కేసీఆర్‌ కొత్త వ్యూహం?

కాంగ్రెసు నేతృత్వంలోని మహాకూటమికి వ్యతిరేకంగా కేసీఆర్‌ కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నారా? టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మహాకూటమి బలపడేందుకు  ఫ్రంట్‌ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం. సామాజిక, కుల సంఘాలు, వెనకబడిన కులాలు, షెడ్యూల్డు కులాలు, గిరిజనులు, మైనారిటీలు... ఇలా ఈ వర్గాలకు కలుపుకొని కూటమి ఏర్పాటు చేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇప్పుడు ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? కేసీఆర్‌ చేయించిన సర్వేల్లో టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓటు మహాకూటమితో సంఘటితమవుతున్నట్లు తేలిందట. ఈ ఓట్లను చీల్చిచేందుకు మరో కూటమి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కేటీఆర్‌కు, హరీష్‌రావుకు ఈ పని అప్పగించారు. వీరు బీసీ సంక్షేమ సంఘంనేత ఆర్‌.కృష్ణయ్య, మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి నేత మందకృష్ణ మాదిగ, బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ నేత, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, గద్దర్‌తో చర్చలు జరుపుతారు.

కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా గద్దర్‌ను ప్రకటిస్తారు. టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చే అవకాశం లేదు. ప్రస్తుతానికి టీఆర్‌ఎస్‌-మహాకూటమి మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఇది చాలా ప్రమాదకరమని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకే మరో కూటమిని రంగంలోకి దించితే టీఆర్‌ఎస్‌కు ఢోకా ఉండదని అనుకుంటున్నారు. తాను అనుకున్నట్లు ఈ కూటమి ఏర్పడి దీని తరపున గెలిచే అభ్యర్థులకు మంత్రివర్గంలో పదవులు, నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చే ఆలోచన ఉందట.

కేసీఆర్‌ చేస్తున్న కూటమి ఆలోచనను మంద కృష్ణమాదిగ వ్యతిరేకించినట్లు సమాచారం. సీపీఎం టీఆర్‌ఎస్‌కు బద్ధ వ్యతిరేకి. అలాగే ఆర్‌.కృష్ణయ్య కూడా. బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ అభ్యర్థులను ఈమధ్యనే తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చని వినబడుతోంది. విచిత్రమేమిటంటే... ప్రతిపక్షాలను చావుదెబ్బ తీయడానికే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు తెరలేపారు. టీఆర్‌ఎస్‌ బలంగా ఉందని రాజకీయ పరిశీలకులు, మీడియా నిపుణలు అంటున్నారు. 80కి పైగా సీట్లు వస్తాయంటున్నారు.

అలాంటప్పుడు మహాకూటమిని చూసి భయపడటమెందుకు? టీఆర్‌ఎస్‌కు తీవ్ర వ్యతిరేకత ఉందని కేసీఆర్‌ ఎందుకు భావిస్తున్నారు? మహాకూటమి ఇంకా అనిశ్చితంగానే ఉంది. సీట్ల పంపిణీ ఓ కొలిక్కి తేకుండా కొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహాకూటమిని ఓడించడానికి మరో కూటమిని సృష్టించాల్సిన అవసరం ఉంటుందా?  టీఆర్‌ఎస్‌ ఈ ఏడాది జూన్‌లో చేయించిన ఓ సర్వే దానికి, ప్రభుత్వానికి తీవ్రమైన షాక్‌ ఇచ్చింది.

ఇందుకు కారణం అన్నివర్గాల ప్రజల్లో సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడైందట. విద్యార్థుల్లో, యువతలో 80శాతం, ఉద్యోగుల్లో 40, రైతాంగంలో 35, కొన్ని కులాల్లో  80శాతం వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. పాత పదిజిల్లాల్లో ఐదింటిలో ఎక్కువ వ్యతిరేకత ఉంది. కాని క్రమంగా వ్యతిరేకత తగ్గినట్లు మీడియాలో కథనాలొచ్చాయి.  కేసీఆర్‌ మరో ఫ్రంట్‌ ఏర్పాటు చేయిస్తారనేది నిజం కాకపోవచ్చనిపిస్తోంది.

Show comments