను స్వ‌యంగా చంద్ర‌బాబు నాయుడి కుటుంబ‌మే మొద‌లుపెట్టింది! ప్లాటినం గాజు ద్వారా మొద‌లైన ఆ స్పాన్స‌ర్ షిప్ ఇప్పుడు ఆఖ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. చివ‌రాఖ‌రి ప్ర‌య‌త్నాల్లో ఉంది.

చంద్ర‌బాబు చూపించిన రియ‌లెస్టేట్ సినిమా ఇది!

అస‌లు రాజ‌ధానిగా అమ‌రావ‌తి ప్రాంత ఎంపిక ఏ ప్రాతిప‌దిక‌న సాగిందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏపీని విభ‌జించిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని కోసం కేంద్ర ప్ర‌భుత్వం శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఏపీకి రాజ‌ధానిగా ఉండ‌ద‌గిన ప్రాంతాన్ని ఆ క‌మిటీ ఎంపిక చేసింది. ప్ర‌కాశం జిల్లా ప్రాంతంలో రాజ‌ధానిని ఏర్పాటు చేస్తే అంద‌రికీ మంచిద‌ని ఆ క‌మిటీ నివేదించింది. అయితే ఇప్పుడు రాజ‌ధాని అంశంలో కేంద్రం జోక్యం కోరుతున్న చంద్ర‌బాబు నాయుడు ఆ క‌మిటీ నివేదిక‌ను బుట్ట‌దాఖ‌లు చేశారు.

ప్ర‌కాశం జిల్లా ప్రాంతంలో ఉన్న ప్ర‌భుత్వ భూముల్లో రాజ‌ధానిని ఏర్పాటు చేస్తే.. వేరే సామాజిక‌వ‌ర్గం ఒక‌టి ఆ చుట్టుప‌క్క‌ల ఉండి బ‌ల‌ప‌డుతుంద‌ని, అది త‌న రాజ‌కీయానికి మంచిది కాద‌ని, కేవ‌లం త‌న కుల‌స్తులు గ‌ట్టిగా ఉండే ప్రాంతంలో రాజ‌ధాని పెడితే.. అది రాజ‌కీయంగా త‌న‌కు అనేక అవ‌కాశాల‌ను ఇస్తుంద‌నే లెక్క‌ల‌తో గుంటూరు-విజ‌య‌వాడ ప్రాంతానికి రాజ‌ధానిని తీసుకొచ్చారు అనేది రాజ‌కీయ విశ్లేష‌కులు స్ప‌ష్టంగా విశ్లేషించే అంశం. చంద్ర‌బాబు నాయుడి తీరు, ఆయ‌న కుల రాజ‌కీయాన్ని గ‌మ‌నించిన వారు ఎవ‌రూ దీన్ని ఖండించ‌లేరు, కేవ‌లం ప‌చ్చ చొక్కాలు త‌ప్ప‌!

రాజ‌ధాని- అమ‌రావ‌తి ప్రాంతం అంటూ ముందుగానే లీకులు ఇచ్చుకున్నారు. అప్ప‌టికే ఆ ప్రాంతంలో ఎక్క‌డెక్క‌డి తెలుగుదేశం నేత‌లు వాలిపోయారు! లేక‌పోతే.. ఎక్క‌డో అనంత‌పురం జిల్లాకు చెందిన ప‌రిటాల కుటుంబం తుళ్లూరులో ఎలా భూములు కొంటుంది? నెల్లూరుకు చెందిన నాటి మంత్రి నారాయ‌ణ త‌న బినామీల పేర్ల‌తో అమ‌రావ‌తి ఏరియాలో ఎలా భూములు కొంటారు? అదంతా పెద్ద స్కామ్.

ముందుస్తుగా కొంత‌మందికి రాజ‌ధాని అంశం గురించి లీకులు ఇవ్వ‌డం, వాళ్లు అక్క‌డ వాలిపోయి త‌క్కువ ధ‌ర‌కు భూములు కొన‌డం, క‌రెక్టుగా రాజ‌ధాని ప‌రిధి ముగిసిన ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ నేత‌లు భూములు కొన‌డం.. ఇవ‌న్నీ  స్కాములే! లింగ‌మనేని భూ సామ్రాజ్యం ప్రారంభం అయ్యే చోట‌కు రాజ‌ధాని స‌రిహ‌ద్దు రేఖ‌ ముగుస్తుంది!  త‌ద్వారా రాజ‌ధాని బ‌య‌టఅంతా వీళ్ల భూముల దందా ఉంటుంది. రాజ‌ధాని ప్లాన్లో భూములు భాగం అయితే ప్ర‌భుత్వం ఇచ్చే ప‌దీ, పాతికే.. అదే రాజ‌ధాని ప్లాన్ బ‌య‌ట భూములుంటే.. ఆ భూముల విలువ కోట్ల రూపాయ‌లు. ఇలా ప‌క్కా స్కెచ్చులు గీసుకుని రాజ‌ధాని భూ సేక‌ర‌ణ‌, ప్లానింగ్ జ‌రిగిందనేది బ‌హిరంగ ర‌హ‌స్యం!

అమ‌రావ‌తి అవినీతి కేరాఫ్!

అమ‌రావ‌తి ఆవిర్భావం కింద‌టే అలా అవినీతి పునాదులున్నాయి. చ‌ట్ట‌బ‌ద్ధంగా వాటిల్లో ఎన్ని నిరూప‌ణ అవుతాయ‌నేది చెప్ప‌లేని అంశం. చ‌ట్టానికి కూడా దొర‌క్కుండా ఇలాంటి వ్య‌వ‌హారాల‌ను సాగించ‌డంలో చంద్ర‌బాబు నాయుడుకు మించిన ప్ర‌తిభావంతుడు మ‌రొక‌రు ఉండ‌రు. ఇప్పుడు అమ‌రావ‌తిని రైతులు పోరాటంగా చిత్రీక‌రించ‌డం కూడా చంద్ర‌బాబు నాయుడుకు స‌హ‌జంగా అబ్బిన విద్యే! ఆఖ‌రికి చంద్ర‌బాబు నాయుడు పూర్తిగా బ‌య‌ట‌ప‌డిపోయారు.

అమ‌రావ‌తిని మాత్రం కొన‌సాగించాల‌ని, అందుకు ప్ర‌తిగా త‌న పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారంటూ చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌కు అర్థం ఏమిటి? అది చంద్ర‌బాబుకే తెలియాలి. అయితే బ‌య‌ట వాళ్ల‌కు అర్థం అవుతోంది ఏమిటంటే.. అమ‌రావ‌తిని అలాగే ఉంచితే చంద్ర‌బాబు నాయుడు తెలుగుదేశం పార్టీని కూడా విలీనం చేసేలా ఉన్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకించ‌డం వ‌ల్ల చంద్ర‌బాబుపై అటు ఉత్త‌రాంధ్ర‌లోనూ, ఇటు రాయ‌ల‌సీమ‌లోనూ వ్య‌తిరేక‌త పెరుగుతూ ఉంది. అయినా ఆయ‌న అమ‌రావ‌తే కావాల‌ని ఓపెన్ గా చెబుతున్నారు. త‌ద్వారా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ముగించుకుని, ఒక రియ‌లెస్టేట్ డీల‌ర్ గా సెటిల్ కావాల‌నే ఆలోచ‌న‌తో చంద్ర‌బాబు ఉన్నాడేమో అని ఎవ‌రైనా అనుకుంటే అది వాళ్త త‌ప్పు కాదు. చంద్ర‌బాబు నాయుడే ఆ అభిప్రాయాల‌ను క‌లిగిస్తూ ఉన్నారు!

అదో అవినీతి పుట్ట‌!

రాజ‌ధానిగా అమ‌రావ‌తి ప్రాంతం లీకులు అందుకుని.. భారీ ఎత్తున అక్క‌డ ప‌చ్చ‌వ‌ర్గాలు, ఒక కులం వారు భూములు కొనుగోలు చేశారు. వారిలో కొంద‌రు తెలివిగా రాజ‌ధాని ప‌రిధిలోని అసైన్డ్ ల్యాండ్ లు కొనుగోలు చేశారు. ఆ అసైన్డ్ ల్యాండ్స్ క‌లిగిన వారిని భ‌య‌పెట్ట‌డానికి వాళ్లు కొన్ని ప్ర‌చారాల‌కు తెర‌తీశారు. అసైన్డ్ ల్యాండ్స్ ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంటుంద‌ని, వాటిని సాగు చేసుకునే వారికి హ‌క్కులుండ‌వ‌ని, అలాంటి వారు భూ సేక‌ర‌ణ‌కు ముందే త‌మ‌కు అమ్మాల‌ని మాయ మాట‌లు చెప్పారు. అలా ప‌దికి, పాతిక‌కు ఆ భూములు కొని  ప్ర‌భుత్వానికి భూసేక‌ర‌ణ‌లో ఇచ్చారు. ఇచ్చే‌సి త‌మ పేరిట ప్లాట్లు, కౌలు వ‌చ్చే ఏర్పాటు చేసుకున్నారు.

ఈ వ్య‌వ‌హారానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాకా చెక్ పెట్టారు. అమ‌రావ‌తి ప్ర‌క‌ట‌న‌కు కొంత ముందు కొన్న అసైన్డ్ భూ లావాదేవీల‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించింది. అలాంటి భూములు కొన్న వారికి ప్లాట్ల కేటాయింపు ఉండ‌ద‌ని ప్ర‌భుత్వం జీవో ఇచ్చింది. అప్పుడే ప‌చ్చ‌ముఠా గొంతులో ప‌చ్చివెల‌గ‌కాయ‌ప‌డింది. మ‌రోవైపు  ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ వ్య‌వ‌హారాలు ఉండ‌నే ఉన్నాయి. బోలెడంత మంది తెలుగుదేశం నేత‌లు త‌మ బినామీల పేర్ల‌తో కొన్న భూ దందా స‌రేస‌రి! ఇలా ఎలా చూసినా.. అమ‌రావ‌తి తెలుగుదేశం పార్టీ హ‌యాంలో జ‌రిగిన అది పెద్ద స్కామ్. ఇప్పుడే అల్లాడిపోతున్న టీడీపీ ఈ పుట్టంతా ప‌గిలితే ఏమ‌వుతుందో!

చంద్ర‌బాబుతో చేసిన ఒప్పందాలే అమ‌రావ‌తికి శాప‌మా?

అమ‌రావ‌తికి ల్యాండ్ పూలింగ్ అంటూ చంద్ర‌బాబు నాయుడు సీఆర్డీఏను ఏర్ప‌రిచారు. ఆ సీఆర్డీఏతో రైతులు ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాల ప్ర‌కారం.. ఆ భూములపై రైతులు హ‌క్కులు అప్పుడే కోల్పోయార‌ట‌! ఆ భూములు ఎవ‌రికివ్వాలి అనేది సీఆర్డీఏ ఇష్టం. రైతుల చేత ఆ ర‌కంగా సంత‌కాలు చేయించింద‌ట చంద్ర‌బాబు నాయుడి ప్ర‌భుత్వం.

ఇచ్చిన భూముల‌కు కౌలు, ప్ర‌తిగా అభివృద్ధి ప‌రిచిన కౌలు.. వీటిని మాత్ర‌మే రైతులు అడ‌గ‌గ‌ల‌ర‌ట‌. ఈ ర‌కంగా చంద్ర‌బాబు నాయుడు వారి చేత సంత‌కాలు చేయించుకున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో చేసిన ఒప్పందాలే ఇంకా పోరాడాల‌నుకునే వారికి ముంద‌రి కాళ్ల బంధాలుగా మార‌నున్నాయ‌ని.. ఏతావాతా చంద్ర‌బాబు నాయుడే వారికి ఇలా కూడా ప్ర‌తిబంధ‌కాలు ఏర్ప‌రిచాడ‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

త్యాగం కాదు.. దురాశ!

ఇప్ప‌టికీ అమ‌రావ‌తి ప్రాంతంలో చంద్ర‌బాబు నాయుడును న‌మ్మి భూములు ఇచ్చిన రైతుల‌కు ఎలాంటి న‌ష్టం లేదు. వాళ్ల‌లో చాలా మంది మొద‌ట్లో భూములు ఇవ్వ‌మంటూ భీష్మించుకున్నారు. అలాంటి వారికి ఇప్పుడు త‌మ భూముల‌ను త‌మే భ‌ద్రంగా తీసుకోవ‌చ్చు. అయితే వారిని అమ‌రావ‌తి గీత‌కు బ‌య‌ట భూములు కొన్న వారు రెచ్చ‌గొడుతున్నారు. ఇప్పుడు రాజ‌ధాని త‌ర‌లిపోతోంద‌ని.. వాళ్ల భూముల‌కు విలువ ప‌డిపోతుంద‌ని ప్ర‌చారం చేస్తూ ఉన్నారు. అయితే రాజ‌ధాని త‌ర‌లిపోతోంది అనేది కేవ‌లం టీడీపీ మార్కు ప్ర‌చారం.

సాంకేతికంగా ఆ వాద‌న నిల‌వ‌దు. కోర్టుకు వెళ్లినా జ‌గ‌న్ ప్ర‌భుత్వం అదే చెబుతుంది. అమ‌రావ‌తిని ఎక్క‌డ‌కూ తీసుకెళ్ల‌డం లేద‌ని.. అమ‌రావ‌తి అమ‌రావ‌తే అని, రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ మాత్ర‌మే జరుగుతోంద‌ని ప్ర‌భుత్వం వాదించే అవ‌కాశాలున్నాయి. ఇప్ప‌టికే ఈ అంశంలో జోక్యం చేసుకోబోవ‌డం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఇలాంటి నేప‌థ్యంలో ఇక కోర్టు ఏం చేస్తుంది? అమ‌రావ‌తి రియలెస్టేట్ వ్యాపారుల పొర్లు దండాల‌కు కోర్టు మ‌న‌సు కరుగుతుందా? లేక వికేంద్రీక‌ర‌ణ‌కు ప‌చ్చ‌జెండా ఊపుతుందా? అనేది ఇంకా శేష‌ప్ర‌శ్న‌.

అమ‌రావ‌తి పేరుతో జ‌రుగుతున్న ఉద్య‌మం అంతా ఆస్తుల ర‌క్ష‌ణ కోసం, హ‌ఠాత్తుగా పెరిగిన రేట్ల కోసం మాత్ర‌మే అని స్ప‌ష్టం అవుతోంది. ఏదైనా ప్ర‌భుత్వ ప్రాజెక్టుతోనో, ప్రైవేట్ ప్రాజెక్టుతోనో భూములు, ఉపాధి కోల్పోయే వారి పై జాలి చూప‌వ‌చ్చు. వారి పోరాటాల‌కు అంతా మ‌ద్ద‌తు ప‌ల‌క‌వ‌చ్చు. అయితే అమ‌రావ‌తి పోరాటంలో మాత్రం ఆ గ్రామాల అవ‌త‌ల ఎక్క‌డా అల‌జడి లేదు.

అమ‌రావ‌తి కి వ‌చ్చిన ఇబ్బందేం లేద‌ని మిగ‌తా ప్రాంతాల ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన అభిప్రాయాల‌తో ఉన్నారు. చంద్ర‌బాబు నాయుడి చెంచాలు కొంద‌రు, అమ‌రావ‌తి ప్రాంతంలో భూమ‌లు కొన్న రాయ‌ల‌సీమ టీడీపీ నేత‌లు మ‌రి కొంద‌రు అక్క‌డ కరిగిపోయే త‌మ ఆస్తుల విలువ‌ను త‌లుచుకుని అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా మాట్లాడుతూ ఉన్నారు. వారి మాట‌ల‌ను వారి నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప్ర‌జ‌లు ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.

అమ‌రావ‌తి ఉద్య‌మంలో ఎక్క‌డా క‌సి క‌నిపించ‌దు, కేవలం ఉసిగొల్పిన ఉద్య‌మంలా అది నేడో, రేపో పూర్తిగా నీరుగారిపోవ‌డ‌మే ఉంటుంది. ఇప్పుడు కూడా అమ‌రావ‌తి ఉద్య‌మం మిగిలింది చంద్ర‌బాబు మాట‌ల్లో, ప‌చ్చ పేప‌ర్ల రాత‌ల్లో మాత్ర‌మే!

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం

Show comments