వాళ్లంతా కమలదళంగా బరిలో దిగుతారా?

కర్ణాటకలో కాంగ్రెసులో ఉండగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేల స్థానాల్లో డిసెంబరు 5వ తేదీన ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదివరకే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అయితే తాజాగా.. వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు.. ఆయా మాజీ ఎమ్మెల్యేలకు ఉపశమనం కలిగించేదిగా ఉంది. గతంలో కాంగ్రెసు తరఫున గెలిచిన వాళ్లంతా ఇప్పుడు కమలదళం తరఫున ఉప ఎన్నికల బరిలోకి దిగుతారా? అనే మీమాంస నడుస్తోంది.

కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు అందరికీ తెలిసిందే. అప్పటి స్పీకరు వారి రాజీనామాలను ఆమోదించకుండానే.. అనర్హత వేటు వేసేశారు. పైగా వారికి 2023 వరకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత కూడా లేకుండా చేసేశారు. ఇది చాలా కీలక పరిణామం కాగా.. ఆ పోటీచేయనివ్వని వైనంపై వారంతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

ఈ విషయంలో సుప్రీం కోర్టు తాజాగా తీర్పుచెప్పింది. వారిని అనర్హులుగా ప్రకటించిన స్పీకరు నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని చెప్పిన సుప్రీం కోర్టు.. వారు 2023 వరకు ఎన్నికల్లో పోటీచేయడానికి లేదన్న విషయాన్ని మాత్రం కొట్టి పారేసింది. దాంతో వారంతా ఉప ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఏర్పడింది. 

గతంలో వారంతా కాంగ్రెస్ తరఫున గెలిచారు. తమ రాజీనామాలతో భాజపా ప్రభుత్వం ఏర్పడ్డానికి సహకరించారు. ఇప్పుడు వారిని కాంగ్రెస్ వెలివేసినట్లుగా చూస్తుంది. ఇప్పుడు వారంతా తమ తమ నియోజకవర్గాల నుంచి భాజపా తరఫునే పోటీచేస్తారా? అనేది చర్చనీయాంశంగా ఉంది. అలా జరిగితే.. అక్కడ ఇదివరకు పోటీచేసిన భాజపా అభ్యర్థుల అసంతృప్తి సెగ తగలదా అనే చర్చ కూడా ఉంది. 

వారు కమలం తరఫున బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ. యడియూరప్ప ప్రభుత్వంలో కొందరు మంత్రులుగా చేరడానికి కూడా బేరం మాట్లాడుకున్న తర్వాతనే అప్పట్లో వారు రాజీనామాలు చేసినట్లుగా కూడా పుకార్లున్నాయి.