ఆ మాజీ హీరోయిన్ ఎంపీగా కాదు ...ఎమ్మెల్యేగా పోటీ?

ఆమె ఒక మాజీ హీరోయిన్. ఒకప్పటి పాపులర్ హీరో భార్య. ఆమె రాజకీయ ప్రస్థానం (భర్త కూడా ఎప్పుడూ ఆమె వెంటే ఉంటాడు) బీజేపీతో మొదలైంది. తరువాత కాంగ్రెస్, ఆ తరువాత వైఎస్సార్ సీపీ లోకి వెళ్లి తిరిగి ఈ మధ్యనే బీజేపీలో మళ్ళీ చేరింది. ఆమె చేరిక లక్ష్యం ఎన్నికల్లో పోటీ చేయడమే. ఆమె జీవితా రాజశేఖర్. ఆమెకు ఎన్నికల్లో టికెట్ ఇస్తామని బీజేపీ నాయకత్వం హామీ ఇచ్చిందట. ఆమెను జహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని నాయకత్వం ఆలోచిస్తున్నట్లు ఈ మధ్యనే వార్తలు వచ్చాయి.

టికెట్ ఇస్తేనే పార్టీలో యాక్టివ్ అవుతానని జీవితా రాజశేఖర్ చెప్పడం, జహీరాబాద్ ఎంపీగా మహిళా అభ్యర్థి అయితే బావుంటుందని  ఆ నియోజకవర్గ ఇంచార్జ్ అయినా నిర్మలా సీతారామన్ ఆలోచనల్లో ఉండటంతో జీవితకు  టికెట్ ఖరారు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జీవితా రాజశేఖర్ ను ఎంపీ స్థానానికి కాకుండా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సినీ , వ్యాపార రంగానికి చెందిన వాళ్లు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జీవిత ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు.

ఈ విషయంలో పార్టీ పెద్దల నుంచి ఆమెకు హామీ ఉందని అంటున్నారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రావుల శ్రీధర్ రెడ్డి పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన అధికార పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీకి జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఇంచార్జ్ ఎవరూ లేరు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జూబ్లిహిల్స్ కార్పొరేటర్ గా గెలిచిన బీజేపీ అభ్యర్థి కూడా ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో జీవిత రాజశేఖర్ కు జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్ వస్తుందనే టాక్ రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తోంది. జీవితా రాజశేఖర్ లు గతంలో రాజకీయంగా యాక్టివ్ గా ఉండేవారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. వైఎస్సార్ మరణాంతరం జగన్ కు మద్దతుగా నిలిచారు.

వైసీపీలో చాల కాలం పనిచేశారు. తర్వాత జగన్ తమకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బయటికి వచ్చారు. తిరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరారు. జగన్ గెలుపు కోసం ఏపీలో ప్రచారం చేశారు. ఇటీవలే వైసీపీకి బైబై చెప్పేసి కమలం తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ బీజేపీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న జీవిత.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అనర్గళంగా మాట్లాడే జీవిత పార్టీకి ప్లస్ అవుతుందన్న భావనలో కమలనాధులు ఉన్నారని తెలుస్తోంది. గతంలో మా అసొసియేషన్ లో జీవిత కీలకంగా వ్యవహరించారు.

మరోవైపు జూబ్లీహిల్స్ నుంచే సినీ రంగానికి చెందిన మరికొందరు ప్రముఖులు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. ది కశ్మీర్ ఫైల్స్, కార్తీకేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారనే టాక్ ఉంది. హీరో నితిన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారంటున్నారు. గత నెలలో తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ సమావేశమయ్యారు. ఇప్పటికైతే జీవితా రాజశేఖర్ బీజేపీ నాయకత్వం ఆలోచనల్లో ఉన్నప్పటికీ ఎన్నికలు దగ్గర పడే సమయానికి ఏమైనా మార్పు చేస్తారేమో తెలియదు.

Show comments