తెనాలి రామకృష్ణను ఫ్రీగా చూసేయండి

కొత్త సినిమాకు మొదటి రోజు మొదటి ఆట టిక్కెట్ దొరకడమే కష్టం. అలాంటిది కొత్త సినిమా, మొదటి రోజు మొదటి ఆటను ఉచితంగా చూసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి అవకాశాన్నే కల్పించబోతున్నాడు హీరో సందీప్ కిషన్. తన కొత్త సినిమా తెనాలి రామకృష్ణను ఉచితంగా చూపించబోతున్నాడు. కాకపోతే ఇక్కడ కండిషన్స్ అప్లయ్.

కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది తెనాలి రామకృష్ణ సినిమా. కాబట్టి కర్నూల్ లో ఈ సినిమాను కొన్ని థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించబోతున్నాడు సందీప్ కిషన్. ఇక తెనాలి రామకృష్ణ అనే టైటిల్ వాడుకున్నాడు కాబట్టి, అటు తెనాలిలో కూడా కొన్ని థియేటర్లలో ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శించబోతున్నారు.

కర్నూల్, తెనాలి ప్రేక్షకులకు సందీప్ కిషన్ మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఈ నెల 15న విడుదలకానున్న ఈ సినిమాను ఒక రోజు ముందే, అంటే 14వ తేదీనే ఈ ప్రాంత వాసులు ఉచితంగా చూడొచ్చన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే తెనాలి, కర్నూలు వాసులకు తెనాలి రామకృష్ణ ప్రీమియర్ షో చూపించబోతున్నాడు సందీప్ కిషన్. ఈ మేరకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తనే సొంతంగా భరిస్తాడట.

నిను వీడని నీడను నేను సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ హీరో, ఇప్పుడు పూర్తిగా కామెడీ బేస్డ్ సినిమా చేశాడు. ఈ మూవీతో కూడా సక్సెస్ కొడితే అతడి కెరీర్ ఉన్నంతలో గాడిలో పడినట్టే. అందుకే ఇంతలా కష్టపడుతున్నాడు ఈ హీరో. అన్నట్టు విడుదలకు ముందే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. అటుఇటుగా 3 కోట్ల రూపాయలకు స్టార్ మా ఛానెల్ ఈ సినిమా రైట్స్ దక్కించుకుంది.

Show comments