తెలంగాణ పోల్స్: ఏపీలో బెట్టింగు రంగా..

ఎక్కడో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడే, ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగులు జోరుగా సాగాయ్‌.. అలాంటిది, పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగులు జరగకుండా వుంటాయా.? పైగా, తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌తో 'లింకు' చాలా గట్టిగానే వుందాయె. ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకున్నా ఇంకో ఐదేళ్ళపాటు హైద్రాబాద్‌పై ఆంధ్రప్రదేశ్‌కి హక్కు వుందన్నది నిర్వివాదాంశం. హైద్రాబాద్‌ ఒక్కటేకాదు, తెలంగాణలోని పలు జిల్లాల్లో సీమాంధ్ర ఓటు బ్యాంకు గట్టిగానే వుంది.

ఫలితాల్ని పూర్తిగా శాసించేలా కాకపోయినా, 'నువ్వా.? నేనా.?' అని ప్రధాన పార్టీలు తలపడే క్రమంలో, సీమాంధ్ర ఓటు బ్యాంకు అత్యంత కీలకం కానుంది. అందుకే, బెట్టింగులు ఆ ఓటు బ్యాంకు చుట్టూ జరుగుతాయి.. జరుగుతున్నాయి కూడా. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, కర్నూలు తదితర ప్రాంతాల్లో బెట్టింగులు జోరుగా నిర్వహించేస్తున్నారు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి.

ముఖ్యంగా ఈ బెట్టింగులు గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోని ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాలు, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ (ఉమ్మడి జిల్లాలు) జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్ని టార్గెట్‌గా చేసుకుని నిర్వహిస్తున్నారట. గత నెలరోజులుగా ఈ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి.

ఎప్పటికప్పుడు బెట్టింగ్స్‌లో మార్పులు చేర్పులూ చోటు చేసుకుంటున్నాయట. నిన్నటి పోలింగ్‌ అనంతరం ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు వచ్చాక.. బెట్టింగులు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయని తెలుస్తోంది. చిత్రమేంటంటే, బెట్టింగుల్లో మెజార్టీ టీఆర్‌ఎస్‌ గెలుపుకి అనుకూలంగానే కావడం. ఎక్కువ శాతం సర్వేలు కూడా, టీఆర్‌ఎస్‌ గెలుపునే సూచిస్తున్నాయి మరి.

ఇదిలావుంటే, పోలింగ్‌ శాతం విషయమై నిన్నటినుంచీ కొంత గందరగోళం కన్పిస్తోంది. గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో పోలింగ్‌ శాతం తగ్గితే, ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ విపరీతంగా సాగింది. ఆ పెరిగిన పోలింగ్‌ అధికార పార్టీని ముంచేస్తుందా.? కూటమిని అటకెక్కిస్తుందా.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌లో ఓటరు, పోలింగ్‌ని లైట్‌ తీసుకోవడం ఎవరికి లాభం.? ఎవరికి నష్టం.? అన్న అంశాల చుట్టూ బెట్టింగులు భారీగా జరుగుతున్నాయట.

Show comments