తప్పదు హరీష్‌, అలా సర్దుకుపోవాల్సిందే.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, తెలంగాణ రాష్ట్ర సమితిలో హరీష్‌రావుకి అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. మేనల్లుడే అయినా, హరీష్‌ రావు విషయంలో మొదటి నుంచీ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకింత 'కినుక' వహిస్తూనే వస్తున్నారు. కుమారుడికి పార్టీ పగ్గాలు అప్పజెప్పిన హరీష్‌రావు, మేనల్లుడ్ని కనీసం మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

మంత్రి వర్గకూర్పు విషయంలో హరీష్‌రావు అసంతృప్తితో వున్నారంటూ ప్రచారం జరిగినా, హరీష్‌ మాత్రం మీడియా ముందుకొచ్చి, 'అదంతా ఉత్తదే' అని కొట్టిపారేశారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దంటూ హరీష్‌ రావు చెబుతున్నారు. మంత్రివర్గంలో తనకు చోటు కల్పించకపోవడం పట్ల అసంతృప్తి ఏమీలేదనీ, తాను బాధ్యతగల టీఆర్‌ఎస్‌ కార్యకర్తననీ, కేసీఆర్‌ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా వున్నాననీ చెప్పుకొచ్చారాయన.

ఇదిలావుంటే, హరీష్‌రావుని పార్లమెంటుకు పంపాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారనీ, రాష్ట్ర రాజకీయాల నుంచి ఆయన్ను బయటకు పంపేందుకోసం కేటీఆర్‌, కవిత కలిసి స్కెచ్‌ వేశారనీ కొన్నాళ్ళ క్రితం జరిగింది. అయితే, అదంతా ఉత్తదేనని తేలిపోయింది.. సిద్ధిపేటనుంచి హరీష్‌రావు ఎమ్మెల్యేగా పోటీకిదిగడం, బంపర్‌ మెజార్టీతో విజయాన్ని అందుకోవడం తెల్సిన విషయాలే.

రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేస్తున్న కేసీఆర్‌, అత్యంత వ్యూహాత్మకంగా హరీష్‌రావుని మంత్రివర్గానికి దూరంగా వుంచారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, హరీష్‌ని మంత్రివర్గంలో చేర్చుకుని వుంటే.. ఇంకా ఎఫెక్టివ్‌గా ఆయన పార్లమెంటు ఎన్నికల కోసం పనిచేసేవారన్న వాదనా లేకపోలేదు.

మొత్తమ్మీద, హరీష్‌ విషయంలో 'గులాబీ' పార్టీలో కొంత గందరగోళమైతే కన్పిస్తోంది. హరీష్‌ మద్దతుదారులు, సోషల్‌ మీడియా వేదికగా టీఆర్‌ఎస్‌ అధినేత తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.. అదే సమయంలో కొందరు సానుభూతిపరులు హరీష్‌ని కలిసి సంఘీభావం తెలుపుతున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల తర్వాత అయినా హరీష్‌రావుకి మంత్రివర్గంలో చోటు దక్కుతుందా.? వేచి చూడాల్సిందే.  

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?