మరింత మొండిగా.. నిర్దయగా సర్కారు!

ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులు విలీన డిమాండ్‌ను పక్కన పెట్టారు కదా అనే ఉద్దేశంతో.. ప్రభుత్వం  కూడా ఒక మెట్టు దిగివస్తుందని కొందరు ఆశించారు. దిగిరావాలని కూడా కొందరు నాయకులు హితవు చెప్పారు.

కానీ అలాంటి వాతావరణం ఎంతమాత్రమూ కనిపించడం లేదు. ప్రభుత్వం మరింత గట్టిగా, మరింత మొండిగా.. మరో రకంగా చెప్పాలంటే కార్మికుల పట్ల నిర్దయగా.. తమ పట్టు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడిక కార్మికులు తిరిగి విధుల్లో చేరడానికి ముందుకు వచ్చినా కూడా ఆమోదించలేని పరిస్థతి న్నదంటూ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించడమే ఇందుకు నిదర్శనం.

ఆర్టీసీ ఆందోళనలు ఇంకాస్త విషమరూపం దాలుస్తున్నాయి. సారథి అశ్వత్థామ రెడ్డి తలపెట్టిన నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసేందుకు యత్నించడంతో ఆయన తన ఇంట్లోనే స్వీయనిర్బంధం చేసుకుని.. అక్కడే నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం చర్చలకు పిలిచేంత వరకు దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు.

అదే సమయంలో ప్రభుత్వం హైకోర్టుకు మరొక అఫిడవిట్ సమర్పించింది. వారి వైఖరిలో చర్చలకు పిలిచే పోకడ కాదు కదా... మొత్తం ఆందోళనను విరమించుకుని.. విధుల్లో చేరడానికి వచ్చినా కూడా పట్టించుకునే ధోరణి కనిపించడం లేదు. పైగా ఈ అఫిడవిట్‌లో ఆర్టీసీ ఎండీ పేర్కొన్న విషయాలు, చేసిన ఆరోపణలు మరింత తీవ్రమైనవిగా కనిపిస్తున్నాయి.

ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షనాయకులతో కలిసి కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు వారు తిరిగి వచ్చినా విధుల్లో కొనసాగించే నిర్ణయం కష్టమేనని వక్కాణించారు. వీరి సమ్మె, ఆందోళనలను చట్టవిరుద్ధమైనవిగా చాటాచెప్పేందుకు పలు సెక్షన్లను ఎండీ తన అఫిడవిట్ లో ప్రస్తావించారు.

ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ కార్మికులకు 44 శాతం వేతనాలు పెంచారని, అయితే సహేతుకం కాని విలీన డిమాండ్ తో ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న సుమారు యాభై కార్పొరేషన్లు కూడా ఇదే డిమాండ్ లేవనెత్తితే.. పరిస్థితి మరీ ఘోరంగా మారుతుందని ఆయన నివేదించారు.

అంచనాలకు భిన్నంగా.. ఆర్టీసీ విలీనం డిమాండ్ ను పక్కన పెట్టినతర్వాత కూడా ప్రభుత్వం మెట్టు దిగకుండా.. మరింత మొండిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. ఈ ఆర్టీసీ ఆందోళనలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో తెలియడంలేదు.