రాహుల్ పై రాళ్లు ఎందుకు పడ్డాయంటే...?

ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం అనేది అంత సులభంగా ఏమీ జరగదు. నిజానికి ప్రజలు చాలా సహన పరులు! నాయకులు ఎన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నా సరే.. వారు సహిస్తూ ఉంటారు. కానీ వారిలో సహనం హద్దులు చెరగిపోయి, ఆవేశం కట్టలు తెంచుకుని నాయకుల మీదే దాడికి పాల్పడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ దేశానికి తాను భావి ప్రధానిని అనుకుంటూ నిత్యం గడిపేస్తూ ఉండే రాహుల్ కు బహుశా ఈ విషయం ఇప్పుడు అర్థమై ఉండాలి.

అవును గుజరాత్ రాష్ట్రం ధనేరాలో రాహుల్ కు ఎదురైన ప్రతిఘటన అచ్చంగా ఆయన స్వయంకృతమే అనే సంగతిని ముందుగా ఆయన గుర్తించాలి. వరదలు వచ్చి ప్రజలు అవస్థలు పడుతోంటే.. అక్కడ ఉండి వారికి సేవ చేయాల్సిన తమ పార్టీ ఎమ్మెల్యేను రాజ్యసభ ఎన్నికల శిబిరంలో ఉంచి విలాసాల్లో ముంచేసి.. తానుమాత్రం తగుదునమ్మా అంటూ... పరామర్శకు వెళ్లినందుకు జరిగిన శాస్తి ఇది.

గుజరాత్ లోని ధనేరా వాసులు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నే గెలిపించారు. అంటే అక్కడ సాంప్రయదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకే ఎక్కువగా ఉన్నట్లు లెక్క. అయినా సరే వారికి ఏం ఒరిగింది... సరిగ్గా అక్కడి ప్రజలు వరదల వల్ల నానా అవస్థలు పడుతునన సమయానికి వారు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే జోయ్‌తాభాయ్ పటేల్ అక్కడ లేరు. ఆయన ఎంచక్కా బెంగుళూరు ఈగల్టన్ రిసార్టులో విలాసవంతమైన సూట్ రూముల్లో.. సకల విలాసాల్లో మునిగి తేలుతున్నారు. ఒకవేళ తాను తనను గెలిపించిన ప్రజల వద్దకు వెళ్లాలని ఆయన మొండికేసినా కూడా.. కాంగ్రెస్ పార్టీ ఆయనను పంపించే స్థితిలో లేదు.

అక్కడినుంచి కదలకుండా కాపలా కాయిస్తోంది. గుజరాత్ రాజ్యసభ ఎన్నిక పూర్తయి.. వారంతా అహ్మద్ పటేల్ కే ఓటు వేసే వరకూ వారినందరినీ ఇలా బంధించే (నిర్బంధించే) ఉంచాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఆ రకంగా.. అక్కడ ప్రజల్లో ఉండి సహాయక చర్యల్లో నిమగ్నం కావాల్సిన తమ సొంత పార్టీ ఎమ్మెల్యేను రాజకీయ లబ్ధి కోసం దాచేసి, తాను మాత్రం సహాయక చర్యల పరిశీలనకు వెళ్తా అంటే.. అందులోని డ్రామాను ఎవరు మాత్రం సహిస్తారు. అందుకే రాహుల్ కాన్వాయ్ మీద ప్రజాగ్రహం వెల్లువైంది. 

అయినా ఒక్క అహ్మద్ పటేల్ కు రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ తమ ఇమేజిని తామే ఇన్ని రకాలుగా ఎందుకు భ్రష్టు పట్టించుకుంటున్నదో అర్థం కాని సంగతి. పార్టీ ఇలాంటి నాటకాలు కొనసాగించినంత  కాలమూ.. వారికి ప్రజాప్రతిఘటన కూడా ఇంతకంతకూ పెరుగుతూ ఉంటుందని తెలుసుకోవాలి. 

Show comments