థ్యాంక్యూ సీఎం జగన్‌: ఇదీ మార్పు అంటే!

ముఖ్యమంత్రి అవుతూనే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తానెంత ప్రత్యేకమో చాటుకుంటున్నారు. శాఖల వారీ సమీక్ష ఓ పక్క, ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకోవాలన్న తపన ఇంకో పక్క.. వెరసి, క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. కాస్త టైమ్‌ చూసుకుని, విశాఖ పర్యటనకు వెళ్ళిన వైఎస్‌ జగన్‌, శారదా పీఠాధిపతి ఆశీస్సులు పొందారు. అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయం వద్ద 'మా స్నేహితుడ్ని కాపాడండి..' అంటూ బ్యానర్లు పట్టుకుని నిలుచుకున్న కొందరు యువతీయువకుల్ని చూసి తన కాన్వాయ్‌ని ఆపారు యువ సీఎం.

బాధిత యువకుడి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చు విషయమై అక్కడికక్కడే కలెక్టర్‌తో మాట్లాడిన వైఎస్‌ జగన్‌, ఆపరేషన్‌ ఏర్పాట్లను పర్యవేక్షించాలని కూడా ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తమ కోసం కాన్వాయ్‌ని ఆపించడం, తమతో ముచ్చటించడంతో అప్పటిదాకా ప్లకార్డులతో నిలుచుకున్న యువతీయువకులంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. తమ స్నేహితుడ్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తంచేశారు.

'థ్యాంక్యూ సీఎం..' అంటూ యువతీ యువకులంతా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. మార్పు అంటే ఇదీ.! సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ దగ్గరకు వస్తే, భద్రతా సిబ్బందితో వారిని నెట్టివేయించడం కాదు, సమస్యల్ని తెలుసుకుని ఆ సమస్యల్ని పరిష్కరించేవాడే నిజమైన నాయకుడని వైఎస్‌ జగన్‌ నిరూపించారు. ఇదీ అసలు సిసలు మార్పు అంటే. ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఇంకా పూర్తిగా వారంరోజులు కూడా కాలేదు. ఇప్పుడే ఇంత మార్పు చూపిస్తున్నారంటే.. రానున్న ఐదేళ్ళలో వైఎస్‌ జగన్‌ నుంచి పాలనా పరంగా మరిన్ని అద్భుతాల్ని ఆశించవచ్చన్నమాట. 

తండ్రీ కొడుకులు సాకులు వెతుకుతున్నారు