సినిమా రివ్యూ: తిప్పరా మీసం

సమీక్ష: తిప్పరా మీసం

రేటింగ్‌: 2/5

బ్యానర్‌: రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

తారాగణం: శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి, రోహిణి, బెనర్జీ, నవీన్‌, రవి వర్మ, రామారావు తదితరులు

సంగీతం: సురేష్‌ బొబ్బిలి

కూర్పు: ధర్మేంద్ర కాకరాల

ఛాయాగ్రహణం: సిడ్‌

నిర్మాత: రిజ్వాన్‌

రచన, దర్శకత్వం: కృష్ణ విజయ్‌

విడుదల తేదీ: నవంబర్‌ 8, 2019

ఇటీవల 'ట్రెయిలర్‌ సినిమాలు' ఎక్కువయ్యాయి. ప్రేక్షకుల దృష్టిని సినిమా వైపుకి తిప్పేలా చేసే ట్రెయిలర్లని కట్‌ చేయడానికి తగ్గ కాంటెంట్‌ రెడీ చేసుకుని, మిగతా సినిమాని ఒట్టి గాలితో నింపేస్తున్నారు. తిప్పరా మీసం కూడా అలాంటి ఓ ట్రెయిలర్‌ సినిమానే. ట్రెయిలర్‌ చూస్తే... శ్రీవిష్ణు మనకి ఇంతవరకు కనిపించనంత కొత్తగా, చాలా దుందుడుకు స్వభావంతో, అర్జున్‌ రెడ్డి సిబ్లింగ్‌లా అనిపిస్తాడు. 'తిప్పరా మీసం' ప్రధానోద్దేశం, ప్రథమ లక్ష్యం అయితే ఖచ్చితంగా అదే... అర్జున్‌ రెడ్డిని తలపించాలని, అర్జున్‌ రెడ్డి అనిపించుకోవాలని, అర్జున్‌రెడ్డిని మరపించాలని! హీరో తాలూకు వివిధ గెటప్స్‌కి తోడు, మందు-మగువ-మాదకద్రవ్యాలు తదితర దురలవాట్లతో పాటు అతని దూకుడు లక్షణాలు, అయిన వారి పట్ల అతను ప్రవర్తించే తీరు... అన్నీ ఇంకో అర్జున్‌రెడ్డిని తయారు చేయాలనే తపనలోంచి పుట్టుకొచ్చినవే. శ్రీవిష్ణు ఈ పాత్ర విని ఎక్సయిట్‌ అవడంలో వింత లేదు. ఏ నటుడికి అయినా ఇలాంటి పాత్రలో నవరసాలు పోషించే అవకాశం వుంటుందనే భావన కలగకపోదు.

అర్జున్‌ రెడ్డి అలా ఎందుకయ్యాడనే దానికి ప్రేమించిన అమ్మాయి దూరమయిందనే రిలేటబుల్‌ రీజన్‌ వుంది. చాలా మంది అబ్బాయిలు రిలేట్‌ చేసుకునే పాయింట్‌ కావడంతో అర్జున్‌ రెడ్డితో సింపతైజ్‌ కాగలిగారు, అలాగే అతడిని ఐడలైజ్‌ చేసుకున్నారు. కానీ ఇందులోని హీరో కూడా అర్జున్‌ రెడ్డి మాదిరిగా పతనావస్థలో వుంటాడు కానీ అతనికి గల కారణాలు రిలేటబుల్‌గా అనిపించవు. మాదకద్రవ్యాలకి బానిసగా మారిన కొడుకుని తల్లి రీహాబ్‌ సెంటర్‌కి పంపిస్తుంది. అందుకోసం అతను తల్లి మీద పగ పట్టేస్తాడు. చెల్లి మీద కాసింత అభిమానం చూపించడు. ప్రేమించే అమ్మాయి కూడా ఒక వ్యసనంలా అనిపించాలని అంటుంటాడు. సకల దురలవాట్ల బారిన పడిన హీరో తన అప్పుల నుంచి తప్పించుకోవడానికి కన్నతల్లి మీదే చెక్‌బౌన్స్‌ కేస్‌ పెడతాడు. చెల్లి పెళ్లి కోసం వుంచిన ఇల్లు తనఖా పెట్టించి తన సమస్యల నుంచి బయటపడతాడు. ఇలాంటి క్యారెక్టర్‌తో రిలేట్‌ చేసుకోవడం కాదు కదా, సింపతైజ్‌ చేయడం కూడా కష్టమే. తనని తల్లి రీహాబ్‌ సెంటర్‌కి పంపేయడం వల్ల చాలా కష్టపడ్డాననేది అతనిచ్చే రీజన్‌. ఆ కారణం కూడా అతడి పట్ల జాలి కలగడానికి కావాల్సినంత రీజనబుల్‌గా లేదు.

సన్నివేశాలన్నీ కూడా డార్క్‌ మూడ్‌ని మెయింటైన్‌ చేయాలనే తాపత్రయంతో చేసినట్టుగా అనిపిస్తాయే తప్ప దేనికీ పర్పస్‌ వుండదు. అతనికో ముప్పయ్‌ లక్షల అప్పుంది. అది చెల్లించకపోతే ఇబ్బందులు తప్పవు అనే పాయింట్‌ని ఎస్టాబ్లిష్‌ చేయడానికి హీరోని ఏడు రోజుల పాటు ఒక గోడౌన్‌లో బంధించడం దేనికి? చీకటి మొదలైనపుడు లేచి, చీకటి ముగిసే సమయంలో నిద్రపోతానని చెప్పిన హీరో ఆ వెంటనే హీరోయిన్‌ కోసమని సూర్యుడిని చూడడం మొదలు పెట్టేస్తాడట. అతని పతనాన్ని చూపించడానికి వివిధ సన్నివేశాలు తీసుకుంటూ పోయారు. అతను గ్యాంబుల్‌ చేయడానికి ఆడే 'హంగర్‌ గేమ్స్‌' లాంటివి హాస్యాస్పదంగా అనిపిస్తాయి. ఇక ఇంటర్వెల్‌కి ముందు ఒట్టి బాక్సర్స్‌తో అతడిని రోడ్డు మీద పరుగెత్తించడం వెనుక వచ్చిన ప్రయోజనం ఏమిటో మరి? ఆ పాయింట్‌ నుంచి సంగీత దర్శకుడు కూడా ఎలాంటి దోబూచులు ఆడకుండా అర్జున్‌రెడ్డి థీమ్‌నే వినిపించడం మొదలు పెట్టాడు.

శ్రీవిష్ణుకి ఇది ఛాలెంజింగ్‌ క్యారెక్టరే కానీ ఇలాంటి పాత్రలు చేసినపుడు అవి గుర్తుండిపోయేలా వుంటే పడిన కష్టానికి తగిన ఫలితం వుంటుంది. క్యారెక్టర్‌ బాగుంది కదా అని చేసేస్తే అది వృధా ప్రయాస అవుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం వుండదు. మిగిలిన తారాగణంలో తల్లి పాత్రలో రోహిణి నటన సహజంగా వుంది. మరీ డ్రామా మోతాదు శ్రుతి మించినా కానీ రోహిణి వున్న సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. హీరోయిన్‌ క్యారెక్టర్‌ని కన్వీనియంట్‌గా రాసుకున్నారు. ఎస్‌ఐ ట్రెయినింగ్‌లో వున్న యువతి ఒక డ్రగ్‌ అడిక్ట్‌ డిజెతో ప్రేమలో పడడం ఏమిటో? ద్వితియార్థంలో కథానాయికకి స్పేస్‌ కల్పించడానికి ఆమెని సబ్‌ ఇన్స్‌పెక్టర్‌గా చూపించారనేది తెలిసిపోతూనే వుంటుంది.

సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రాఫర్‌ మాత్రం దర్శకుడి ఆలోచనలకి తగ్గట్టుగా డార్క్‌ మూడ్‌ని తన లైటింగ్‌తో సెట్‌ చేసాడు. సంగీతంతో మిగిలిన విభాగాల్లో ఏదీ మెప్పించలేదు. ఈ చిత్ర దర్శకుడు తన కథలో అయితే అటు తల్లీ కొడుకుల మధ్య వున్న సంఘర్షణ ప్రధానంగా కథ రాసుకుని వుండాలి లేదా ఇటు పతనావస్థలో వున్న హీరో తాలూకు ప్రయాణాన్ని చూపించడంపై దృష్టి పెట్టాల్సింది. ఈ రెంటినీ ఒకే తాటి మీదకి తేవాలనేది రాంగ్‌ అటెంప్ట్‌ అయింది. ఇలాంటి పరస్పర విరుద్ధమైన అంశాలని కలిపి ఒక సినిమా తీయాలంటే నెరేషన్‌ అద్భుతంగా వుండాలి.

ఏ దశలోను ఆసక్తి రేకెత్తించని ఈ చిత్రంలో దర్శకుడు కమర్షియల్‌ పేఆఫ్స్‌గా అనుకున్నవి కూడా తేలిపోయాయి. హీరోలో పరివర్తన రావడానికి వాడిన పాయింట్‌ని కిలోమీటర్‌ అవతలి నుంచి పసిగట్టవచ్చు. అలాగే హీరో మారిన తర్వాత చేసే త్యాగాన్ని కూడా ఈజీగా కనిపెట్టవచ్చు. క్లయిమాక్స్‌కి ముందు అతను పిండే సెంటిమెంట్‌లో కూడా తగినంత శోకం లేదు. శ్రీవిష్ణుకి ఒక కల్ట్‌ సినిమా ఇవ్వాలనే ఐడియాతో తిప్పిన ఈ మీసం అర్జున్‌రెడ్డి గడ్డం మాదిరిగా ఐకానిక్‌ అవ్వలేదు.

బాటమ్‌ లైన్‌:

మిక్కిలి నీరసం!

- గణేష్‌ రావూరి

Show comments