టాలీవుడ్‌కు అంత సీన్ లేదా..!

అరవై ఏళ్లలో ఆస్కార్ రేసుకెళ్లింది ఒక్కటంటే ఒక్కటి!
సత్తా చాటుతున్న తమిళులు, ఉనికి చాటుతున్న ఇతర భాషల సినిమాలు
ఆస్కార్ సాధించలేకపోయినా ఆ రేసుకైనా అవి వెళ్తున్నాయి
ఆ ఓపిక, సత్తువ లేని తెలుగు సినిమా
అన్నీ ఉన్నా, రీమేక్‌ల చుట్టూ టాలీవుడ్ ధిగ్గజాలు!

‘టాలీవుడ్ మీకు అన్నీ ఇచ్చింది... దానికీ మీరు ఎంతో కొంత తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు...’ సినీ పరిభాషలోనే టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఇవ్వదగ్గ సలహా ఇది! లేకపోతే.. ఒకవైపు తమిళులు దూసుకుపోతున్నారు, ఉందని కూడా చాలా మందికి తెలియని మరాఠీ చిత్ర పరిశ్రమ కూడా ఇండియా తరపున ఆస్కార్ రేసుకు సినిమాను పంపించగలిగింది. అయితే టాలీవుడ్ మాత్రం తన సహజశైలిలో ఈ విషయంలో వెనకబడి పోయింది! ఇదేదో కొత్త జాడ్యం కాదు.. దశాబ్దాల నేపథ్యం ఉన్నా... టాలీవుడ్ తన సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లలేకపోతోంది! 

తెలుగు వాళ్ల పరిధి దాటలేకపోతోంది. చరిత్రనంతా పట్టి పట్టి చూసినా.. ఇంత వరకూ ఒకే ఒక తెలుగు సినిమా ఆస్కార్ రేసు వరకూ వెళ్లడం కనిపిస్తుంది. మరీ ఒక్క సినిమా నేనా... ఆస్కార్ అవార్డు రావడం సంగతి అటుంచితే, కనీసం ఆ రేసుకు తగిన సినిమాలను కూడా మనోళ్లు తీయలేకపోతున్నారనే బాధ సగటు తెలుగువాడిది అవుతోంది.ఒకవైపు ఏమో.. మన సినిమా ప్రపంచ స్థాయికి చేరిపోయిందని కొంతమంది చెబుతూ ఉంటారు. బహిరంగ వేదికల మీదే... తడుముకోకుండా వాళ్లు ఈ ప్రకటనలు చేసేస్తూ ఉంటారు. హాలీవుడ్ స్థాయిని మించిపోయామని.. తెలుగు సినీ ప్రభ అంతరిక్ష స్థాయిలో వెలిగిపోతోందని.. మనోళ్లు అద్భుతాలు చేస్తున్నారని.. ప్రపంచ దష్టినే ఆకర్షిస్తున్నారని.. అనే మాటలూ వినిపిస్తూ ఉంటాయి. 

అయితే అవన్నీ కూడా ఆడియో విడుదల వేడుకల్లో వినిపించే భజంత్రీ మాటలే అని చెప్పక తప్పదు. బాహుబలితోనో.. మనోళ్ల సినిమాలు ఓవర్సీస్‌లో కోట్లు సంపాదిస్తున్నాయనో.. మనోళ్ల సినిమాలు ఏవో విదేశీ భాషల్లోకి తర్జుమా అయ్యాయనే రెఫరెన్సులతోనో... తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయనేది పెద్ద అబద్ధం! మన సినిమాలు కనీసం మరాఠీ సినిమాలతో కూడా పోటీ పడలేకపోతున్నాయి. పక్కనే ఉన్న తమిళులు మనోళ్లను వెక్కిరిస్తూ... తమ సినిమాలను ఇండియా తరపున ఆస్కార్‌కు నామినేట్ చేయగలుగుతున్నారు! టాలీవుడ్ మాత్రం అంత సీన్ లేకుండా పోయింది! ఇలాంటి ప్రస్తావనలు తీసుకొస్తే మనోళ్లు మొహం చాటేసుకోవాల్సిందే.

రీమేక్‌లే మన స్థాయి!

తెలుగు సినిమా ఇంతే... ఇలాగే ఉంటుంది... అనేది కొత్తగా చెప్పుకోవాల్సిన అంశం ఏమీకాదు. చోద్యం ఏమిటంటే... కనీసం కమర్షియల్ సినిమాను కూడా కొత్తగా చూపలేని దుస్థితిలోకి క్రమంగా కూరుకుపోతోంది టాలీవుడ్. ఒకే ఫార్ములాను ఆధారంగా చేసుకుని.. అదో జోనర్, అవే కథలతో వస్తున్న సినిమాలన్నా అయ్యుండాలి లేకపోతే ఏ హాలీవుడ్ నుంచినో, కొరియా సినిమాల నుంచినో కాపీ కొట్టిన కథలైనా అయ్యుండాలి.. అదీ కాదంటే డైరెక్టుగా రీమేక్ అయ్యుండాలి! ఇదీ తెలుగు సినిమా పరిస్థితి.

ఇటీవల కాలంలో తెలుగులో విడుదలైన, ప్రస్తుతం రూపొందుతున్న దశలో ఉన్న సినిమాల జాబితానే ఒకసారి పరిశీలిస్తే... వీటిల్లో కాపీ కథలు, విదేశీ సినిమాల ప్రభావంతో రూపొందుతున్నవీ, రీమేక్ సబ్జెక్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్నది రీమేక్ సినిమానే. చిరంజీవి 150వ సినిమాగా, ఆయన తొమ్మిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సినిమాగా.. ఎంత హైప్ ఉన్నా, అది స్ర్టైట్ సినిమా కాలేకపోవడం గమనార్హం. తమిళులు తీసేసిన సినిమా ద్వారా చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్నాడు!

ఇక స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వారందరి పరిస్థితీ ఇలానే ఉంది. ‘ది గాడ్ ఫాదర్’ ఫార్ములాతో వచ్చిన ‘‘జనతాగ్యారేజ్’’తో ఎన్టీఆర్ ఏ మాత్రం కొత్తదనం చూపలేకపోయాడు. రామ్ చరణ్ రీమేక్ సినిమా మీదనే ఆధారపడ్డాడు. ఒక బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్ చేసిన, చేస్తున్న సినిమాల్లో రీమేక్‌ల పాళ్లు ఎక్కువ! ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పుకునే పవన్ ఆ విధంగా ట్రెండ్‌ను ఫాలో అయిపోతున్నాడు.

మహేశ్ బాబు కావొచ్చు.. ఇతర తెలుగు హీరోలు కావొచ్చు.. అందరూ అందరే! ఏ ఒక్కరికీ కొత్తదనం మీద ఆసక్తి కనిపించడం లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్‌నో.. తమ ఇమేజ్‌నో పరిగణనలోకి తీసుకుని సినిమాలు చేయడం తప్ప .. ఏదో మంచి సినిమాను చేయాలనే తపన ఏ కోశానా కనిపించడం లేదు మనోళ్లు. భవిష్యత్తులో కూడా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందనే ఆశ కూడా లేదు!

తమిళులను చూడండి..!

తమిళులేమీ ఆర్ట్ మూవీస్ చేయడం లేదు.. వాళ్లు చేస్తున్నదీ కమర్షియల్ సినిమాలే! కానీ వాళ్లకు ఎక్కడో ఉంది.. తమ సినిమా స్థాయిని, తమ భాష స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే ఆసక్తి. అందుకే అక్కడ అప్పుడప్పుడైనా అద్భుతాలు జరుగుతున్నాయి. జాతీయ అవార్డుల ప్రకటన వచ్చిదంటే.. ఆ జాబితాలో తమిళ సినిమాలు కచ్చితంగా ఉంటాయి. తాజాగా ‘‘విసారణై’’ సినిమా ఆస్కార్ అవార్డుల రేసులో నిలవడం ద్వారా తమిళుల తపనను దేశానికి అర్థం అయ్యింది. ఆ సినిమా వెనుక ఒక మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో ఉన్నాడు! అది నిర్మాతగా అయినా సరే.. తెలుగులో ఏనాటికైనా అలాంటి అబ్బురం సాధ్యం అవుతుందా? అనేది ఒక శేష ప్రశ్న!

ఆస్కార్ రేసులో ముందున్నారు..!

అవార్డులను సాధించలేకపోవచ్చు... వాటి కన్నా ఉత్తమ స్థాయి సినిమాలే అవార్డులు పొందుతూ ఉండవచ్చు. విదేశీ క్యాటగిరీలో ఉత్తమ చిత్రం అనే ఏకైక అవార్డుకు ప్రపంచం నలువైపుల నుంచి ఉన్న పోటీ వల్లనో తమిళ, భారతీయ సినిమాల్లో ఏదీ కూడా ఆస్కార్‌ను సొంతం చేసుకోలేకపోయుండొచ్చు. కానీ.. ఆ పోటీకి అర్హత విషయంలో తమిళులు ఇప్పటికే తమ సత్తా ఏమిటో చూపించుకున్నారు.

‘‘విసారణై’’కి ముందు కమల్ హాసన్ సినిమా ‘‘హేరామ్’’, దానికి ముందు శంకర్ సినిమా ‘‘జీన్స్’’, వీటికి ముందు కమల్- శంకర్ కాంబోలో వచ్చిన ‘‘ఇండియన్’’, అంతకు ముందు ఏడాది పీసీ శ్రీరామ్ దర్శకత్వంలో కమల్, అర్జున్‌లు హీరోలుగా వచ్చిన ‘‘కురుతిపునాల్’’(తెలుగులో ద్రోహి), అంతకు ముందు భరతన్ దర్శకత్వంలో కమల్ హీరోగా వచ్చిన ‘‘తేవర్ మగన్’’ (తెలుగులో క్షత్రియపుత్రుడు), దానికి ముందు మణిరత్నం ‘అంజలి’, అంతకన్నా ముందు కూడా మణిరత్నం దర్శకత్వంలోనే, కమల్ హాసన్ నటించగా వచ్చిన ‘నాయగన్’.. వగైరా సినిమాలు ఇండియా తరపున ఆస్కార్ రేసులో నిలిచాయి. 

1957 నుంచి 2016 వరకూ దాదాపు ఈ అరవై సంవత్సరాల్లో ఇండియా తరపు నుంచి ఆస్కార్ ఫారెన్ ఫిల్మ్ క్యాటగిరీ అవార్డు కోసం ఎనిమిది తమిళ సినిమాలు పోటీ పడ్డాయి. తెలుగు విషయానికి వస్తే... చరిత్రంతా వెదికి చూసినా ఒకే ఒక తెలుగు సినిమా ఆస్కార్ అవార్డుల పోటీలో నిలిచిందనే విషయం అర్థం అవుతుంది. అది ‘‘స్వాతిముత్యం’’. కే.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరో కూడా తమిళుడే! అరవై సంవత్సరాలకు గానూ.. ఇండియా తరపున మనకు దక్కిన ప్రాతినిధ్యం ఒకే ఒక్కసారి! ఇదీ టాలీవుడ్ గొప్పదనం!

ఆస్కార్‌కు ఇండియా తరపున వెళ్లిన హిందీ సినిమాలను పక్కన పెడితే, ఇతర ప్రాంతీయ భాషల్లో రూపొంది.. ఆస్కార్ రేసులో ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ఇతర సినిమాల విషయానికి వస్తే... మలయాళీ సినిమాలు రెండుసార్లు ఆస్కార్ అవార్డు రేసుకు వెళ్లాయి. బాలీవుడ్‌కు కేంద్రం ముంబై, హిందీ ఆధిపత్యంగా ఉన్న ఆ మరాఠాగడ్డపై ఆ భాషలో సినిమాలు వస్తాయని కూడా చాలా మందికి తెలియదు. కానీ ఇప్పటి వరకూ పలుమార్లు మరాఠీ సినిమాలు ఆస్కార్ రేసులో నిలిచాయి.2015లో ఆస్కార్‌కు భారత్ తరపున నామినేట్ అయ్యింది ‘కోర్ట్’’ అనే మరాఠీ సినిమా. 

దాని కన్నా మునుపు ‘హరిశ్చంద్రా ఫ్యాక్టరీ’, ‘శ్వాస్’ అనే మరాఠీ సినిమాలు కూడా ఆస్కార్ బరిలో నిలిచాయి. తెలుగు సినిమా ఆర్థిక శక్తి, ఇక్కడి సినిమా పిచ్చి, సినిమాలపై పెట్టుబడి పెట్టే డబ్బు, వచ్చే వసూళ్లు తదితరాలతో పోలిస్తే... చాలా చిన్నవి అయిన గుజరాతీ, బెంగాళీ చిత్ర పరిశ్రమల నుంచి వచ్చిన సినిమాలు కూడా టాలీవుడ్ కన్నా ఎక్కువసార్లు ఆస్కార్ పోటీలకు వెళ్లాయి. ఆఖరికి ఉర్దూ భాషలో రూపొందించిన సినిమా ఒకటి కూడా ఇండియా తరపు నుంచి ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. కానీ 196లో ‘స్వాతిముత్యం’ తర్వాత ఈ ముప్పై సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలవలేకపోయింది. ముందు ముందు అయినా.. మనోళ్లు ఏదైనా సినిమాను కనీసం ఆ స్థాయికి తీసుకెళ్ల గలరు అనే నమ్మకాలేమీ కనుచూపు మేరలో కనిపించడం లేదు.

వ్యక్తిగత ప్రతిష్టగా ఎవరూ తీసుకోవడం లేదు!

అవును.. ఈ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలను వ్యక్తిగతంగా విమర్శించడంలో కూడా తప్పేంలేదు. ఎందుకంటే.. వీళ్లకు ఎవరికీ మంచి సినిమాలు తీయాలనే ప్రిస్టేజీ లేదు. ప్రభుత్వం నుంచి స్టూడియోలకు భూములు తీసుకున్నారు. ఆ వందల ఎకరాలను ఎవరికి వారు సామ్రాజ్యాలుగా మలుచుకున్నారు. వాటిల్లో ఎస్టేట్లు కట్టుకుని కుటుంబ ఆస్తులుగా మార్చుకున్నారు.. ఇదే తాము కళామతల్లికి చేస్తున్న సేవ అన్నట్టుగా ఉన్నాయి వీరి బిల్డప్పులు. తమ సినిమాకు పెట్టిన పెట్టుబడి వస్తుందా.. రాదా, థియేటర్లపై మన ఆధిపత్యం ఉందా లేదా, టాలీవుడ్‌లో మన మాట చెల్లుబాటు అవుతుందా కాదా, హైదరాబాద్‌లో ఆస్తులను కాపాడుకున్నామా లేదా, ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములను కమర్షియల్‌గా వాడేసుకొంటూ కోట్లు సంపాదించుకుంటూ.. ఈ విషయంలో అధికార పార్టీల నుంచి ముప్పు రాకుండా చూసుకున్నామా లేదా.. ఇదే పంచాయితీనే టాలీవుడ్ ప్రముఖులది!

ఇక హీరోల సంగతి సరేసరి.. సినిమా ఆరంభించడంతోటే ఎన్ని కోట్లు వచ్చి పడతాయి అనేది మాత్రమే వీళ్ల సమస్య. నిర్మాతకు ఎంతొచ్చింది.. డిస్ట్రిబ్యూటర్లు ఎంత పోగొట్టుకున్నారు.. అనే లెక్కలు కూడా వీరివి కావు. అద్భుతాలు చేయాలనో.. గొప్ప సినిమాలు తీయాలనో ఎవరికీ ఏ కోశానా లేదిక్కడ. సినీ అభిమానాన్ని కుదవ పెట్టి రాజకీయంగా సత్తాచాటాలి, సీఎంలు అయిపోవాలని పక్క చూపులు చూసే వాళ్లే తప్ప.. ఉన్న వత్తికి ఏ మేరకు న్యాయం చేయగలుగుతున్నామనే ఆలోచన కూడా చేయలేనంత కమర్షియల్ అయిపోయారు మనోళ్లు!

స్వార్థం ఉండటంలో తప్పులేదు.. ఆ స్వార్థంలో కొంత సమూహం తరపున ఉంటే బాగుంటుంది. ఈ విషయంలో తమిళులు రెండు రకాలుగా వ్యవహరిస్తున్నారు. ఏ పాత్రనైనా అవలీలగా పండించేసి.. అంతా తామై పని చేసి.. తమ సినిమా స్థాయిని పైస్థాయికి తీసుకెళ్లిన కమల్ లాంటి వాళ్లు ఒక క్యాటగిరీ అయితే, ఒకవేళ సదరు సినిమాల్లో తను నటించలేని పక్షంలో నిర్మాతగా అయినా మారి మంచి సినిమాలకు ఊతమిస్తున్న ధనుష్ లాంటి వాళ్లు మరో క్యాటగిరీ.

అయితే ఈ రెండు రకాల హీరోలూ మన దగ్గర లేరు. ప్రయోగాత్మక పాత్రలు చేయడానికీ ఎవరూ ముందుకు రారు, అలాంటి సినిమాలకు మరో రకంగా ప్రోత్సహమూ మన దగ్గర ఉండదు. ఇక రచయిత, దర్శకుల పని అంటారా.. హీరోల స్వామ్యం అయిన సినీ పరిశ్రమలో.. వీళ్ల అభిరుచి అనుగుణంగా నడుచుకోవడమే వాళ్లపని. హిట్టైన ఫార్ములా కథలేక హీరోలు ప్రాధాన్యతను ఇస్తూ ఉండటంతో.. కొత్త తరహా కథాంశాలతో రావాలన్న ఆసక్తి రచయితల్లో, దర్శకుల్లో ఎలా జనరేట్ అవుతుంది?

ఎన్నాళె్లైనా మన తొడలు మనం కొట్టుకోవాల్సిందే!

టాలీవుడ్‌లో వెల్ సెటెల్డ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు.. అందరూ ఉన్నారు. వంద సినిమాల స్థాయిలో ఉన్న చిరంజీవి, బాలకష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వాళ్లు ఏదైనా ఒక వినూత్న ప్రయోగం చేస్తే వచ్చే నష్టం ఏమీ ఉండదు! కమర్షియల్ .. డబ్బులు రావాలి.. అనే ఇంటెన్షన్‌తోనే కథలను వెదకడం గాక, గొప్ప సినిమా చేయాలనే ఉద్దేశంతో సినిమా చేయగలిగితే.. దానికి పేరు, ప్రఖ్యాతులతో పాటు బోనస్‌గా బోలెడంత డబ్బు కూడా వస్తుంది.

గమనిస్తే అర్థం అయ్యే విషయం ఏమిటంటే... ఆస్కార్ రేసుకు వెళ్లిన ఆ తమిళ సినిమాలన్నీ కూడా దాదాపుగా కమర్షియల్ సెక్సస్‌లే! కోట్ల రూపాయల లాభాలు ఆర్జించినవే! మాస్‌కు కూడా నచ్చినవే! ఏవో ఆర్టు సినిమాలు చేయాలి.. డబ్బులొస్తుందో లేదో అనే టెన్షన్ ఏమీ లేదక్కడ.  

కాబట్టి.. కమర్షియల్ ఫార్ములాకు అనుగుణంగా చేస్తేనే డబ్బు వస్తుంది అనే కట్టుబడి నుంచి బయటకు వచ్చి సినిమాను చేసినా.. కమర్షియల్‌గా లాస్ ఉండదు అనే పాఠాన్ని అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. కానీ.. మనోళ్లకు అలాంటి ఉద్దేశాలు ఏ కోశానా లేవు! ఇంత చరిత్ర కలిగిన ఈ హీరోలు కూడా ఎవరో నమిలి వదిలేసిన రీమేక్ సినిమాలు చేసుకొంటూ అదే ప్రపంచంలో బతికేస్తున్నారంటే.. మనోళ్ల ఆలోచనా స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన హీరోల ఆలోచనా ధోరణి మారదని స్పష్టం అవుతున్న తరుణంలో వీళ్ల ముందు ఎంతగా శంఖం ఊదినా నిరుపయోగమే అనుకోవాల్సి వస్తోంది.

ఇంత చెబుతున్నదీ.. ఆస్కార్‌ను సాధించడానికి కాదు, ఆస్కార్ రేసులో నిలవడానికి మాత్రమే!

ఆస్కార్ అవార్డులు భారతీయ సినిమాలకు రావడం లేదంటే దానికి వేరే థియరీలు వినిపించవచ్చు. జాతి వివక్ష ఆనో.. మన సినిమాలు ఆస్కార్ స్థాయి కన్నా గొప్పవి.. మన సినిమాలకు అవి రాకపోవడం అనేది ఆ అవార్డుల దురదష్టం అనో.. ఇలా ఏదో ఒకటి చెప్పవచ్చు. కానీ ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించడానికి మన సినిమాలు కనీసం పరిశీలన స్థాయికి కూడా చేరడటం లేదు!

ఇక్కడ ఏదో వివక్ష ఉందని, మన సినిమాల స్థాయిని చూసి ఓర్వలేక వాళ్లు సెలెక్ట్ చేయడం లేదని మాట్లాడలేం. కొన్ని వాస్తవాలనైనా ఒప్పుకోవాలి. కాబట్టి.. తెలుగు సినిమా స్థాయి ఏదో అద్భుతం, మనవాళ్లు విశ్వ విఖ్యాత నటసార్వభౌములు, తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్‌ను మించిపోయింది.. అంటూ వ్యాఖ్యానాలు చేసే వెర్రిబాగుల పనులు ఆపితే బాగుంటుంది.

-వెంకట్ ఆరికట్ల

Show comments