ఈ విజ్ఞప్తితో జగన్‌కు పరువు నష్టమే!

జగన్మోహన రెడ్డి ఢిల్లీ యాత్ర పూర్తయింది. ఆయన మంగళవారం హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సోమవారం కలవకపోయినందుకు అనేక మంది రకరకాల పుకార్లు కూడా పుట్టించారు. కానీ.. పుట్టినరోజు సందడిలో బిజీగా ఉన్న అమిత్‌షాను మంగళవారం కలిసి.. సుదీర్ఘంగా జగన్ తన విజ్ఞాపనలను నివేదించారు. అయితే ఆయన ఏ విషయం ప్రధానంగా ప్రస్తావించారనేదే ఇప్పుడు చర్చనీయాంశం.

ప్రత్యేక హోదా అనే అంశం ఎటొచ్చీ ప్రతిసారీ ప్రస్తావిస్తూనే ఉంటారని అర్థం చేసుకోవచ్చు. సాక్షి దినపత్రికలో బ్యానర్ చేసిన అంశాన్ని బట్టి.. కృష్ణాలోకి గోదావరి జలాలను అనుసంధానించే ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని జగన్ ప్రధానంగా కోరినట్లుగా తెలుస్తోంది. మంచిదే. ఇదివరకు ఢిల్లీ పర్యటనల్లో కూడా ఆయన ఈ విషయాన్ని కేంద్రంతో ప్రస్తావించారు. అయితే ఇక్కడ ప్రజలకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. రెండు రాష్ట్రాలకు మేలు చేసే ఒక బృహత్ ప్రాజెక్టు గురించి.. ఒక రాష్ట్రం సీఎం మాత్రమే కేంద్రాన్ని ఎందుకు అభ్యర్థించాలి? అనేది!!

గోదావరి జలాలను కాలువల ద్వారా శ్రీశైలం వద్దకు తీసుకురావాలనేది కేసీఆర్ ఆలోచన. అలా తీసుకువచ్చినట్లయితే గనుక.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు కృష్ణ నీటిని విడుదలచేసే అవసరం ఉండదు. అంటే.. నిలవ ఉండే కృష్ణ నీటిని పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు పంపుకోవచ్చునని ఆయన ఊరించారు. ఈ ప్రాజెక్టు మంచిచెడుల సంగతి తరువాత... అయితే, ఇలాంటి ప్రాజెక్టు వల్ల... గరిష్టంగా తెలంగాణ లాభపడుతుంది.

తెలంగాణ లాభపడకూడదు అనేది మన ఉద్దేశం కాదు. గోదావరి నుంచి మిగులు జలాలు వృథాగా సముద్రం పాలయ్యే బదులు మన రాష్ట్రాలే వాడుకోవడం మంచిది. కేసీఆర్ ఆలోచనను సమర్థించాల్సిందే. అయితే.. ఈ ప్రాజెక్టు విషయమై ఒక్క జగన్ మాత్రమే కేంద్రాన్ని ఎందుకు అడగాలి? ఇప్పటికే కేసీఆర్ కనుసన్నల్లో జగన్ నడుచుకుంటున్నారనే పుకార్లను వ్యాప్తి చేయడంలో ఆయన ప్రత్యర్థులు సఫలం అయ్యారు.

ఇప్పుడిలా.. గరిష్టంగా పొరుగురాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టు గురించి.. తానొక్కడే వెళ్లి అభ్యర్థించడం వాటిని బలపరుస్తుంది. వీరికి చిత్తశుద్ధి ఉంటే.. జగన్, కేసీఆర్ ను కూడా వెంటపెట్టుకుని.. ఉమ్మడిగా ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్లి.. కేంద్రాన్ని అడగాలి.. ఒత్తిడి చేయాలి! లేకపోతే.. జగన్‌ పరువుకే నష్టం వాటిల్లుతుంది. జగన్ ఎందుకింత అనాలోచితంగా వ్యవహరిస్తున్నారనేది అంతుబట్టని సంగతి.

Show comments