అంబానీ మాటలపై థియేటర్ల పెదవి విరుపులు!

జియో ఫైబర్ కస్టమర్లు సినిమాలను విడుదల రోజే చూసే అవకాశం ఉంటుందంటూ ముఖేష్ అంబానీ ప్రకటించడంపై పారిశ్రామిక వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తూ ఉంది. ఇండియాలో ఈ తరహా కాన్సెప్టులు వర్కవుట్ కావని తేలిపోయింది. ఇది వరకూ కొంతమంది మూవీ మేకర్లే తమ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం లేదని, డైరెక్టుగా టీవీల్లోనే విడుదల చేస్తామంటూ ప్రకటనలు చేశారు.

తమిళనాట ఇలాంటి ప్రయత్నాలు ఒకటీ రెండు జరిగాయి. అయితే అవి ఏ మాత్రం సానుకూల ఫలితాలను ఇవ్వలేదు. ఎవరి సినిమాను వాళ్లే అలా విడుదల చేసుకుంటే వర్కవుట్ కాలేదు. అలాంటిది ఇదెలా సాధ్యమో అనేది సందేహంగా ఉంది.

ఈ నేపథ్యంలో ఈ విషయంలో ప్రముఖ థియేటర్లు స్పందించాయి. ఐనాక్స్, పీవీఆర్ లు ఈ విషయంలో తమ స్పందన తెలియజేశాయి. అంబానీ చెప్పింది నిజమే అయితే అప్పుడు ప్రభావం థియేటర్ల మీదే. అందుకే ఆ సంస్థలు స్పందించాయి.

అంబానీ ప్రకటన అర్థ రహితం అన్నట్టుగా ఈ థియేటర్లు స్పందించాయి. ఇప్పటి వరకూ తమకు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం విడుదల రోజే టీవీల్లోనో, డిజిటల్ స్ట్రీమింగ్ లోనో ప్రసారం అయ్యే అవకాశాలు లేవని పీవీఆర్, ఐనాక్స్ ప్రకటించాయి. తాము ఎనిమిది వారాల విరామాన్ని పెట్టుకున్నట్టుగా అవి తెలిపాయి. 

థియేటర్లో విడుదల అయిన ఎనిమిది వారాల వరకూ ఏ టీవీ చానల్ లో కానీ, డిజిటల్ స్ట్రీమింగ్ లో కానీ ఏ సినిమానూ ప్రసారం చేయకూడదని తమ ఒప్పందంలో ఉందని అవి అంటున్నాయి. ఇదంతా డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్లకు తమకు మధ్యన ఉన్న ఒప్పందమని పేర్కొంటున్నాయి. 

Show comments